‘వలసలను గాడిలో పెడతా’
x

‘వలసలను గాడిలో పెడతా’

అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.


అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు దాదాపు మూడు మాసాల ముందు నుంచే అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్రంప్ తరుచుగా చేసే రాజకీయ దాడికి కౌంటర్ ఇస్తూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే విచ్ఛిన్నమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను గాడిలో పెడతామని కమలా హారిస్ హామీ ఇచ్చారు. దక్షిణ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆమె అరిజోనాకు వెళ్లారు. సంవత్సరాలుగా USలో కష్టపడి పనిచేస్తున్న వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తానని హారిస్ చెప్పారు.

‘నాలుగేళ్లలో ట్రంప్ ఏం చేశారు మరి?’

"ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సరిదిద్దడానికి ఏమీ చేయలేదు. ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులు, సరిహద్దు ఏజెంట్ల కొరతను పరిష్కరించేందుకు ఏ చర్యలు తీసుకోలేదు. ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కోవటానికి ఇతర ప్రభుత్వాలతో కలిసి పని చేయలేదు.” అని హారిస్ విరుచుకుపడ్డారు. సమస్యను పరిష్కరించడానికి బదులు ట్రంప్ సమస్య వెంట పరిగెడుతున్నాడని విమర్శించారు. పొలిటికల్ గేమ్స్ ఆడే వారి కంటే సరిహద్దు భద్రత గురించి లోతుగా ఆలోచించే నాయకుడే అమెరికా అధ్యక్షుడు కావాలని అమెరికన్లు కోరుకుంటున్నామని, సరిహద్దు రాష్ట్ర అటార్నీ మాజీ జనరల్‌గా పనిచేసిన తనకు సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం ఎలా చేయాలో అవగాహన ఉందని చెప్పారు.

హారిస్ పై విరుచుకుపడ్డ ట్రంప్..

“కమల హ్యారిస్ గత నాలుగేళ్లలో అక్కడికి వెళ్లలేదు. ఈరోజు ప్రత్యక్షమైంది’’ అని హారిస్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. ‘‘అమెరికన్ కుమారులు, కుమార్తెలను అత్యాచారం చేసి చంపటానికి హింసాత్మక ముఠాలకు అనుమతినిచ్చారు. మీరు కొలరాడోలోని అరోరాకు వెళ్లండి. అక్కడ వారు భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రతిష్టాత్మకమైన చిన్న పట్టణాలను శరణార్థి శిబిరాలుగా మార్చేశారు.’’ అని ఆరోపించారు.

నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో 59 ఏళ్ల హారిస్, 78 ఏళ్ల ట్రంప్‌తో తలపడనున్నారు.

Read More
Next Story