మయన్మార్ భూకంపం: 2,700 దాటిన మృతుల సంఖ్య..
x

మయన్మార్ భూకంపం: 2,700 దాటిన మృతుల సంఖ్య..

గాయపడ్డ 4,521 మంది, జాడ తెలియని 441 మంది


Click the Play button to hear this message in audio format

మయన్మార్ రాజధాని బ్యాంకాక్‌(Bangkok)లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంప తీవ్రతకు ఎత్తయినా భవనాలు కూలిపోయాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్లు పగులిచ్చాయి. విద్యుత్ స్థంబాలు వాలిపోయాయి. వందల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు శిథిలాల కింద చిక్కుకుని 2,700 మంది ప్రాణాలొదిలారు. కొనఊపిరితో ఉన్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం 63 ఏళ్ల వృద్ధురాలిని కాపాడారు. 91 గంటల పాటు శిథిలాల కింద ఇరుక్కుపోయిన ఆమెను విజయవంతంగా బయటకు తెచ్చామని నేపిటాలోని అగ్నిమాపక శాఖ తెలిపింది.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

ఇప్పటి వరకు 2,700 మంది మరణించారని, 4,521 మంది గాయపడ్డారని, 441 మంది తప్పిపోయారని నేపిటాలో మయన్మార్ సైనిక ప్రభుత్వ అధిపతి, సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ తెలిపారు. శుక్రవారం సంభవించింది దేశ చరిత్రలో రెండో పెద్ద భూకంపమని, 1912 మేలో కూడా భారీ భూకంపం సంభవించిందని చెప్పారు.

50 మంది బౌద్ధ సన్యాసుల మృతి..

భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరం మండలేలో 403 మందిని రక్షించామని, ఇప్పటివరకు 259 మృతదేహాలను కనుగొన్నామని మయన్మార్ అగ్నిమాపక శాఖ పేర్కొంది. ఒక చోట మఠం కూలిపోవడంతో అందులో పరీక్ష రాస్తున్న 50 మంది బౌద్ధ సన్యాసులు చనిపోయారు. మరో 150 మంది శిథిలాల కింద సమాధి అయి ఉంటారని భావిస్తున్నారు.

పొరుగున ఉన్న థాయిలాండ్‌లోనూ..

భూకంపం పొరుగున ఉన్న థాయిలాండ్‌ను కూడా కుదిపేసింది. ఫలితంగా నిర్మాణంలో ఉన్న ఒక ఎత్తైన భవనం కూలిపోయి చాలా మంది కార్మికులు మృత్యువాతపడ్డారు. సోమవారం శిథిలాల నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. మంగళవారం మరో శవాన్ని బయటకు తీశారు. కానీ చాలామంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది. బ్యాంకాక్‌లోని నిర్మాణ స్థలంలో 21 మంది మరణించగా, 34 మంది గాయపడ్డారు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.

మందకొడిగా సహాయక చర్యలు..

రష్యా, చైనా, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా అనేక దేశాల నుంచి వచ్చిన రెస్క్యూ టీంలు(Rescue workers) సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. భారీ యంత్రాలు లేకపోవడం వల్ల శిథిలాల తొలగింపు ఆలస్యమవుతోంది. మంగళవారం నేపిటావ్‌లోని ఒక ప్రాంతంలో కార్మికులు మానవ గొలుసుగా ఏర్పడి కూలిపోయిన భవన శిథిలాల నుంచి ఇటుక, కాంక్రీటు ముక్కలను చేతులతో బయటకు తెచ్చారు. మయన్మార్ రాష్ట్ర వార్తాపత్రిక గ్లోబల్ న్యూ లైట్ ప్రకారం.. చైనా రక్షక బృందం ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ శిథిలాల నుంచి నలుగురిని రక్షించింది. వీరిలో 5 ఏళ్ల చిన్నారి, గర్భిణి ఉన్నారు. ఇద్దరు యువకులు తమ సెల్‌ఫోన్ టార్చిలైట్‌లను ఉపయోగించి ఒక భవనం శిథిలాల నుంచి పాకుతూ బయటకు రాగలిగారు.

Read More
Next Story