ట్రంప్ టారిఫ్ కు ‘మెర్కోసూర్’ చెక్
x

ట్రంప్ టారిఫ్ కు ‘మెర్కోసూర్’ చెక్

ఈయూతో దక్షిణ అమెరికా దేశాల స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం ఖరారు, ప్రపంచ వాణిజ్యం నుంచి క్రమంగా ఒంటరి అవుతున్న యూఎస్


సుంకాలతో శత్రు దేశాలతో పాటు మిత్రులను కూడా బేంబేలెత్తిస్తున్న ట్రంప్ కు దక్షిణ అమెరికా దేశాల కూటమి అయిన మెర్కోసూర్ చెక్ పెట్టింది. యూరోపియన్ యూనియన్(EU) తో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని(FTA) ఆమోదించింది. ఈ చర్య అమెరికా అధ్యక్షుడు యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలపై వేసిన కొత్త సుంకాల(Tariffs) ఒత్తిడికి వ్యూహాత్మక ప్రతిస్పందనగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వేలతో కలిసి మెర్కోసూర్ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఒప్పందంపై శనివారం పరాగ్వేలోని అసున్సియోన్ లో సంతకాలు జరిగాయి.
ఈ రెండు కూటముల మధ్య 25 సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఎట్టకేలకు తాజాగా అమల్లోకి రానున్నాయి. ట్రంప్(Trump) పదేపదే యూరప్ ను టార్గెట్ చేయడంతో ఈ ఒప్పందం కుదిరింది.
అంతర్జాతీయ వార్తా సంస్థల ప్రకారం యూరప్, దక్షిణ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఈ ఒప్పందం వల్ల బలోపేతం అవుతాయి. గ్రీన్ లాండ్ పై అమెరికా మొండివాదనలను యూరప్ ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఈయూపై అదనంగా పది శాతం సుంకాలు విధించారు.
తాజా ఒప్పందం ప్రకారం దక్షిణ అమెరికా వ్యవసాయ ఎగుమతుల నుంచి యూరోపియన్ పారిశ్రామిక ఉత్పత్తుల వరకూ దాదాపు 90 శాతం సుంకాలు తొలగిపోనున్నాయి. రెండు కూటములలో 700 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.
వ్యూహాత్మక విజయం..
దక్షిణ అమెరికాలోని మెర్కోసూర్ కూటమితో ఒప్పందం కుదరడం వ్యూహాత్మ విజయమని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్ అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడి పేరు తీయకుండా రక్షణాత్మక విధానాలు అనుసరిస్తున్న ఆయన తీరును ఎండగట్టారు.
‘‘మేము సుంకాలకు బదులు న్యాయమైన వాణిజ్యాన్ని ఎంచుకుంటాము. మేము ఒంటరితనం కుంటే ఉత్పాదక దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఎంచుకుంటాము’’ అని లేయన్ ఉద్ఘాటించారు. వాషింగ్టన్ తో దూరం పెరుగుతన్న నేపథ్యంలో పొత్తులను మరింతగా పెంచుకోవాలని ఈయూ భావిస్తోంది.
ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక సుంకాల యుద్ధం తీవ్రమైంది. భౌగోళిక రాజకీయ ఆధిపత్యాలు, అమెరికా- చైనా మధ్య పోటీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఈయూ కూడా క్రమంగా తన పట్టును పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ లూలా డా సిల్వ సంతకాల కార్యక్రమానికి హజరుకాకపోయినా ఈ ఒప్పందాన్ని బహుపాక్షికతకు విజయం ప్రశంసించారు. ‘‘ఏకపక్ష వాదం మార్కెట్లను వేరు చేస్తున్న సమయంల, రక్షణ వాదం ప్రపంచ వృద్ధిని నిరోధిస్తున్న సమయంలో ప్రజాస్వామ్య విలువలను పంచుకునే రెండు ప్రాంతాలు ఒకే మార్గాన్ని ఎంచుకున్నాయి’’ లాలా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ఒప్పందం అమెరికా ఇంకా స్పందించలేదు.
అధికారిక ఆమోదం అవసరం..
ఈ ఒప్పందంపై మెర్కోసూర్ కూటమి సంతకం చేసినప్పటికీ యూరోపియన్ పార్లమెంట్ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందంపై కొన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు తనకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని భావిస్తున్నారు. దక్షిణ అమెరికాలోని చవకైన వ్యవసాయ ఉత్పత్తులు ఈయూను ముంచెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫ్రాన్స్ వ్యవసాయదారులను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.
బ్రస్సెల్స్ పర్యావరణ రక్షణ చర్యలు, బీఫ్, చక్కెర వంటి వ్యవసాయ దిగుమతులపై కోటాలు విధించడం, సుంకాల తొలగింపు, యూరోపియన్ రైతులకు సబ్సిడీలు అందించడం, రాయితీలు అందించడం తరువాతనే ఈ ఒప్పందం ముందుకు కదిలింది.
ఈ ఏడాది ప్రథమార్థంలో యూరోపియన్ చట్టసభ సభ్యుల ఆమోదం కోసం తీవ్ర లాబీయింగ్ ప్రారంభిస్తామని ఈయూ ట్రేడ్ కమిషనర్ మారోస్ సెఫ్కోవిక్ అన్నారు. ఆయన కూడా పరోక్షంగా అమెరికా సుంకాల విధానాన్ని విమర్శించారు.
మెర్కోసూర్ కూటమికి..
స్వేచ్ఛాయుత వాణిజ్యం ఒప్పందం వల్ల మెర్కోసూర్ కూటమి కూడా లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణ అమెరికా రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభాలు, రక్షణ విధానాల మధ్య ఇబ్బంది పడుతోంది.
అయితే అర్జెంటీనా అధ్యక్షుడు మాత్రం ఒప్పందానికి భిన్నంగా తన స్వరం వినిపించాడు. గతంలోనూ మెర్కోసూర్ కూటమిని జైలుగా అతను అభివర్ణించారు. ట్రంప్ ను విపరీతంగా ఆరాధించే అతను ఈ వ్యాఖ్యలు చేశారు.
మెర్కోసూర్ లో ప్రస్తుతం బొలీవియా కూడా ఉంది. కానీ పాత చర్చలలో అది పాల్గొనకపోవడంతో తాజా ఒప్పందంలో చేర్చలేదు. భవిష్యత్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. వెనెజువెలాను కూటమి నుంచి సస్పెండ్ చేశారు.
సుంకాల బెదిరింపుల నేపథ్యంలో..
ఈయూ- మెర్కోసూర్ కూటమి వాణిజ్య భాగస్వామ్యాలను వైవిధ్యపరచడానికి, అమెరికా విధిస్తున్న సుంకాల బారీ నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికాను కాదని కొత్త మార్కెట్ల కోసం రెండు కూటములు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
జూలై 2025 లో ఈయూ, యూఎస్ పరిమిత వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ద్వారా ఈయూకు గరిష్టంగా 15 శాతం సుంకాలు మాత్రమే విధించారు. అమెరికా- ఈయూ ప్రకటనల ప్రకారం కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు. ఈ ఒప్పందం తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించినప్పటికీ ట్రంప్ యొక్క వాచాలత్వంతో తరువాత ఆగిపోయింది.
యూఎస్ నుంచి 50 శాతం సుంకాలు ఎదుర్కొంటున్న భారత్, యూకే, ఈయూ, ఇతర ఇండో పసిఫిక్ భాగస్వాములతో వాణిజ్య ఒప్పందాలపై దూకుడుగా ముందడుగు వేస్తోంది.
జూలై 2025 లో భారత్, యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 120 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాయి. దీనిప్రకారం సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం పై సంతకం చేశాయి.
ఈ ఒప్పందం వల్ల వస్తువులు, పెట్టుబడులు, సేవలు, పెట్టుబడి చలనశీలతకు అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచ వాణిజ్య అస్థిరతకు వ్యతిరేకంగా హెడ్జ్ చేయడానికి న్యూఢిల్లీ చేస్తున్న ప్రయత్నాలను తెలియజేస్తుంది.
కెనడా ప్రభుత్వం ప్రకటన ప్రకారం.. కెనడా- ఇండోనేషియా మధ్య గత ఏడాది సెప్టెంబర్ లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ) సంతకం చేశాయి. ఇవి తమ మధ్య ఉన్న వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ప్రయత్నిస్తాయి.
కెనడా ఇప్పటికే యూఎస్ కంటే మెక్సికో నుంచి ఎక్కువ సంఖ్యలో కార్లను దిగుమతులు చేసుకుంటోంది. మరో వైపు దక్షిణ అమెరికా కూటమితోనూ స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది.
ఇదే సమయంలో అమెరికాకు చైనా నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి.(2025 లో ఒక నెలలో 33 శాతం పడిపోయాయి) ఆగ్నేయాసియా, ఈయూ, ఆఫ్రికాకు తమ ఎగుమతులను చైనా క్రమంగా పెంచుకుంటోంది.
న్యూజిలాండ్, సింగపూర్, స్విట్జర్లాండ్, యూఏఈతో సహ 14 దేశాల బృందం తమ మధ్య పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్జెన్ స్టెయిన్ లతో కూడిన యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కూడా అక్టోబర్ 1, 2025 నుంచి భారత్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమలు చేసుకుంది. ఇవన్నీ కూడా అమెరికా క్రమంగా ఒంటరిగా మారుతుందని తెలియజేస్తున్నాయి.
పున: సమీక్షలో ప్రపంచ వాణిజ్యం..
యూఎస్ విధిస్తున్న సుంకాల దెబ్బతో ప్రపంచం వాణిజ్యం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. అమెరికాతో అన్నింటిని ఆయుధాలుగా మార్చగలదని ప్రపంచ దేశాలు గుర్తించి దాని ఆధిపత్యం నుంచి పక్కకు జరిగే ప్రయత్నాలు మెల్ల మెల్లగా చేస్తున్నాయి.
ప్రస్తుతం కుదిరిన ఏ ఒప్పందంలో వాషింగ్టన్ ను లక్ష్యంగా చేసుకోకపోయినా వాటి సమయం, ప్రపంచ వాణిజ్యంలో వాటి వాటా కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయ మీడియా వాదనల ప్రకారం.. ఈయూ- మెర్కోసూర్ ఒప్పందం ప్రపంచ వాణిజ్యానికి ఓ సంకేతం. సుంకాల యుద్ధం తలెత్తిన తరువాత ప్రాంతీయ కూటములు తమ శక్తిని తగ్గించుకోకుండా వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి బలంగా ప్రయత్నిస్తున్నాయి.
Read More
Next Story