
ట్రంప్, పుతిన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చురకలు వేసిన పుతిన్
భాగస్వాములతో వ్యవహరించే సమయంలో మంచి పదాలు వాడాలని సూచన
అమెరికాను అణగదొక్కడానికి చైనా వేదికగా రష్యా, ఉత్తర కొరియా ప్రయత్నిస్తున్నాయనే ట్రంప్ ఆరోపణలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తోసిపుచ్చాడు. ఇతర దేశాలతో వ్యవహరించే సమయంలో మంచి పదాలు వాడాలని ట్రంప్ కు చురకలు వేశారు.
షాంఘై కో ఆపరేషన్ సమ్మిట్, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన రోజును పురస్కరించుకుని చైనా నిర్వహించని భారీ సైనిక కవాతు అనంతరం ఆయన బీజింగ్ లో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘గత నాలుగు రోజుల నుంచి ఇక్కడ అన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి. అధికార, అనధికార సమావేశాలు నిర్వహిస్తున్నాం. కానీ ఒక్కరు కూడా అమెరికా విధానాలపై ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు’’ అని పుతిన్ అన్నారు.
మీడియా సమావేశంలో మాత్రం అమెరికా విధానాలను విమర్శించే ప్రయత్నం చేశాడు. భారత్, చైనా లపై ఆంక్షలు విధించడాన్ని ప్రశ్నించారు. ‘‘మీరు చైనా, భారత్ తో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. ఆసియా లోని రెండు శక్తివంతమైన దేశాలను ట్రంప్ పరిపాలన విభాగం ఆర్థిక ఆంక్షలు విధించి అదుపు చేయాలని అనుకుంటోంది’’ అని పుతిన్ అన్నారు.
చైనాలోనే పుతిన్..
ఎస్సీఓ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన పుతిన్ నాలుగు రోజులుగా చైనాలోనే పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో విస్తృత చర్చలు జరిపారు.
ఇతర దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. తరువాత విక్టరీ డే పరేడ్ లో కనిపించారు. అనంతరం కిమ్ జోంగ్ ఉన్ తో ఒకే కారులో ప్రయాణించి ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
కుట్ర చేశారంటూ పోస్ట్..
చైనాలో సమావేశాలకు ముందు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నందున పుతిన్, కిమ్ కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేయండి’’ అని పోస్ట్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో పుతిన్ అలస్కాలో ట్రంప్ తో జరిగిన చర్చలను ప్రస్తావించారు. చైనా పర్యటనలో తనతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ అలస్కాలో జరిగిన సమావేశానికి మద్దతు ఇచ్చారని చెప్పారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు చర్చలు ముగింపు పలుకుతాయనే ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.
సుంకాలపై విమర్శలు..
భారత్, చైనా పై సుంకాలను విధించే దూకుడు వైఖరి తీసుకోవడం మంచిది కాదని రష్యా అధినేత అమెరికాను హెచ్చరించారు. ఆసియాలోని రెండు అతిపెద్ద శక్తులను అణగ దొక్కడానికి ట్రంప్ పరిపాలన ఆర్థిక ఒత్తిడిని ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు.
భారత్, చైనాలను ఆయన మంచి భాగస్వాములుగా అభివర్ణించారు. అమెరికా రెండు దేశాల నాయకులను బలహీనపరిచే లక్ష్యంతో ఉందని అన్నారు. రెండు దేశాలలో బిలియన్ల జనాభా ఉందన్నారు. భారత్, చైనా రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలు అని వాటికి దేశీయ రాజకీయ యంత్రాంగాలు, చట్టాలు సమర్థవంతంగా ఉన్నాయని అన్నారు.
‘‘ఎవరైనా మిమ్మల్ని శిక్షించబోతున్నారని చెప్పినప్పుడూ మీరు ఎలా స్పందిస్తారు’’ అని ఆయన ప్రశ్నించారు. వాషింగ్టన్ కాలం చెల్లిన ఆలోచనలు చేస్తుందని రష్యా అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో వలసవాద యుగం ముగిసిందని భాగస్వాములతో మాట్లాడే సమయంలో మంచి పదాలు ఉపయోగించాలనే విషయాన్ని ట్రంప్ గ్రహించాలని చురకలు వేశారు.
ట్రంప్ తన మొదటి టర్మ్ లో చైనాను శత్రువుగా భావించి భారీ సుంకాలను విధించారు. కానీ ప్రస్తుతం రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసినందుకు రెండోసారి అధికారంలోకి వచ్చాక భారత్ పై సుంకాల మోత మోగిస్తున్నాడు. గత కొన్ని దశాబ్ధాలుగా భారత్ తో అమెరికా సంబంధాలు గణనీయమైన బలపడినప్పటికీ ట్రంప్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నాడు.
Next Story