
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో పుతిన్, కిమ్, షరీఫ్
చైనా పునరుజ్జీవనాన్ని ఎవరూ ఆపలేరు: షీ జిన్ పింగ్
భారీ కవాతును నిర్వహించిన కమ్యూనిస్టు దేశం
చైనా పునర్జీవనాన్ని ప్రపంచంలో ఎవరూ అడ్డుకోలేరని షీ జిన్ పింగ్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దురాక్రమణపై చైనా విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా భారీ కవాతు నిర్వహించింది.
హైపర్ సోనిక్, లేజర్, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు వంటి తాజా ఆయుధాలను ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సహ ఇతర విదేశీ నాయకులు దీనికి హాజరయ్యారు. ఇది చైనా సైనిక శక్తిని ప్రదర్శించడమే కాకుండా బీజింగ్ దౌత్యపరమైన పలుకుబడిని కూడా తెలిసినట్లు అయింది.
చైనా సైనిక శక్తి..
జాతీయ పునరుజ్జీవనానికి వ్యూహాత్మక స్తంభంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) తన పాత్రను బలోపేతం చేసుకోవాలని, ప్రపంచ శాంతి, అభివృద్దికి దోహదపడాలని జిన్ పింగ్ కోరారు. మొట్టమొదటిసారిగా చైనా సైన్యం తన అత్యంత అధునాతన ఆయుధాలను ప్రదర్శించింది.
దీనిని ప్రపంచానికి ముఖ్యంగా అమెరికాకు బలప్రదర్శనగా భావిస్తున్నారు. పీఎల్ఏ సుప్రీం కమాండ్ బాడీ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్ గా జిన్ పింగ్ సాయుధ దళాలను ప్రపంచ స్థాయి సైన్యంగా మార్చాలని, చైనా సార్వభౌమాధికారం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను దృఢంగా కాపాడాలని పిలుపునిచ్చారు.
అమెరికా తరువాత ప్రపంచంలో రెండో అతిపెద్ద రక్షణ వ్యయం చేసే చైనా, ఈ సంవత్సరం తన రక్షణ బడ్జెట్ ను 250 బిలియన్ యూఎస్ డాలర్లు పెంచింది.
దౌత్యపరమైన వివాదం..
పుతిన్, కిమ్ లతో పాటు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాల్దీవుల అధ్యక్షుడు మొహ్మద్ మయిజు వంటి ప్రపంచ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ తరఫున చైనాలో పనిచేస్తున్న రాయబారీ ప్రదీప్ కుమార్ రావత్ హజరయ్యారు.
ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా నాయకులు పాల్గొనలేదు. ఈ కార్యక్రమానికి ప్రపంచ నాయకులు హాజరుకావొద్దని టోక్యో కోరిన తరువాత విదేశీ నాయకులు ఎవరూ రాలేదు. ఇది దౌత్యపరమైన వివాదంగా మారింది. చైనా దీనికి నిరసన తెలియజేసింది.
క్రాస్ రోడ్ లో ప్రపంచం..
రెండో ప్రపంచ యుద్ధంలో చైనా విజయం ఆధునిక చరిత్రలో విదేశీ దురాక్రమణపై దాని మొదటి పూర్తి విజయం అని షీ జిన్ పింగ్ చెప్పారు. సీపీసీ నేతృత్వంలో జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా జాతీయ ఐక్య ఫ్రంట్ కింద విజయం సాధించిందని పేర్కొన్నారు. ప్రపంచ శాంతిని కాపాడటంలో, మానవ నాగరికతను కాపాడటంలో చైనా ప్రజలు చేసిన అపారమైన త్యాగాలను జిన్ పింగ్ హైలైట్ చేశారు.
‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఒకరినొకరు సమానంగా చూసుకుని, సామరస్యపూర్వకంగా జీవిస్తూ, మద్దతు ఇచ్చినప్పుడే భద్రత ఉంటుది. యుద్దానికి మూలకారణాన్ని తొలగించవచ్చు. చారిత్రక విషాదాలు పునరావృతం కాకుండా నిరోధించవచ్చు’’ అని షీ తన ప్రసంగంలో అన్నారు.
పుతిన్, కిమ్ పక్కనే ఉన్న జిన్ పింగ్, ప్రపంచం మరోసారి ఒక కూడలిలో ఉందని పేర్కొన్నారు. ‘‘నేడు మానవాళి మళ్లీ శాంతి లేదా యుద్ధం, చర్చలు, గెలుపు ఫలితాలు, జీరో సమ్ గేమ్ ల మధ్య ఒక ఛాయిస్ ను ఎదుర్కొంటోంది’’ అన్నారు. చైనా ఎప్పుడు శాంతి వైపే ఉంటుందని, శాంతియుత అభివృద్దిని బీజింగ్ కోరుకుంటుందని అన్నారు.
ఆధునాతన ఆయుధాలు..
‘‘బలమైన దేశాన్ని నిర్మించడానికి, అన్ని రంగాలలో జాతీయ పునరుజ్జీవనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సీపీసీ బలమైన నాయకత్వం కింద ఐక్యంగా ఉండి, కష్టపడి పనిచేయాలి’’ అని ఆయన చైనా ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కవాతులో డీఎఫ్-5సీ ద్రవ ఇంధనంతో నడిచే ఖండాంతర వ్యూహాత్మక అణు క్షిపణితో సహ అనేక కొత్త ఆయుధాలను ప్రదర్శించారు. గ్లోబల్ టైమ్స్ ప్రకారం.. ఈ క్షిపణి 20 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిలో లక్ష్యాలను చేధించగలదు.
కచ్చితత్వం, రక్షణ లో అత్యున్నత సామర్థ్యాలు ఉన్నాయి. దాని స్ట్రైక్ రేట్ ప్రపంచం మొత్తం కవర్ చేస్తుందని ఒక నిపుణుడిని ఉటంకిస్తూ పత్రిక పేర్కొంది. అలాగే వాహన ఆధారిత లేజర్ రక్షణ ఆయుధం, నాలుగు రకాల విమాన వాహక ఆధారిత జెట్ ఫైటర్లు, డీప్ సీ డ్రోన్లు, హెచ్-6జే లాంగ్ రేంజ్ బాంబర్, వైమానిక ముందస్తు హెచ్చరిక విమానం, ఆర్మీ, నేవీ డ్రోన్లు, 5 వేల కిలోమీటర్ల పరిధి కలిగిన డీఎప్-26డీ, యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులు, సీజే-1000 లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థలు, హెచ్ -29 బాలిస్టిక్ క్షిపణ ఇంటర్ సెప్టర్, క్యారియర్ కిల్లర్ క్షిపణులు, కొత్త యుద్ధ ట్యాంక్ టైప్ 99బీ బహుళ రాకెట్ లాంచర్లు ఉన్నాయి.
Next Story