చైనా సరిహద్దు దగ్గర పోస్టునే కబ్జా చేశారు
x

చైనా సరిహద్దు దగ్గర పోస్టునే కబ్జా చేశారు

మయన్మార్ సైన్యం నుంచి తిరుగుబాటుదారులు చైనా సరిహద్దులో గల కిన్ క్యాన్ అనే సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో మయన్మార్ సైన్యానికి అవసరమైన కీలక ఆయుధాలు, నగదు రవాణా జరగకుండా తిరుగుబాటుదారులు అడ్డుకట్ట వేసినట్లు అయింది.


ఇప్పటికే ఉత్తర మయన్మార్, మధ్య మయన్మార్ పై తిరుగుబాటు దారులు తమ పట్టుబిగించారు. రెండు రోజుల క్రితం మయన్మార్ లోకి చైనా పంపించిన 258 ట్రక్కుల్లో 120 పై దాడి జరగడంతో అవి పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. వాటిపై తిరుగుబాటుదారులే దాడి చేశారని జుంటా పాలకులు ఆరోపించగా, తిరుగుబాటుదారులు వాటిని ఖండించారు. దీనిని సాకుగా తీసుకుని చైనా ఆర్మీ మయన్మార్ సరిహద్దులో సైనిక విన్యాసాలు నిర్వహించడానికి నడుంబిగించింది. ఈ నేపథ్యంలో మయన్మార్ ఆర్మీని ఓడించి తిరుగుబాటుదారులు చైనా సరిహద్దులోని సైనిక పోస్టును స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 2021లో తొలగించిన మయన్మార్ జుంటా పాలకులు, మూడు సంవత్సరాలుగా పాలన చేస్తూ ప్రజలను నానావిధాలుగా హింసిస్తున్నారు. ప్రజాస్వామ్య నేత అంగ్ సాన్ సూకిని గృహనిర్భంధంలోకి పంపించారు. మహిళలు, చిన్నపిల్లలు అనే తేడా లేకుండా అందరికి నరకం చూపిస్తున్నారు. ప్రజాస్వామ్య నేత అంగ్ సాన్ సూకీకి సైన్యం గృహనిర్భంధం విధించింది. దీనిని నిరసిస్తూ, ప్రజాస్వామ్య పునరుద్దరణ కోరుతూ అక్కడి యువత సాయుధ పోరాటం చేస్తున్నారు. అది ఈ మధ్య తీవ్ర రూపం దాల్చి , సైనికులే స్వచ్చందంగా తిరుగుబాటుదారులకు ఆయుధాలతో లొంగిపోతున్నారు. దీంతో దేశంలోని చాలా ప్రాంతాలపై మిలటరీ జుంటా పాలకులు తమ పట్టును కోల్పోయారు. దీంతో చాలామంది సైనికులు ప్రాణ భయంతో భారత సరిహద్దు రాష్ట్రాలైన మణిపూర్, మిజోరాంలకి చొరబడుతున్నట్లు మన సైన్యం గుర్తించింది. వారందరిని తిరిగి ఆ దేశానికే అప్పగించింది. ఇలా అప్పగించిన వారి సంఖ్య దాదాపు 70 కి పైగా ఉందని భారత ప్రభుత్వం ప్రకటించింది.

జుంటా పాలనకు మొదటి నుంచి చైనా మద్దతు పూర్తిగా ఉంది. మయన్మార్ సైన్యానికి అవసరమైన ఆయుధాలను అందిస్తూ, అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి రాకుండా చూసుకుంటోంది. బీజింగ్, రంగూన్ కు పంపినట్లు చెబుతున్న ట్రక్కుల్లో ప్రజలకు అవసరమైన బట్టలు, వినియోగ వస్తువులు, కొంత నిర్మాణ సామగ్రి ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. వాటిలో సగానికి పైగా ట్రక్కులు కాలిపోవడంతో , ఇదే అదనుగా చైనా సైన్యం మయన్మార్ సరిహద్దులకు సైన్యాన్ని తరలించడాన్ని వేగవంతం చేసింది. సరిహద్దుల్లో తాము సైనిక విన్యాసాలు చేయనున్నట్లు చైనా సామాజిక మాధ్యమం వీ చాట్ లో వెల్లడించింది. అయితే ఎంతమంది సైనికులు వస్తారు. ఎలాంటి ఆయుధాలతో విన్యాసాలు చేస్తారనే దానిపై సరైన సమాచారం లేదు. ఈ సమాచారాన్ని జుంటా అధికార ప్రతినిధి జా తున్ మిన్ కూడా ధృవీకరించారు. సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత కొనసాగించడానికి చైనా సైన్యం వస్తుందని వెల్లడించారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సైనిక సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. అయితే ఇది ఎక్కడకు దారి తీస్తుందో అని సరిహద్దు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read More
Next Story