‘పహల్గామ్’ ఉగ్రవాద దాడిని ఖండించిన ‘క్వాడ్’
x
క్వాడ్ సమావేశంలో ప్రసంగిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్

‘పహల్గామ్’ ఉగ్రవాద దాడిని ఖండించిన ‘క్వాడ్’

ఉగ్రవాదంపై ప్రపంచం జీరో టాలరెన్స్ విధానం ప్రదర్శించాలన్న ఎస్. జై శంకర్


జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో అమాయక టూరిస్టులను మతం అడిగి కాల్చి చంపిన ఘటనపై ‘క్వాడ్’ కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వాడ్ కూటమి సభ్యులైన అమెరికా,భారత్, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఈ మేరకు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడినవారు, దాని మాస్టర్ మైండ్స్, ఆర్థిక సాయం అందించినవారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని క్వాడ్ కూటమి పిలుపునిచ్చింది.
ఐక్యరాజ్యసమితి సభ్యులు దీనికి సాయం చేయాలని కోరింది. అయితే క్వాడ్ కూటమి సభ్యులు ఎక్కడా పాకిస్తాన్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. అలాగే ఆపరేషన్ సిందూర్, తరువాత రెండు దేశాల మధ్య జరిగిన నాలుగురోజుల అనధికార యుద్ధం గురించి పేర్కొనలేదు.
దాడిపై ఉమ్మడి ఖండన..
ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని ప్రధాన ప్రజాస్వామ్య దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి పెన్నీ వాంగ్, జపాన్ కు చెందిన తకేషీ ఇవాయా ఈ సంవత్సరంలో జరిగిన రెండో క్వాడ్ సమావేశానికి హాజరయ్యారు.
‘‘క్వాడ్ అన్ని రకాల ఉగ్రవాద చర్యలను, హింసాత్మక తీవ్రవాదాన్ని, సరిహద్దు ఉగ్రవాదంతో సహ అన్ని రూపాల్లోనూ, దాని వ్యక్తీకరణను నిస్సందేహంగా ఖండిస్తుంది.
ఏప్రిల్ 22, 2025న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు.’’ అని ఉమ్మడి ప్రకటన పేర్కొంది.
క్వాడ్ సభ్యుల ప్రకటనలో పాకిస్తాన్ పేరు స్పష్టంగా ప్రకటించకపోయినా, సీమాంతర ఉగ్రవాదం గురించి ప్రస్తావించడం ద్వారా పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించడం ద్వారా దాని వైఖరిని స్పష్టంగా తెలియజేసినట్లు అయింది.
స్పందించే హక్కు భారత్ కు ఉంది..
భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఆపరేషన్ సిందూర్ తో సహ భారత్ ఇటీవల చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ప్రస్తావించారు.
‘‘మనం ఇటీవల అనుభవాల దృష్ట్యా ఉగ్రవాదం గురించి ప్రపంచం జీరో టాలరెన్స్ విధానం ప్రదర్శించాలి’’ అని పహల్గామ్ ఉగ్రవాద దాడిపై ఆయన అన్నారు.
‘‘బాధితులు, నేరస్థులను ఎప్పుడూ సమానంగా చూడకూడదు. ఉగ్రవాదం నుంచి తన ప్రజలను రక్షించుకునే హక్కు భారత్ కు ఉంది. మేము ఆ హక్కును ఉపయోగించుకుంటాము. మా క్వాడ్ కూటమి ఈ విషయాన్ని అర్థం చేసుకుని అభినందిస్తారని మేము ఆశిస్తున్నాము’’ అని విదేశాంగమంత్రి అన్నారు.
పాక్ పై తీవ్ర విమర్శలు.
అమెరికాలోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ‘ది హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం’ అనే ప్రదర్శన ను ఎస్ జైశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాక్ పేరు చెప్పకుండానే తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
పొరుగు దేశానికి వ్యతిరేకంగా ఒక దేశం ఉగ్రవాదానికి మద్దతు అందించినప్పుడూ, ఉగ్రవాదానికి మతత్వానికి ఆజ్యం పోసినప్పుడూ ఇది బలమైన సూచనగా కనిపించినప్పుడూ చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉగ్రవాద బాధితుల కుటుంబాల వ్యథను చూసినప్పుడూ ఉమ్మడిగా దాని నిర్మూలించడానికి అందరికి బాధ్యతలు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. మానవాళికి ముప్పు కలిగించే అంశాలలో ఉగ్రవాదం ఒకటని చెప్పారు. ఐరాస నిర్వచించిన విధానాలు, నియామాలు, హక్కులకు ఇవి విరుద్దమని పేర్కొన్నారు.
ముంబై లో క్వాడ్ పోర్టులు..
ఈ సంవత్సరం ముంబైలో క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ది ఫ్యూచర్ భాగస్వామ్యాన్ని ప్రారంభించాలనే గ్రూప్ ప్రణాళికను క్వాడ్ సమావేశం కూడా ప్రకటించింది.
‘‘క్వాడ్ శాశ్వత ప్రభావాన్ని నిర్ధారించడానికి, సముద్ర, అంతర్జాతీయ భద్రత, ఆర్థిక శ్రేయస్సు, క్లిష్టమైన సాంకేతికత, మానవతా సాయం, అత్యవసర ప్రతిస్పందన అనే నాలుగు అంశాలపై బలమైన ఎజెండాను ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము.
ఈ కృషి ద్వారా ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి మా వనరులను ఉపయోగించుకునేలా క్వాడ్ సామర్థ్యాన్ని మేము పదును పెడతాము’’ అని క్వాడ్ విదేశాంగ మంత్రులు చెప్పారు.
ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందని పరోక్షంగా అంగీకరిస్తు, దాని పేరు మాత్రం ప్రస్తావించలేదు. తూర్పు చైనా సముద్రం, దక్షిణా చైనా సముద్రంలో జరుగుతున్న పరిస్థితి గురించి తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని మాత్రమే మంత్రులు తెలిపారు.
‘‘బలవంతంగా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించే ఏమైన ఏకపక్ష చర్యలకు మేము వ్యతిరేకతను ప్రకటిస్తున్నాము’’ అని వారు చైనా చర్యలను ఉద్దేశించి అన్నారు.
శాంతి కోసం పిలుపు..
ప్రకృతి వైపరీత్యాలలో సహయాన్ని అందించే క్వాడ్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి వీరు అంగీకరించారు. ఈ సంవత్సరం మొదటి క్వాడ్ ఇండో- పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్ వర్క్ ఫీల్డ్ శిక్షణా డ్రిల్స్ ను నిర్వహించాలని అనుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు.
‘‘భాగస్వామ్య దేశాల ఎయిర్ లిప్ట్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, ప్రకృతి వైపరీత్యాలను వేగంగా, సమర్థవంతంగా ఎదుర్కోవడం, ప్రాంతీయ భాగస్వాములకు మద్దతు అందించడం దీని లక్ష్యం’’ అని ప్రకటన పేర్కొంది.
క్వాడ్ ఉత్తరకొరియా క్షిపణి, అణ్వాయుధ కార్యక్రమాలను కూడా ఖండించారు. ఐరాస భద్రతా మండలి తీర్మానాను అనుసరించి వాటిని పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు.
‘‘ఉత్తర కొరియా చట్టవిరుద్దమైన సామూహిక విధ్వంసక ఆయుధాలు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి క్రిప్టో కరెన్సీ దొంగతనానికి విదేశాలలో కార్మికులను ఉపయోగించడం వంటి ఆ దేశ చర్యలు, సైబర్ కార్యకలాపాలపై క్వాడ్ తీవ్ర ఆందోళన చెందుతోంది’’ అని పేర్కొంది.
‘‘మయన్మార్ లో తీవ్రతరం అవుతున్న సంక్షోభం, ఆ ప్రాంతంపై దాని ప్రభావం పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నాము’’ అని మంత్రులు పేర్కొన్నారు. ‘‘కాల్పుల విరమణ చర్యలను అమలు చేయాలని, వాటిని విస్తరించాలని, విస్తృతం చేయాలి’’ అని తిరుగుబాటుదారులకు, సైన్యానికి పిలుపునిచ్చారు.
Read More
Next Story