![అమెరికా సరిహద్దులో చిక్కి.. ఇండియాకు సంకెళ్లతో తిరిగొచ్చి.. అమెరికా సరిహద్దులో చిక్కి.. ఇండియాకు సంకెళ్లతో తిరిగొచ్చి..](https://telangana.thefederal.com/h-upload/2025/02/07/511166-deportation-1.webp)
అమెరికా సరిహద్దులో చిక్కి.. ఇండియాకు సంకెళ్లతో తిరిగొచ్చి..
రూ. 50 లక్షలు అప్పుచేసి కెనడా వెళ్లాలనుకున్నాడు. చివరకు అమెరికా సరిహద్దు బలగాలకు చిక్కి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులతో ఇండియాకు తిరిగొచ్చాడు.
నాగ్‌పూర్‌కు చెందిన హర్ప్రీత్ సింగ్ లాలియా అమెరికా(America) నుంచి పంపించేసిన (Deportation) 104 మంది అక్రమవలసదారుల్లో (Illegal immigrants) ఒకరు. చేతులకు సంకెళ్లు(Handcuffs), కాళ్లకు గొలుసులతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. లాలియా కెనడాలో ఉద్యోగం చేయాలని కలలు కన్నాడు. కానీ ఏజెంట్ పొరపాటు వల్ల భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నానని గురువారం లాలియా విలేఖరులతో అన్నారు. విదేశానికి వెళ్లడానికి బ్యాంకులు, మిత్రులు, బంధువుల దగ్గర రూ. 50 లక్షలు అప్పు చేశానని, ఇప్పుడు అంత డబ్బు తిరిగి ఎలా చెల్లిందేదంటూ బోరుమన్నాడు.
కఠిన ప్రయాణంలో చివరకు భద్రతా బలగాలకు చిక్కి..
"మొత్తం రూ. 49.5 లక్షలు ఖర్చు చేశాను. ఇందులో కొంతడబ్బును బ్యాంకు నుంచి లోన్‌గా తీసుకున్నాం. ఇంకొంత డబ్బు కోసం మిత్రులు, బంధువుల దగ్గర అప్పు చేశా. నేను కెనడా వీసాతో 2024 డిసెంబర్ 5న న్యూఢిల్లీ నుంచి నా ప్రయాణం మొదలుపెట్టా.
అబుదాబి నుంచి మరో ఫ్లైట్‌లో కెనడా చేరుకోవాలి. అయితే అక్కడ విమానం ఎక్కిందుకు ఇమిగ్రేషన్ అధికారులు నన్ను అనుమతించలేదు. దీంతో తిరిగి వచ్చి ఎనిమిది రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏజెంట్ మరో మార్గాన్ని సూచించాడు. ఈజిప్టు రాజధాని కైరోకి విమానం బుక్ చేశాడు. అక్కడి నుంచి స్పెయిన్ మీదుగా కెనడా – మాంట్రియల్ వెళ్లాల్సి ఉంది. స్పెయిన్‌లో నాలుగు రోజులు గడిపిన తర్వాత గ్వాటిమాలా బయలుదేరాను. అక్కడి నుంచి నికరాగువా, ఆపై హోండూరాస్, మెక్సికో, చివరికి అమెరికా సరిహద్దుకు చేరుకున్నాను. మెక్సికోలో మాఫియా చేతిలో 10 రోజులు బందీగా ఉన్నాను. ఆ తర్వాత నాలుగు గంటల పాటు పర్వతాల్లో నడిచి.. చివరకు అమెరికా సరిహద్దు చేరుకోడానికి 16 గంటల సమయం పట్టింది. చివరకు అమెరికా సరిహద్దు బలగాలకు దొరికిపోయాను.’’ అని తన కఠిన ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు లాలియా.
తిప్పి పంపిన విధానాన్ని వివరిస్తూ.."ముందుగా మమ్మల్ని 'వెల్కమ్ సెంటర్' కి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ మా చేతులకు సంకెళ్లు వేశారు. కాళ్లకు గొలుసులు వేసి విమానం ఎక్కించారు," అని చెప్పాడు లాలియా. ఇలా పంపడం అవమానంగా ఉందని చెప్పుకొచ్చాడు.
ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది?
అక్రమవలసదారులందరిని తమ దేశం నుంచి పంపించేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా 104 మంది అక్రమ వలసదారులతో బుధవారం టెక్నాస్ నుంచి బయలుదేరిన విమానం పంజాబ్‌లోని అమృత్ సర్ విమానాశ్రయానికి చేరుకుంది. హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్‌కు చెందిన 33, పంజాబ్‌కు చెందిన 30, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు 3, చండీగఢ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు.
రాజకీయ వివాదం..
అక్రమ వలసదారులకు బేడీలు వేసి తీసుకురావడం లోక్‌సభలో రాజకీయ దుమారం రేపింది. అమెరికా తీరుపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని దూషించడం మొదలుపెట్టాయి. రాజ్యసభలో ఈ అంశంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. అక్రమ వలసదారులను అలా పంపడం కొత్తేమీ కాదని చెప్పుకొచ్చారు. అయితే ఆ నిబంధన మహిళలు, పిల్లల విషయంలో వర్తించదని స్పష్టం చేశారు.