జపాన్ ఆటంబాంబు మృత్యుంజయులకు నోబెల్ శాంతి పురస్కారం
హిరోషిమా, నాగసాకిల మీద అమెరికా విసిరిన ఆటంబాంబు దాడిలో బతికి బయటపడ్డ వారు ఏర్పాటు చేసిన ‘నిహాన్ హిడాంక్యో’ అనే సంస్థను నోబెల్ శాంతి బహమతికి ఎంపిక చేశారు
ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి -2024ను జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థ వరించింది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు ప్రయోగించడంతో ఆ నగరాలు పూర్తిగా నాశనమయ్యాయి. లక్ష 20 వేలమందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అణుదాడుల నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతూ ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు నిహాన్ హిడాంక్యో చాలా ఏళ్లుగా కృషి చేస్తుంది. 1956లో ఏర్పడిన ఈ సంస్థ బాధితుల జీవిత గాథల్ని ఉదహరిస్తూ మరోసారి అణ్వాయుధాలను వాడకుండా ప్రయత్నాలు చేస్తున్నందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందజేస్తున్నట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ పేర్కొంది.
‘‘హిరోషిమా, నాగసాకి అణుబాంబు నుంచి ప్రాణాలతో బయటపడిన వారు శారీరక సమస్యలు, విషాద జ్ఞాపకాలతో జీవిస్తున్నప్పటికీ వారిని గౌరవించాలని భావిస్తున్నాం. శాంతి, విశ్వాసం పెంపొందించడానికి వారి విలువైన అనుభవాలను ఉపయోగించుకునేందుకు శాంతి బహుమతిని ఇవ్వాలని నిర్ణయించాం’ అని నోబెల్ బృందం పేర్కొంది.
జపాన్ నగరాల్లో అణ్వాయుధాల బారిన పడిన బాధితుల ఉద్యమాన్ని హిబాకుషాగా పేర్కొంటారు. నోబుల్ పురస్కారాన్ని ప్రకటిస్తూ కమిటీ అధ్యక్షుడైన జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్.. "అణ్వాయుధాల వినియోగం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని హిబాకుషా వాస్తవగాథలే సాక్ష్యాలు’’ అని పేర్కొన్నారు.