పాకిస్తాన్ లో రీపోలింగ్, పీటీఐ రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపణ
x

పాకిస్తాన్ లో రీపోలింగ్, పీటీఐ రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపణ

పాకిస్తాన్ లో ఎన్నికలు ఒక విచిత్రం. ఆ దేశంలోని డీప్ స్టేట్ ను కాదని ఏం జరగదు అనడానికి ఇదొక ఉదాహరణ.


తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ (పీటీఐ) బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడిందనే ఆరోపణలపై పాకిస్తాన్ ఎన్నికల సంఘం పలు బూతులలో మళ్లీ రీపోలింగ్ కు ఆదేశించింది. ఆదివారం ఈ బూతులతో మరోసారి పోలింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తారని ఎన్నికల సంఘం తెలిపింది.

ఫిబ్రవరి 15 న ఈ రీపోలింగ్ ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. పాక్ కు చెందిన జియో న్యూస్ ప్రకారం పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లో పీటీఐ నాయకులు ఓటింగ్ సామగ్రిని తగలబెట్టడం, ఓటర్లను భయపెట్టి, వారే ఓట్లు వేసుకున్నారని ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

పాకిస్తాన్ లో ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికలు జరిగాయి. తదుపరి రోజు నుంచి లెక్కింపు ప్రారంభం అయింది. అయితే పాక్ నేషనల్ అసెంబ్లీ హంగ్ దిశగా వెళ్తోంది. కానీ మెజారిటీ స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ బలపరిచిన అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. దాదాపు వందకు పైగా స్థానాలు గెలుచుకుని తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు.

అయితే మిగిలిన పార్టీలు సైతం తమ ఉనికిని చాటుకున్నాయి. ఇప్పటి వరకూ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. పాక్ జాతీయ అసెంబ్లీ( పాకిస్తాన్ పార్లమెంట్) లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నందున తమనే ప్రభుత్వ ఏర్పాటకు అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ పిలుస్తారని పీటీఐ చైర్మన్ గోహర అలీ ఖాన్ పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జాతీయ అసెంబ్లీలో సాధారణ మెజారిటీని సాధించేందుకు 169 సీట్లు అవసరం. అయితే పాకిస్తాన్ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉండగా కేవలం 266 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. అయితే ఓ అభ్యర్థి మరణించడంతో ప్రస్తుతం 265 స్థానాలకే ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన స్థానాలకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరగవు. వాటిని పరోక్షంగా భర్తీ చేస్తారు. అందువల్ల ఎన్నికల్లో 133 సీట్లు గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇమ్రాన్ ఖాన్ తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 170 స్థానాల్లో గెలుపు సాధించారని ప్రకటించగా, ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం 100 సీట్ల వరకు గెలుపొందారని తెలుస్తోంది.

ఈవీఎంలు వాడాలి

పాకిస్తాన్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వాడి ఉంటే ఫలితాల ప్రకటనలో జాప్యం నుంచి దేశం బయటపడి ఉండేదని అధ్యక్షుడు అల్వీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. " ఈ రోజు ఈవీఎం లు వాడి ఉంటే నా ప్రియమైన పాకిస్తాన్ సంక్షోభం నుంచి గట్టేక్కి ఉండేది. " అన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఎన్నికల సంఘం పై అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున పలు ఆరోపణలు చేసిన వాటిని పరిష్కరించడంలో విఫలం అయిందని విమర్శించారు. పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకారం పీటీఐ బలపరచిన అభ్యర్థులు 100 స్థానాల్లో గెలుపొందారు. నవాజ్ షరీఫ్ పార్టీ 72 స్థానాల్లో, బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్ పార్టీ(పీపీపీ) 54 సీట్లను కైవసం చేసుకుంది.

Read More
Next Story