
అమెరికా లో కొత్త నినాదం ప్రకటించిన మోదీ
మేక్ అమెరికా గ్రేట్ అగైన్,(మగా) తో ‘మిగా’ కలిస్తే మెగా భాగస్వామ్యమన్న భారత ప్రధాని
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో వైట్ హౌజ్ లో భేటీ అయ్యారు. రెండోసారి యూఎస్ఏ ప్రెసిడెంట్ అయ్యాక ట్రంప్ తో మోదీ భేటీ కావడం ఇదే మొదటి సారి. రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌజ్ ఇరువురు దేశాధినేతలు కరచాలనం చేసుకున్నారు.
‘‘ నేను నిన్ను మిస్ అయ్యాను.. అంటే నేను నిన్ను చాలా మిస్ అయ్యాను’’ అని ఒకరినొకరు పలకరించుకున్నారు. తరువాత వెంటనే ఇద్దరు దేశాధినేతలు కూడా మీడియాతో మాట్లాడారు. వైట్ హౌజ్ లో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించినట్లు ప్రకటించారు.
‘‘ అమెరికా అధినేత ఎప్పుడూ తన దేశానికి మొదటి స్థానం ఇస్తారు. అలాగే నేను కూడా అని’’ మోదీ అన్నారు. ఇది మా ఇద్దరి మధ్య సాధారణంగా ఉన్న అలవాటని అన్నారు. దీనికి ట్రంప్ సమాధానమిస్తూ ‘‘ మోదీ తన దేశం కోసం గొప్ప పని చేస్తున్నాడు’’ అన్నారు. మోదీతో తనకు గొప్ప స్నేహం ఉందని, దీని ఆధారంగా రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని అన్నారు.
మగా.. అండ్ మిగా..
ట్రంప్ ఎన్నిక కావడానికి ఉపయోగించిన మగా( మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ) ను గుర్తు చేస్తూ మోదీ ఇక్కడ ‘మిగా’( మేక్ ఇండియా గ్రేట్ అగైన్) ను ప్రకటించారు. భారత్ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రయాణిస్తుందని, మగా- మిగా కలిస్తే ‘మెగా’ భాగస్వామ్యం ఏర్పడి, ప్రజా శ్రేయస్సు సాధిస్తుందని అన్నారు. మా ఇద్దరి మధ్య ప్రస్తుతం వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేస్తామన్నారు.
తహవ్వూర్ రాణాకి అప్పగింతకి ఒకే..
ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చల అనంతరం 26/11 దాడుల సూత్రధారిగా భావిస్తున్న పాక్- కెనడియన్ తహవ్వుర్ రాణాని అప్పగించడానికి ట్రంప్ అంగీకరించారు.
ప్రస్తుతం ఇతను అమెరికా జైలులో బందీగా ఉన్నారు. చాలా సంవత్సరాలుగా ఇతను అనేక పిటిషన్లు వేస్తూ కాలయాపన చేయగా, ప్రస్తుతం అన్ని కోర్టులు అతడి పిటిషన్ లను కొట్టివేశాయి.
‘‘మేము చాలా డేంజర్ పర్సన్ అయినా ఉగ్రవాది, 26/11 దాడుల్లో భాగం ఉందని భావిస్తున్న అతడిని భారత్ కు అప్పగించబోతున్నాం’’ అని ట్రంప్ చెప్పారు.
ఈ సమావేశంలో మోదీ తో పాటు విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్, అమెరికాలో భారత దౌత్యవేత్త వినయ్ మోహాన్ క్వాత్రా ఉన్నారు.
Next Story