సరిహద్దు జిల్లాల్లో కాల్పులకు తెగబడుతున్న పాక్..
x

సరిహద్దు జిల్లాల్లో కాల్పులకు తెగబడుతున్న పాక్..

ధీటుగా సమాధానమిస్తున్న భారత్ బలగాలు..


Click the Play button to hear this message in audio format

పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడి(Terror Attacks) నేపథ్యంలో జమ్ము కశ్మీర్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడు సరిహద్దు జిల్లాల్లో పాక్ భద్రతా బలగాలు గత ఏడు రోజుల నుంచి కాల్పులకు తెగబడుతున్నాయి. అయితే భారత సైన్యం కూడా వారికి ధీటుగా సమాధానం ఇస్తోంది. మంగళవారం భారత్, పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) మధ్య హాట్‌లైన్‌లో సంప్రదింపులు జరిగినా.. కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

"జమ్మూ, కశ్మీర్ కేంద్ర భూభాగంలోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ఎదురుగా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్(Pakistan) ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి" అని జమ్మూలోని రక్షణ ప్రతినిధి ఒకరు తెలిపారు.

తొలుత ఏప్రిల్ 24వ తేదీన పాకిస్తాన్.. భారత విమానాలను తమ గగన తలం మీదుగా ఎగరకుండా ఆంక్షలు విధించింది. తర్వాత వాఘా సరిహద్దును మూసివేయడంతో పాటు భారత్‌తో వాణిజ్యపర లావాదేవీలను నిలిపేసింది. ప్రతిచర్యగా బుధవారం పాకిస్తాన్ విమానాలపై కూడా భారత్ ఆంక్షలు విధించింది.

పహల్గామ్‌లో ఉగ్రమూకలు 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న తర్వాత పాక్‌కు వెళ్లే సింధు జలాలను భారత్ ఆపేసిన విషయం విదితమే. దీన్ని తాము "యుద్ధ చర్య"గా పరిగణించాల్సి వస్తుందని పాక్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

NSAB పునరుద్ధరణ..

జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB)ను కూడా కేంద్రం పునరుద్ధరించింది. జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌కు సలహాలు ఇచ్చే NSAB ఛైర్మన్‌గా R&AW మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించనట్లు సమాచారం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హాజరైన ఉన్నత స్థాయి సమావేశంలో.. ఉగ్రవాద నిర్మూలనను దేశమంతా కోరుకుంటోందని చెప్పారు.

Read More
Next Story