మెక్సికోలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ అరెస్ట్..
x

మెక్సికోలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ అరెస్ట్..

కార్టెల్ హింసలో 11 మంది మృతి


Click the Play button to hear this message in audio format

అమెరికా ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న మెక్సికోకు చెందిన కరడుగట్టిన డ్రగ్ మాఫియా నాయకుడు ఫౌస్టో ఇసిడ్రో మెజా ఫ్లోరెస్ అరెస్టయ్యాడు. అయితే ఈ అరెస్టు మెక్సికోలో తీవ్ర హింసకు దారితీసింది. కార్టెల్ సభ్యులు భద్రతా బలగాలపై ఎదురుదాడికి దిగడంతో జరిగిన కాల్పుల్లో ఏడుగురు అనుమానిత ముఠా సభ్యులు, నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 11 మంది మరణించడంతో వాయువ్య మెక్సికోలోని సినాలోవా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మెజా ఫ్లోరెస్‌ను ఎల్ చాపో ఇసిడ్రోగా పిలుస్తారు. 44 ఏళ్ల ఇతడు కొన్నేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు. ఇతడి ఆచూకీ తెలిపిన వారికి అమెరికా ప్రభుత్వం 50 లక్షల డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది. ఎట్టకేలకు మెక్సికో సైన్యం గ్వాసావే నగర సమీపంలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో అతడిని అదుపులోకి తీసుకుంది.
ఈ ఆపరేషన్‌లో మెజా ఫ్లోరెస్‌తో పాటు అతడి ముఠాకు చెందిన మరో ఇద్దరు కీలక వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. వీరిలో జర్మన్ ఎన్ అలియాస్ సెరాఫిన్ ముఠా రెండో స్థాయి నాయకుడిగా, జోస్ ఎన్ ఆర్థిక వ్యవహారాలను చూసే వ్యక్తిగా అధికారులు గుర్తించారు.
అయితే ఈ అరెస్టు అంత సులభంగా జరగలేదు. మెక్సికో భద్రతా బలగాలు మెజా ఫ్లోరెస్ దాక్కున్న భవనాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించగానే, కార్టెల్ సభ్యులు తుపాకులు, పేలుడు పదార్థాలతో దాడికి దిగారు. దీంతో భద్రతా బలగాలకు, ముఠా సభ్యులకు మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి.
మరోవైపు, కార్టెల్ సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లను దిగ్బంధించారు. వాహనాలకు నిప్పుపెట్టారు. రోడ్లపై ట్రక్కులు, ఇతర వాహనాలు తగలబడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. సైనిక హెలికాప్టర్లు, డ్రోన్లు నగరంపై చక్కర్లు కొట్టాయి. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు, వ్యాపార సముదాయాలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి.
ఈ పరిస్థితుల్లో మెజా ఫ్లోరెస్‌ను అక్కడి నుంచి తరలించడం కూడా సైన్యానికి సవాలుగా మారింది. కార్టెల్ సభ్యులు కనీసం పది చోట్ల రహదారులపై అడ్డంకులు సృష్టించడంతో అతడిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి గంటల సమయం పట్టింది. శనివారం తెల్లవారుజామున అతడిని, మరో ఇద్దరు నిందితులను మెక్సికో సిటీకి తరలించారు.
ఇక మెజా ఫ్లోరెస్ నేర ప్రస్థానం చూస్తే.. మొదట చిన్న స్థాయి డ్రగ్స్ వ్యాపారిగా, స్క్రాప్ మెటల్ వ్యాపారిగా ఉన్న అతడు క్రమంగా మెక్సికోలో శక్తిమంతమైన మాఫియా నాయకుడిగా ఎదిగాడు. 2008లో సినాలోవా కార్టెల్ నుంచి విడిపోయిన బెల్ట్రాన్ లేవా సంస్థలో కీలకంగా ఎదిగాడు. ఆ తర్వాత మెజా-ఫ్లోరెస్ ట్రాన్స్‌నేషనల్ క్రిమినల్ ఆర్గనైజేషన్‌ను స్థాపించి, లాస్ మజాట్లెకోస్ పేరుతో కార్యకలాపాలు సాగించాడు.
ఈ ముఠా అమెరికాలోకి హెరాయిన్, కొకైన్, మెథాంఫెటమైన్, ఫెంటానిల్, గంజాయి వంటి మాదకద్రవ్యాలను అక్రమంగా యూఎస్ కు గత 14 ఏళ్లుగా తరలిస్తున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. అంతేకాకుండా కిడ్నాప్‌లు, బెదిరింపులు, హత్యలు, చిత్రహింసలు వంటి నేరాల్లోనూ ఈ సంస్థకు సంబంధాలున్నట్లు పేర్కొన్నాయి. రెండు దశాబ్దాలకు పైగా తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటూ మెక్సికో, అమెరికా భద్రతా సంస్థలకు చిక్కకుండా తప్పించుకున్నాడు.
మెజా ఫ్లోరెస్ సినాలోవా కార్టెల్‌లోని లాస్ మయోస్ వర్గానికి సన్నిహితుడిగా ఉన్నాడు. ఈ వర్గం రాష్ట్రంలో ప్రత్యర్థి ముఠాలతో ఆధిపత్య పోరులో ఉంది. దీంతో అతడి అరెస్టు తర్వాత మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, ఈ ఆపరేషన్‌లో అమెరికా నిఘా సమాచార సహకారం కూడా ఉందని మెక్సికో అధికారులు వెల్లడించారు. అమెరికా, మెక్సికో భద్రతా సంస్థల మధ్య సమన్వయంతోనే ఈ అరెస్టు సాధ్యమైందని ఇరు దేశాల అధికారులు అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై ఇది కీలక విజయమని అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూడా పేర్కొన్నారు.
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌పై డ్రగ్ కార్టెల్స్‌ను అణచివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో తాజా అరెస్టు మెక్సికో ప్రభుత్వానికి కీలక విజయంగా భావిస్తున్నారు.
అయితే, కార్టెల్ నాయకులను అరెస్టు చేయడం మాత్రమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని భద్రతా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నాయకత్వం ఖాళీ అయినప్పుడు ముఠాల్లో అంతర్గత పోరు పెరిగి, కొత్త హింసకు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందువల్ల మెజా ఫ్లోరెస్ అరెస్టు తర్వాత సినాలోవాలో పరిస్థితులు ఎలా మారతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.


Read More
Next Story