జపాన్ లో భారీ భూకంపం,సునామీ హెచ్చరికలు జారీ
x
జపాన్ భూకంపం

జపాన్ లో భారీ భూకంపం,సునామీ హెచ్చరికలు జారీ

జపాన్ ను కొత్త సంవత్సరం రోజు భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.5 గా నమోదు అయింది.


జపాన్ ను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో నమోదు అయింది. ఈ ప్రభావంతో జపాన్ పశ్చిమ తీరం మొత్తం చిగురుటాకుల వణికిపోయింది. వాయువ్య తీరానికి మొత్తం సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు జపాన్ లోని ఇషికావా తీరంలో భూకంపం సంభవించింది.

జపనీస్ పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ ఎన్ హెచ్ టీవీ ప్రకారం సముద్రపు అలలు 5 మీటర్ల స్థాయి( 16.5) అడుగులు చేరుకోవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత త్వరగా ఎత్తైన భవనాలకు చేరుకోవాలని ప్రజలను హెచ్చరించింది. హెచ్చరికలు జారీ చేసిన గంట తరువాత కూడా అలలు వస్తూనే ఉంటాయని తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మొదటి భూకంపం సంభవించిన తరువాత కూడా అనేక చిన్న చిన్న భూకంపాలు జపాన్ ను వణికించాయి.

జపాన్ తీర ప్రాంతంలోని ప్రజలు వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ప్రభుత్వ అధికారి యోషిమాసా హయాషీ విలేకరులతో చెప్పారు.‘ప్రతి నిమిషానికి మనకు విలువైనదే దయచేసి సురక్షిత గమ్యస్థానాలను చేరండి’ అని కోరారు.

జపాన్ పశ్చిమ తీరంలోని నీగాటాతో సహ ఇతర ప్రాంతాలలో దాదాపు 3 మీటర్లు( 10 అడుగుల) మేర సునామీ అలలు వస్తాయని హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. అలాగే రష్యా ఆధీనంలోని సఖాలిన్ ద్వీపానికి సైతం సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే దక్షిణ కొరియాలోని తీర ప్రాంతాలకు సైతం సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

సునామీ, భూకంపాల సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందించేందుకు అత్యవసర కేంద్రాన్నిఏర్పాటు చేసినట్లు ప్రధాని పుమియే కిషిదా విలేకరుల సమావేశంలో చెప్పారు. భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు చేస్తున్నామని వివరించారు.

నిలిచిన బుల్లెట్ రైళ్లు

భారీ భూకంపంతో టోక్యో- ఇషికావా ప్రాంతాల మధ్య బుల్లెట్ రైళ్లు నిలిపివేసినట్లు జపాన్ రైల్వే తెలిపింది. ఇషికావా ప్రాంత అధికారులు మాట్లాడుతూ.. భూకంపం కారణంగా అనేక విద్యుత్ స్తంభాలు, ఇళ్లు దెబ్బతిన్నాయని వివరించారు. కొన్ని నివేదికల ప్రకారం ఒక మీటర్ ఎత్తున్న సునామీ అలలు సైతం ఉత్తర తీరానికి చేరినట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7.21 నిమిషాలకు వాజినామా పోర్ట్ ను 1.2 మీటర్ల( 4 అడుగులు) ఎత్తులో అలలు తాకినట్లు జాతీయ ప్రసార సంస్థ ఎన్ హెచ్ కే తెలిపింది.

జపాన్ లో అత్యధిక భూకంపాలు

జపాన్ లో ఏటా దాదాపుగా 5 వేల భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంటుంది. ఇక్కడే నాలుగు కాంటినెంటల్ ఫ్లేట్స్ ఉంటాయి. ద పసిఫిక్, ఫిలిఫ్పైన్స్, యూరేషియస్, నార్త్ అమెరికా ప్లేట్లు తరుచుగా కదులుతూ ఉంటాయి. అందుకే భూకంపాలు సంభవిస్తుంటాయి. అంతే కాకుండా 450 అగ్ని పర్వతాలు కూడా ఇదే ప్రాంతంలో ఉండడం వల్ల జపాన్ లో నిరంతరం భూకంపాలు వస్తుంటాయి.

Read More
Next Story