‘‘ప్లీజ్ సైలెన్స్’’.. పీట్ హెగ్సెత్ ను మందలించిన సైనికుడు..
x
పీట్ హెగ్సెత్

‘‘ప్లీజ్ సైలెన్స్’’.. పీట్ హెగ్సెత్ ను మందలించిన సైనికుడు..

సైనికుడును సమర్థించిన పెంటగాన్


Click the Play button to hear this message in audio format

అమెరికాలో యుద్ధ స్మారక స్థలం వద్ద అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆయన సిబ్బంది చేసిన హడావుడి వివాదానికి దారితీసింది. అమర సైనికుల సమాధి వద్ద ఫొటోలు దిగిన తరువాత ఆయన బృందంలోని కొందరు గట్టిగా నవ్వడంతో అక్కడ విధుల్లో ఉన్న సైనికుడు వారిని మందలించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో డెమొక్రాట్లు హెగ్సెత్‌పై విమర్శలు గుప్పించారు. అయితే, స్మారక స్థలం గౌరవాన్ని కాపాడేందుకు సైనికుడు చేసిన హెచ్చరిక సరైనదేనని పెంటగాన్ సమర్థించింది.

అమెరికాలో నవంబర్ 11న వెటరన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వాషింగ్టన్‌లోని ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటికలో జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హెగ్సెత్ తన భార్య జెన్నిఫర్‌తో కలిసి టూంబ్ ఆఫ్ ది అన్‌నోన్ సోల్జర్ వద్దకు వెళ్లారు. ఆయనతో పాటు చీఫ్ ఆఫ్ స్టాఫ్ రికీ బురియా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పాట్రిక్ వీవర్, సీనియర్ సలహాదారు టామీ రాడాబాగ్ కూడా ఉన్నారు. సమాధి ముందు ఉన్న ఖాళీ మెట్లపై వీరంతా ఫొటోలు దిగారు.
అయితే, ఫొటోలు దిగడం పూర్తయి అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో బృందంలోని కొందరు గట్టిగా నవ్వినట్లు వీడియోలో వినిపించింది. దీంతో అక్కడ కాపలాగా ఉన్న సైనికుడు వెంటనే వారిని హెచ్చరించాడు. ఆ ప్రాంతంలోకి వచ్చే సందర్శకులంతా ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా, గౌరవప్రదంగా ఉండాలని స్పష్టం చేశాడు.

పెంటగాన్ ఏమందంటే..

ఈ ఘటనపై పెంటగాన్ ప్రధాన అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ స్పందించారు. వెటరన్స్ డే వంటి గంభీరమైన రోజున స్మారక స్థలంలో పాటించాల్సిన మర్యాదను అందరికీ గుర్తుచేస్తూ సైనికుడు సరైన రీతిలో వ్యవహరించారని పేర్కొన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అమెరికా సైనికులు చేసిన త్యాగాలను రక్షణ మంత్రి హెగ్సెత్, రక్షణ శాఖ ఎప్పటికీ గౌరవిస్తాయని తెలిపారు.
టూంబ్ ఆఫ్ ది అన్‌నోన్ సోల్జర్ అమెరికాలో అత్యంత పవిత్రమైన యుద్ధ స్మారక స్థలాల్లో ఒకటి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, కొరియా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన, గుర్తింపు తెలియని సైనికుల అవశేషాలను ఇక్కడ సమాధి చేశారు. 1948 నుంచి అమెరికా ఆర్మీలోని మూడో ఇన్‌ఫ్యాంట్రీ రెజిమెంట్‌కు చెందిన సైనికులు ఈ సమాధికి నిరంతరం కాపలా కాస్తుంటారు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ విధులు కొనసాగుతుంటాయి.
ఇదిలా ఉంటే, హెగ్సెత్‌కు ఈ ఘటన జరగడానికి ఒక రోజు ముందే మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి ఎదురైంది. ఆయనను అభిశంసించాలని కాంగ్రెస్ సభ్యుడు థామస్ మాసీ నేతృత్వంలో ప్రయత్నం జరిగింది. డెమొక్రాట్లు కూడా ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చారు. అయితే మంగళవారం జరిగిన ఓటింగ్‌లో హెగ్సెత్ అభిశంసన నుంచి తృటిలో తప్పించుకున్నారు.
కొన్ని నెలల విరామం తరువాత నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో హెగ్సెత్ ఈ అభిశంసన ప్రయత్నాన్ని తప్పుబట్టారు. రాజ్యాంగం ప్రకారం పదవి నుంచి తొలగించేందుకు అవసరమైన తీవ్రమైన నేరాలేవీ తాను చేయలేదని వాదించారు. తనపై, అమెరికా సైన్యం నిర్వహణపై వస్తున్న విమర్శలు సైనికుల సేవలను అవమానించడమేనని పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలు దేశభక్తి కాదని, దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేవని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా స్మారక స్థలం ఘటనపై డెమొక్రాట్ల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ సభ్యురాలు గ్వెన్ మూర్ హెగ్సెత్ వ్యవహారశైలి ఆయన రక్షణ మంత్రి పదవికి తగిన వ్యక్తి కాదనే అభిప్రాయాన్ని కలిగిస్తోందని విమర్శించారు. అభిశంసన నుంచి బయటపడిన మరుసటి రోజే సైనికుల త్యాగాలకు సంబంధించిన స్మారక స్థలం పవిత్రతను గౌరవించకుండా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.

అప్పట్లో ట్రంప్...

ట్రంప్ బృందానికి ఆర్లింగ్టన్ స్మశానవాటికలో వివాదం ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. 2024లో ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమయంలో ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాల్లో మరణించిన అమెరికా సైనికులను స్మరించుకునే కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పట్లో అక్కడ వీడియోలు, ఫొటోలు తీయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్మశానవాటిక ఉద్యోగిని ట్రంప్ ప్రచార బృందానికి చెందిన వ్యక్తి తోసివేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆ తరువాత ట్రంప్ స్మశానవాటికలో ఉన్న వీడియోను టిక్‌టాక్‌లో పంచుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ విషయంలో అప్పటి బైడెన్ ప్రభుత్వాన్ని విమర్శించే వ్యాఖ్యలను కూడా ఆ వీడియోకు జోడించారు. అయితే, అమెరికా చట్టాల ప్రకారం జాతీయ సైనిక స్మశానవాటికల్లో ఎన్నికలు, రాజకీయ ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించడం నిషేధం.
మొత్తానికి, వెటరన్స్ డే సందర్భంగా జరిగిన ఈ తాజా ఘటన అమెరికా రాజకీయాల్లో మరో వివాదానికి కారణమైంది. సైనికుల త్యాగాలను స్మరించుకునే కార్యక్రమాల్లో పాటించాల్సిన గౌరవం, మర్యాదపై మరోసారి చర్చకు దారితీసింది.
Read More
Next Story