ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహీతకు జైలు శిక్ష
x
మహ్మద్ యూనస్

ఆర్థిక వేత్త, నోబెల్ గ్రహీతకు జైలు శిక్ష

ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ కు బంగ్లాదేశ్ కోర్టు సోమవారం జైలు శిక్ష విధించింది.


బంగ్లాదేశ్ కు చెందిన ప్రసిద్ద ఆర్థికవేత్త మహ్మద్ యూనస్ కు స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే అభియోగంతో ఈ శిక్ష విధించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మద్ధతుదారులు మాత్రం ఇది నకిలీ కేసని ఆరోపిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకు ఈ కుట్ర చేశారని విమర్శించారు. ఈయన, మరో ముగ్గురు సన్నిహితులు కలిసి స్థాపించిన గ్రామీణ టెలికామ్ సంస్థలో కార్మికులకు చెందిన వేల్పేర్ ఫండ్ ను తయారు చేయడంలో విఫలం అయ్యారని ఆరోపణలు వచ్చాయి.

నిబంధనల ప్రకారం కార్మికుల చట్టాలను పట్టించుకోకపోవడం వల్ల కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. యూనస్ కార్మిక చట్టాలను ఉల్లఘించినట్లు రుజువు అయిందని కోర్టు ఆవరణలో ఉండగానే న్యాయమూర్తి ప్రకటించారు. అలాగే దోషులకు 25000 టంకాల జరిమానా విధించారు. జరిమానా కట్టనట్లయితే అదనంగా మరో 10 రోజులు జైలులో ఉండాలని తీర్పు చెప్పారు.

అయితే తీర్పు వచ్చిన కాసేపటికే న్యాయమూర్తి ఆయనకు 5000 టంకా పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. అలాగే శిక్షపై హైకోర్టుకు అప్పీల్ చేసేందుకు అనుమతి సైతం మంజూరు చేసింది. అయితే ఆయన మద్దతుదారులు మాత్రం దీనిని రాజకీయకుట్రలో భాగంగానే దోషిగా తేల్చారని ఆరోపిస్తున్నారు. జనవరి 7న బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి.

అయితే ఈ ఆరోపణలు అన్నింటిని యూనస్ ఖండించారు. తాను వాటినుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించడంలేదన్నారు.

మహ్మద్ యూనస్, షేక్ హసీనా ప్రభుత్వానికి మధ్య కొన్ని సంవత్సరాల నుంచి వివిధ గొడవలు ఉన్నాయి. 2008లో అధికారంలోకి వచ్చిన తరువాత హసీనా సర్కార్ ఆయన సంస్థలపై దర్యాప్తు కు ఆదేశించింది. అనేక సంస్థల డైరెక్టర్ల పదవీనుంచి సైతం తప్పించింది. దేశంలోని రాజకీయ నాయకులు కేవలం డబ్బు సంపాదించడానికే ఆసక్తి చూపుతున్నారని అంతకుముందు యూనస్ ఆరోపణలు చేశారు. అలాగే మిలిటరీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు కూడా బంగ్లాదేశ్ లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని సైతం ప్రకటించడం కూడా హసీనా ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం యూనస్ ను రక్తపిపాసీగా పేర్కొంది. పేద మహిళలను రుణ ఊబిలో పడదోసి, వారి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించింది.

గత సంవత్సరం ఆగష్టులో యూనస్ పై 18 మంది మాజీ గ్రామీణ టెలికాం ఉద్యోగులు కేసు పెట్టారు. ఇదే సమయంలో ప్రభుత్వం సైతం విచారణ ప్రారంభించింది. యూనస్ తో పాటు మరో 13 మందిపై కేసు నమోదు చేశారు.

మహ్మద్ యూనస్ ప్రస్తుతం వయస్సు 83 సంవత్సరాలు. 1983లో ఆర్థిక విభాగంలో పేదరిక నిర్మూలన కోసం, బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా చిన్న చిన్న మొత్తాలను(సూక్ష్మరుణాలు) రుణాలు అందజేసే కార్యక్రమం రూపొందించారు. ఇందుకు గాను ఆయనకు 2006లో నోబెల్ బహుమతి స్వీకరించారు.

యూనస్ పై చట్టపరమైన చర్యలు నిలిపివేయాలని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 170 మంది నాయకులు షేక్ హసీనా ప్రభుత్వానికి బహిరంగంగా లేఖ రాశారు. ఇందులో సంతకం చేసిన వారిలో యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ తో సహ మరో 100 మంది నోబేల్ గ్రహీతలు ఉన్నారు.

Read More
Next Story