
పహల్గామ్ ఉగ్రదాడికి ఆ ఇద్దరే బాధ్యులు?
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ఆయన సన్నిహిత మిత్రుడు, ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిమ్ మాలిక్ కనుసన్నల్లోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందా?
పాకిస్తాన్(Pakistan) ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్(General Asim Munir), అతని సన్నిహిత మిత్రుడు, జాతీయ భద్రతా సలహాదారు, ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్ (Asim Malik).. ఈ ఇద్దరూ కలిసి పహల్గామ్ ఉగ్రదాడికి పథకం రచించారని భారత భద్రతా బలగాలు భావిస్తున్నాయి. భారత్‌ను యుద్ధానికి ఉసిగొల్పడానికి కూడా ఈ ఇద్దరే కారణమని తెలుస్తోంది.
వివాదాల ఆసిమ్ మునీర్..
మునీర్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే వివాదాలు మొదలయ్యాయి. వాస్తవానికి ఈయన 2022 నవంబర్ 27న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా రెండు రోజుల తర్వాత నవంబర్ 29న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే అప్పటి ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ మంత్రివర్గం మునీర్ సేవలను కొనసాగించింది. దాంతో మునీర్ 15వ ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు.
ఆర్మీ చీఫ్ కావడానికి ముందు మునీర్..పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) డైరెక్టరేట్ చీఫ్‌గా కూడా పనిచేశారు. కానీ అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మునీర్ గురించి అప్పటి ఆర్మీ చీఫ్ బాజ్వాకు ఫిర్యాదు చేశారు. దాంతో మునీర్ పదవీకాలం 8 మాసాలకు కుదించారు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ (పింకీ పీర్ణీ) సన్నిహితుల అవినీతి గురించి కూడా ఖాన్ దృష్టికి తీసుకెళ్లాడం.. ఇమ్రాన్ ఖాన్‌కు కోపాన్ని తెప్పించింది. దీంతో మునీర్‌ను గుజ్రాన్వాలా కార్ప్స్ కమాండర్‌గా బదిలీ చేశారు.
2023 మే 9న ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ఆర్మీ స్థావరాలపై విధ్వంసానికి పాల్పడ్డారు. రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.లాహోర్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సల్మాన్ ఫయాజ్ ఘనీ నివాసానికి నిప్పంటించారు. దాంతో ఘనీని రావల్పిండికి మార్చి, ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షాను నియమించారు. ఈ ఘటన తర్వాత మునీర్ సియాల్కోట్‌లో ఉన్నతాధికారులతో రహస్యంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో మునీర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తన వైఖరిని వ్యతిరేకించిన రిటైర్డ్ ఆఫీసర్ల భార్యలు, పిల్లలను మునీర్ బెదిరించినట్లు సమాచారం.
ఆసిమ్ మాలిక్ పదవీ కాలం పొడిగింపు..
రావల్పిండికి చెందిన ఎక్స్ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ షాహిద్ ఇంతియాజ్, ఐఎస్ఐ చీఫ్‌గా అసిమ్ మాలిక్ సాన్నిహిత్యతో మునీర్ బలపడ్డారు. ఇక ఐఎస్‌ఐ చీఫ్ ఆసిమ్ మాలిక్ పదవీకాలం సెప్టెంబర్ 2025లో ముగుస్తుంది. అయితే మునీర్ ఆయనను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం ద్వారా రిటైరయిన తర్వాత కూడా కొనసాగేందుకు మార్గం సుగమం చేసినట్లు సమాచారం.
మునీర్ కుటుంబంపై పలు ఆరోపణలు..
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అధికారంలోకి రాగానే.. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రభుత్వంలో, రాజకీయాల్లో కీలక పదవులు దక్కాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు అహ్మద్ నూరానీ తన వెబ్‌సైట్‘ ఫ్యాక్ట్ ఫోకస్’ లో ఈ విషయాలను బయటపెట్టారు. పలు కీలక పోస్టుల భర్తీలో మునీర్ మేనమామ సయ్యద్ బాబర్ అలీ షా జోక్యం ఉన్నట్లు వార్తలొచ్చాయి. అహ్మద్ ఇషాక్ జహంగీర్‌ను ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) డైరెక్టర్‌గా నియమించడంలో షా పాత్ర ఉందని, అయితే అవినీతి ఆరోపణల కారణంగా ఆయన్ను తొలగించాల్సి వచ్చిందని నూరానీ పేర్కొన్నారు. షా జోక్యంతోనే షెహ్జాద్ నద్దీమ్ బొఖారీ FIA ఇస్లామాబాద్ జోన్ డైరెక్టర్‌గా నియమించారని, మునీర్ ప్రభావంతోనే ఆయన పినతండ్రి కూతురు హజ్రా సోహైల్ Pakistan Education Endowment Fund (PEEF)లో మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలోపే సీఈవో అయ్యారని నురానీ పేర్కొన్నారు.
మునీర్ భార్య ఇరమ్ ఆసిమ్ సన్నిహితుడైన మొహ్సిన్ నక్వీ ప్రస్తుతం పాక్ లోపల వ్యవహారాల మంత్రిగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా ఉన్నారు. ఈ విషయాలను బయటపెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే జర్నలిస్టు అహ్మద్ నూరానీ సోదరులు – మహ్మద్ సైఫ్ ఉర్ రెహ్మాన్ హైదర్, మహ్మద్ అలీను ఇస్లామాబాద్‌లోని వారి ఇంటి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. నెల రోజులపాటు కనిపించలేదు. రహీం యార్ ఖాన్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన అనంతరం వారు బయటపడ్డారని అధికారులు పేర్కొన్నారు.
ఆసిమ్ మాలిక్ ఎవరు?
పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను నియంత్రిస్తున్న కీలక వ్యక్తి లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిమ్ మాలిక్. ప్రస్తుతం ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) చీఫ్‌గానే కాకుండా జాతీయ భద్రతా సలహాదారుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన తండ్రి గులాం మహ్మద్ మాలిక్. రావల్పిండీలోని X కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ కమాండర్‌గా పనిచేసి రిటైరయ్యారు.
కార్ప్స్ కమాండర్‌గా మాలిక్‌కు అప్పగించాలని మునీర్ అనుకున్నాడు. కానీ మాలిక్ ఆ పదవిలో కొనసాగడానికి ఇష్టపడలేదు. మునీర్‌కు విశ్వాసపాత్రుడిగా మెలుగుతూ రావడంతో మాలిక్ ఆయనకు ఐఎస్‌ఐ చీఫ్ పదవి కట్టబెట్టారు. తర్వాత జాతీయ భద్రతా సలహాదారు పదవి లభించింది. ఐఎస్‌ఐ చీఫ్ కావడానికి ముందు మాలిక్ ప్రధాన కార్యాలయంలో అడ్జుటెంట్ జనరల్‌గా పనిచేశారు. అప్పట్లో మాజీ ఐఎస్‌ఐ చీఫ్ ఫైజ్ హమీద్‌పై చేపట్టిన విచారణలో కీలక పాత్ర పోషించారు. ఇమ్రాన్ ఖాన్‌ను ప్రధానిని చేయడంలో కీలకంగా వ్యవహరించిన వారిలో ఫైజ్ ఒకరు. ఆ కారణంతోనే మునీర్ ఆర్మీ చీఫ్ అయిన తర్వాత హమీద్ అరెస్ట్ చేశారు.
భద్రతా వర్గాల సమాచారాన్ని బట్టి.. పహల్గామ్ తరహా ఉగ్రదాడి మాలిక్‌కు తెలియకుండా జరగదని ది ఫెడరల్‌కు తెలిపారు. ఆయనకు ఖచ్చితమైన తేదీ, ప్రదేశం తెలిసి ఉండకపోవచ్చు. కానీ పర్యాటకులపై దాడి జరగబోతోందన్న సమాచారం మాత్రం ఆయనకు తప్పక తెలిసి ఉంటుందని చెబుతున్నారు.