‘‘అలా కలలు కంటూనే ఉండండి’’ : ఇరాన్ సుప్రీం లీడర్
x
ఇరాన్ సుప్రీంలీడర్ అయుతుల్లా అలీ ఖమేనీ

‘‘అలా కలలు కంటూనే ఉండండి’’ : ఇరాన్ సుప్రీం లీడర్

ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా అధ్యక్షుడికి ఖమేనీ చురకలు


జూన్ లో అమెరికా జరిపిన వైమానిక దాడులలో టెహ్రాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశామనే ట్రంప్ ప్రకటనలపై ఇరాన్ స్పందించింది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ.. కలలు కంటూనే ఉండండని అమెరికా అధ్యక్షుడికి చురకలు వేశారు.

‘‘ఇరాన్ అణు పరిశ్రమపై బాంబుదాడి చేసి నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నారు. చాలా బాగుంది. కలలు కనడం కొనసాగించడి’’ అని తన వెబ్ సైట్ లో ఖమేనీ అన్నారు.
జూన్ 13న ఇజ్రాయెల్, ఇరాన్ పై వైమానిక దాడులు ప్రారంభించింది. కీలక సైనిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. ఫలితంగా రెండు దేశాల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న అణు చర్చల ప్రతిపాదనను కూడా ఖమేనీ తోసిపుచ్చారు.
ట్రంప్ బెదిరిస్తున్నారు: ఖమేనీ
ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఐఆర్ఎన్ఏ ప్రకారం.. ఇరాన్ అణు కేంద్రాలను నిర్వహిస్తుందనే ట్రంప్ వ్యాఖ్యలను ఆయన ప్రశ్నించారు. కేవలం అణు మౌలిక సదుపాయాల కారణంగా ఒక దేశానికి నిబంధనలను నిర్దేశించి ఆంక్షలు విధించడానికి ఏ దేశానికి హక్కు లేదన్నారు.
‘‘కలలు కనడం కొనసాగించండి. కానీ ఒక దేశం అణు వ్యవస్థను నిర్వహిస్తోంది కాబట్టి ఏమి చేయాలో, చేయకూడదో నిర్ణయించడానికి మీరు ఎవరూ? ఇరాన్ కు అణు సామర్థ్యం ఉన్నా.. లేకపోయినా దానికి అమెరికాతో ఏం సంబంధం. ఇటువంటి జోక్యం అంగీకరించం, ఇది కచ్చితంగా బెదిరింపు’’ అని ఖమేనీ అన్నట్లు ఐఆర్ఎన్ఏ అంది. ట్రంప్ నిజంగా శక్తివంతుడైతే అమెరికాలోని అనేక రాష్ట్రాలలో ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్ననిరసనలను శాంతింపజేయాలని అన్నారు.
పశ్చిమాసియాను బెదిరిస్తున్నారు
ఇజ్రాయెల్- గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరువాత ట్రంప్ పశ్చిమాసియాలో పర్యటించారు. అనంతరం ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని ఎప్పటిలాగే సెల్ప్ క్రెడిట్ ఇచ్చుకున్నారు. అమెరికా దాడుల తరువాత ఇరాన్ పశ్చిమాసియాను ఇక బెదిరింపులకు గురి చేయలేదని వ్యాఖ్యానించారు. వారి అణ్వాయుధ సామర్థ్యం పూర్తిగా నాశనం చేసినట్లు గొప్పలు చెప్పారు.
అణు కేంద్రాల నష్టం తెలియదు..
అమెరికా దాడుల వల్ల ఇరాన్ అణు కేంద్రాల వల్ల జరిగిన వాస్తవ నష్టం ఇంకా తెలియదని, ఈ దాడులు ఇరాన్ అణు శుద్ది కార్యక్రమాన్ని రెండు సంవత్సరాల వరకూ ఆలస్యం చేస్తాయని పెంటగాన్ పేర్కొన్నట్లు అమెరికా ప్రసార మాధ్యమాలు కథనాలు ప్రసారం చేశాయి.
అమెరికా నిఘా నివేదిక ప్రకారం ఈ ఆలస్యం కేవలం కొన్ని నెలలు మాత్రమే. టెహ్రాన్- వాషింగ్టన్ మధ్య ఏప్రిల్ లో ఆరో రౌండ్ అణు చర్చలకు ముందు ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రాజుకుంది.
అమెరికా తన దేశంపై సైనిక చర్యకు హమీ ఇస్తేనే చర్చలు జరుపుతామని ఇరాన్ పట్టుబట్టింది. ఇంతకుముందు ఇరాన్ తో పీ5+1 దేశాలు అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే 2018 లో అధికారంలోకి వచ్చిన ట్రంప్ దాన్ని రద్దు చేశారు. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి కారణమైంది.
Read More
Next Story