
నేడు భారత్ కు రానున్న రష్యా అధ్యక్షుడు
వాణిజ్యం,రక్షణ, ఇంధనమే ప్రధాన ఎజెండా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత్ లో పర్యటించబోతున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తరువాత ఆయన తొలిసారిగా న్యూఢిల్లీలో అడుగుపెట్టబోతున్నారు. రెండు దేశాల మధ్య 23 వ శిఖరాగ్ర సమావేశం దేశరాజధానిలో జరగబోతోంది.
వాణిజ్యం, రక్షణ, ఇంధన అవసరాలనే ప్రధాన ఎజెండాగా ఇరుదేశాల అధినేతలు చర్చలు జరపబోతున్నారు. పుతిన్ భారత్ లో రెండు రోజుల పాటు అంటే ఈ రోజు, రేపు పర్యటించబోతున్నారు.
తన పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలవడంతో పాటు మోదీ ఇచ్చే ప్రవేట్ విందులో ఆయన పాల్గొనబోతున్నారు. పుతిన్ సహయకుడు ఉషాకోవ్ ప్రకారం.. రెండు దేశాల మధ్య పారిశ్రామిక సహకారం, కొత్త సాంకేతికతలు, రవాణా, అంతరిక్ష కార్యక్రమాలు, మైనింగ్, ఆరోగ్య రక్షణ, కార్మిక చైతన్య వంటి అంశాలు చర్చకు రానున్నాయి.
రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్నాయని ఉషాకోవ్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలు విధించిన తరువాత పుతిన్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుందనే ఆరోపణలపై అదనంగా 25 శాతం సుంకాలను ట్రంప్ విధించారు.

