మహమ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడవుతారా, ఎవరీ యూనస్?
x

మహమ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడవుతారా, ఎవరీ యూనస్?

బంగ్లాదేశ్ లో మధ్యంతర ప్రభుత్వ అధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ను నియమించాలని అంతా ఓ అంగీకారానికి వచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పారిస్ ఒలంపిక్స్ లో..


బంగ్లాదేశ్ లో చెలరేగిన హింస, తరువాత ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడంతో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్ సారథ్యం వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఊహగానాల గురించి ది ఫెడరల్ ప్రత్యేక కథనాన్ని సోమవారమే అందించింది. ఇప్పుడదే నిజం కాబోతున్న పరిణమాలు కనిపిస్తున్నాయి.

యూనస్ నియామకం కంటే ముందు బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు కాబోతోంది. మొదట సైన్యమే ప్రభుత్వాన్ని టేకోవర్ చేస్తుందని వార్తలు వచ్చాయి కానీ వాటిని ఆర్మీ చీఫ్ తోసిపుచ్చారు. మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించడానికి ఆయన ఈ రాత్రి ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుదీన్‌ను సంప్రదించనున్నారు.

నోబెల్ శాంతి గ్రహీత ముహమ్మద్ యూనస్ తదుపరి సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని విస్తృతంగా ఊహాగానాలతో పాటు బంగ్లాదేశ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సలేహుద్దీన్ అహ్మద్, బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన రిటైర్డ్ త్రీ స్టార్ జనరల్ జహంగీర్ ఆలం చౌదరి లేదా ప్రముఖ న్యాయవాది సారా హొస్సేన్ వంటి ఇతర పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే మెజారిటీ నాయకులు, విద్యార్థులు మాత్రం మహ్మద్ యూనస్ పేరునే సూచిస్తున్నారు.
ఈయన మొదటి నుంచి షేక్ హసీనా పాలనను వ్యతిరేకిస్తున్నారు. ఆయన మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తే ఓ నోబెల్ గ్రహీత దేశ పాలకుడు కావడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది. ఇంతకుముందు పాలకులకు నోబెల్ ప్రైజ్ లు వచ్చాయి కానీ.. అవి పదవీలో ఉండగా, పదవీ విరమణ తరువాత వచ్చాయి.
ఆయన ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ లో ఉన్నారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో సైనిక పాలన సరికాదని యూనస్ వ్యాఖ్యానించారు. దేశాన్ని నియంత పాలన నుంచి విద్యార్థులు రక్షించారని, ఇది దేశంలో రెండో స్వాతంత్ర్య దినం అని పేర్కొన్నారు. మన దేశాన్ని స్వచ్చందంగా నిర్మించుకునేందుకు మరోసారి అవకాశం వచ్చిందని, బంగ్లాదేశీయుల కోరిక నెరవేరుతుందని అన్నారు. దేశంలో అవినీతి ప్రజలంగా ఉందని, దీన్ని రూపుమాపాలని ఆయన ఆకాంక్షించారు.
యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా చేయాలనే డిమాండ్‌ను విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ముందుకు తెచ్చారు. మంగళవారం తెల్లవారుజామున సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో, ఉద్యమం ముఖ్య సమన్వయకర్తలలో ఒకరైన నహిద్ ఇస్లాం మాట్లాడుతూ, దేశాన్ని రక్షించడానికి విద్యార్థి సంఘం పిలుపు మేరకు యూనస్ కీలకమైన బాధ్యతను స్వీకరించడానికి అంగీకరించినట్లు డైలీ స్టార్ వార్తాపత్రిక తెలిపిందని అన్నారు.
"మేము తాత్కాలిక ప్రభుత్వానికి ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించడానికి 24 గంటల సమయం తీసుకున్నాము. అయితే, అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటాము " అని నహిద్ చెప్పారు. ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందు విద్యార్థి నాయకులతో సమావేశం కానున్నారు.
భారతదేశంలో హసీనా
సోమవారం, మాజీ ప్రధాని షేక్ హసీనా రహస్యంగా మిలటరీ విమానంలో దేశం నుంచి పారిపోయి భారతదేశంలో తలదాచుకున్నారు. అయితే దేశంలో అధికారం శూన్యతను నివరించడానికి సైన్యం రంగంలోకి దిగి మీడియాతో ప్రసంగించింది. దేశ ప్రజలను శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చింది.
హసీనా నిష్క్రమణ వార్త వ్యాప్తి చెందడంతో, వందల మంది ఆమె నివాసంలోకి చొరబడ్డారు. ఇంటిలోని విలువైన సంపదను లూటీ చేశారు. ఇంటిలోని కొంత భాగాన్ని ధ్వంసం చేశారు. ఈ ఉద్యమంలో ఇప్పటికే వందమంది దాక మరణించారు.
1971 విముక్తి యుద్ధంలో పోరాడిన కుటుంబాలకు 30 శాతం ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని ఆ దేశ హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై విద్యార్థి లోకం ఉద్యమం చేసింది. అయితే దీనిని సుప్రీంకోర్టు కేవలం 5 శాతానికి పరిమితం చేసింది.
అయితే ఉద్యమంలోకి రాజకీయ నాయకులు ప్రవేశం చేయడం, ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి, పెరుగుతున్న ద్రవ్యోల్భణం, నిరుద్యోగంతో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో సైన్యం ఆదేశాల మేరకు షేక్ హసీనా వాజేద్ సోమవారం మధ్యాహ్నం రాజీనామా చేసి ప్రత్యేక హెలికాప్టర్ లో భారత్ చేరుకున్నారు. హసీనా ప్రస్తుతం లండన్ చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదే మొదటిసారి కాదు
బంగ్లాదేశ్ పాలన ఆకస్మికంగా ముగిసిన తర్వాత మధ్యంతర ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2011 వరకూ ఆ దేశ రాజ్యాంగంలో కేర్ టేకర్ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రత్యేక నిబంధనలు ఉండేవి. అయితే వీటిని హసీనా సర్కార్ తొలగించింది. సైనిక నియంత హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్‌ను సామూహిక తిరుగుబాటు ద్వారా అధికారం నుంచి తొలగించిన తర్వాత ప్రజాస్వామ్య ఎన్నికలను నిర్వహించడానికి రాజ్యాంగంలోని 13వ సవరణ ద్వారా 1991లో ఈ వ్యవస్థ ప్రవేశపెట్టారు.
కేర్‌టేకర్ ప్రభుత్వ విధులు
ఇప్పుడు రద్దు చేయబడిన విధానం ప్రకారం, మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు 90 రోజులు ఉండాలి. ఈ లోపు ఒక ఎన్నికైన ప్రభుత్వం మరొకదానికి మధ్య పరివర్తన పూర్తవుతుంది. ఆపద్ధర్మ ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికలను మాత్రమే నిర్వహించాలని ఆదేశించింది.
మోదీ కేబినెట్‌ భేటీ
న్యూఢిల్లీలో, బంగ్లాదేశ్‌లో పరిస్థితి గురించి ప్రభుత్వ ఉన్నతాధికారులకు వివరించినందున, ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి భద్రతపై క్యాబినెట్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సహా సిసిఎస్‌లోని ఇతర సభ్యులు మోదీతో కలిసి ఉన్నారు.
అదే సమయంలో, బంగ్లాదేశ్ పరిస్థితిని "నిశితంగా" పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టిన తర్వాత మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యబద్ధంగా, అందరినీ కలుపుకొని ఉండాలని కోరినట్లు వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి తెలిపారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీనియర్ అధికారులతో కలిసి ఢిల్లీ సమీపంలోని ఎయిర్‌బేస్‌లో హసీనాతో సమావేశమై బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్ వైఖరిని తెలియజేసినట్లు సమాచారం.
Read More
Next Story