దక్షిణ కొరియాలో మార్షల్ లా.. ఆరు గంటల్లోనే ఉపసంహరణ
దక్షిణ కొరియాలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉత్తర కొరియా బూచిని చూపి అధ్యక్షుడు దేశంలో మార్షల్ లా విధించినట్లు ప్రకటించారు. అయితే..
దక్షిణ కొరియాలో సోమవారం రాత్రి నుంచి బుధవారం వరకూ నాటకీయా పరిణమాలు చోటు చేసుకున్నాయి. దేశంలో మార్షల్ లా ప్రకటించిన అధ్యక్షుడు ‘యూన్ సుక్ యోల్’, శాసన సభ్యులతో పాటు ప్రజలు సైతం నిరసనలకు దిగడంతో తిరిగి మార్షల్ లా ను ఉపసంహరించించుకున్నట్లు ప్రకటించారు.
ఈ పరిణామంతో ఆయన ప్రభుత్వంలోకి కీలక కార్యదర్శులు రాజీనామా సమర్పించారు. అధ్యక్షుడు సైతం రాజీనామా చేయాల్సిందే అని అక్కడి నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తర కొరియా నుంచి సైనిక ఉద్రిక్తలు పెరుగుతుండటం, దేశంలో నెలకొని ఉన్న అస్థిరత, భయాల నేపథ్యంలో దక్షిణ కొరియాలో మార్షల్ లా ను విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సోమవారం అర్థరాత్రి టెలివిజన్ లో ప్రసంగించిన ఆయన వెంటనే దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తెలియజేశారు. సైన్యాన్ని దేశ వ్యాప్తంగా మోహరింపజేయనున్నట్లు అలాగే, కమ్యూనిస్టు శక్తులను అణచివేస్తామని హెచ్చరించారు.
ప్రకటన వెలువడిన వెంటనే దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో నిరసనలు ప్రారంభం అయ్యాయి. చట్టసభ సభ్యులతో పాటు ప్రజలు నిరసనలకు దిగారు. జాతీయ అసెంబ్లీలో దీనిపై ఓటింగ్ నిర్వహించి అధ్యక్షుడి ప్రకటనను ఖండించారు.
నాటకీయ పరిణామాలలో,దక్షిణ కొరియాలో మార్షల్ లా విధించిన కొన్ని గంటల తర్వాత ఉపసంహరించబడింది. ఈ విరమణ ప్రకటనను కూడా తిరిగి అధ్యక్షుడే చేయాల్సి వచ్చింది.
విధింపు.. ఉపసంహరణ..
బుధవారం (డిసెంబర్ 4) తెల్లవారుజామున 4.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం, భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1 గంటలకు) దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో అధ్యక్షుడు యూన్ ఇలా మాట్లాడుతూ.. “కొద్దిసేపటి క్రితం, అత్యవసర పరిస్థితిని ఎత్తివేయాలని జాతీయ అసెంబ్లీ నుంచి డిమాండ్ వచ్చింది.
మేము మార్షల్ లా కార్యకలాపాల కోసం మోహరించిన సైన్యాన్ని ఉపసంహరించుకున్నాము. మేము నేషనల్ అసెంబ్లీ అభ్యర్థనను అంగీకరిస్తాము. క్యాబినెట్ సమావేశం ద్వారా యుద్ధ చట్టాన్ని ఎత్తివేశాం’’ అని పేర్కొన్నారు.
జాతీయ అసెంబ్లీ ఓటింగ్‌ను గౌరవించాలని అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ ఇద్దరూ అంగీకరించగా, దక్షిణ కొరియా క్యాబినెట్ అరగంట తర్వాత ఉదయం 5 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సైనిక చట్టాలను అధికారికంగా ఎత్తివేసే తీర్మానాన్ని ఆమోదించింది. దక్షిణ కొరియా చివరిసారిగా 1980లో మార్షల్ లా విధించింది.
చివరి ప్రయత్నమా?
" రాష్ట్ర వ్యతిరేక శక్తులను" అణిచివేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు యూన్ మంగళవారం పేర్కొన్నారు. అయినప్పటికీ, సైనిక చట్టాన్ని ధిక్కరిస్తూ, నినాదాలు చేస్తూ రాజకీయ నాయకులు, నిరసనకారులు దేశ పార్లమెంటు (నేషనల్ అసెంబ్లీ) వెలుపల సమావేశమయ్యారు.
భద్రతా దళాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను కాల్చడానికి ప్రయత్నించాయి. మార్షల్ లా డిక్రీ తర్వాత దక్షిణ కొరియా కరెన్సీ, వోన్, అలాగే దాని బెంచ్‌మార్క్ కోస్పి ఇండెక్స్ దెబ్బతింది, అయితే అది ఉపసంహరించుకోవడంతో రెండూ త్వరగా కోలుకున్నాయి.
ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అతని పీపుల్ పవర్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటి నుండి అధ్యక్షుడు యూన్ రాజకీయ ఒత్తిడిలో ఉన్నారు. ప్రతిపక్షం పార్లమెంటులో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రెసిడెంట్ యూన్ జాతీయ రేటింగ్ కూడా ఇటీవల దాదాపు 20 శాతానికి పైగా పడిపోయింది. అందుకోసం అధ్యక్షుడు ఈ విధంగా మార్షల్ లా ను విధించి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story