
భారత్ నిర్ణయాన్ని కాపీ కొట్టిన పాక్ ప్రధాని
భారత్‌తో ఇటీవలి వివాదంపై పాక్ వైఖరిని తెలిపేందుకు పీపీపీ బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని బృందం అమెరికా, యుకె, బ్రిజిల్, ఫ్రాన్స్, రష్యాను సందర్శించనుంది.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంలో పాక్ (Pakistan) ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచదేశాల దృష్టికి తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా తమ భాగస్వామి దేశాలకు ప్రతినిధి బృందాలను పంపాలని నిర్ణయించింది.
అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (PM Shehbaz Sharif) కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. భారతీయ ప్రచారాన్ని బహిర్గతం చేయడానికి ప్రపంచ రాజధానులకు తమ దౌత్య బృందాన్ని పంపుతున్నట్లు వెల్లడించారు.
మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీతో టెలిఫోన్ సంభాషణ తర్వాత షెహబాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ గురించి తెలిపేందుకు తమ కీలక భాగస్వామి దేశాలకు ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను పంపుతున్నట్లు భారత్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ కూడా తన ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ బృందానికి బిలావల్ నాయకత్వం వహించనున్నారు. బిలావల్‌తో పాటు, ప్రతినిధి బృందంలో ఇంధన మంత్రి ముసాదిక్ మాలిక్, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ నాయకుడు ఖుర్రం దస్తగిర్ ఖాన్, సెనేటర్ షెర్రీ రెహ్మాన్, మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్, ముత్తహిదా క్వామీ ఉద్యమ శాసనసభ్యుడు ఫైసల్ సుబ్జ్వారీ, మాజీ విదేశాంగ కార్యదర్శులు తెహ్మినా జంజువా, జలీల్ అబ్బాస్ జిలానీ ఉన్నారు. ఇటీవలి వివాదంపై తమ వైఖరిని హైలైట్ చేయడానికి తమ దేశ ప్రతినిధి బృందం త్వరలో అమెరికా, యుకె, బ్రస్సెల్స్, ఫ్రాన్స్, రష్యాలో పర్యటించనుందని పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు.
‘దేశ సేవను గౌరవంగా భావిస్తా..’
"ఈరోజు ముందుగా నన్ను ప్రధానమంత్రి [షెహబాజ్ షరీఫ్] సంప్రదించారు. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ శాంతి వాదనను వినిపించే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని నన్ను అభ్యర్థించారు. ఈ బాధ్యతను నేను స్వీకరిస్తున్నా. పాక్‌కు సేవ చేయడం గౌరవంగా భావిస్తా," అని బిలావల్ శనివారం ఎక్స్‌లో పోస్టు రాశారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మే 8, 9,10 తేదీల్లో దాడులు చేసింది. ఈ దాడిలో సుమారు వంద మంది టెర్రరిస్టులు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంక్ జోక్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే.