
అమృత్‌సర్ చేరుకున్న అమెరికా అక్రమ వలసదారుల రెండో విమానం..
116 మంది అక్రమవలసదారులతో అమెరికా నుంచి బయలుదేరిన విమానం శనివారం అర్థరాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్ (Amritsar) విమానాశ్రయానికి చేరుకుంది.
అక్రమవలసదారుల(Illegal immigrants) తో అమెరికా(America) నుంచి బయలుదేరిన విమానం శనివారం (ఫిబ్రవరి 15) అర్ధరాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్ (Amritsar) విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రి 10 గంటలకు రావాల్సి ఉండగా.. 11:35 గంటలకు ల్యాండ్ అయ్యింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులను తిరిగి వారి స్వదేశాలకు పంపుతున్న విషయం తెలిసిందే.
సెంకడ్ బ్యాచ్‌లో 116 మంది
రెండో బ్యాచ్‌లో 116 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో పంజాబ్‌కు చెందినవారు 65 మంది, 33 మంది హర్యాణా, 8 మంది గుజరాత్, ఉత్తర ప్రదేశ్,గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన వారు ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన వారు ఒకరు చొప్పున ఉన్నారు. వీరందరి వయస్సు 18 నుంచి 30 మధ్య ఉన్నట్లు PTIకి అధికార వర్గాలు తెలిపాయి. వీరి పూర్తి వివరాలు తెలుసుకున్నాక ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో పోలీసు వాహనాల్లో స్వస్థలాలకు తరలించారు. మూడో బ్యాచ్‌లో 157 మంది (ఫిబ్రవరి 16) రానున్నట్లు సమాచారం. 104 మందితో మొదటి బ్యాచ్ ఫిబ్రవరి 5న వచ్చిన విషయం తెలిసిందే. వీరిలో 33 మంది హర్యాణా, 33 మంది గుజరాత్, 30 మంది పంజాబ్‌కు చెందినవారు ఉన్నారు. ఇప్పటివరకు ఇండియాకు తిరిగి వచ్చిన చాలామంది అక్రమవలసదారులంతా ట్రావెల్ ఏజెంట్ల మోసానికి గురయినవారే. దీంతో ఏజెంట్లపై కేసులు కూడా నమోదవుతున్నాయి.
కొంత మంది అక్రమవలస కుటుంబసభ్యులు విమానాశ్రయానికి చేరుకొని వారిని స్వాగతించారు. పొలం, ఆస్తులు తాకట్టుపెట్టి అమెరికా పంపించారని, ఇలా తిరిగి వస్తారని అనుకోలేదని విచారం వ్యక్తం చేశారు. టాండా ప్రాంతంలోని కురాలా కలాన్ గ్రామానికి దల్జీత్ సింగ్ కుటుంబసభ్యులు ట్రావెల్ ఏజెంట్ మోసానికి గురయ్యాడని చెప్పారు. దల్జీత్ సింగ్ భార్య కమల్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, "నా భర్తకు నేరుగా అమెరికా వెళ్ళే విమానం ఏర్పాటు చేస్తామని ఏజెంట్ చెప్పాడు. కానీ, "డంకీ రూట్" అనే ప్రమాదకరమైన మార్గం ద్వారా తీసుకెళ్లాడు" అని తెలిపారు.
‘డిపోర్ట్ సెంటర్‌గా మార్చొద్దు’
ఇటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మా పవిత్ర నగరం అమృత్‌సర్‌ను డిపోర్ట్ సెంటర్‌గా మార్చొద్దు" అని కోరారు. మాన్ మాట్లాడుతూ.. "దేశంలో ఎన్నో ఎయిర్ బేస్‌లు ఉన్నాయి. కానీ, ఎందుకు విదేశాల నుంచి అక్రమవలసదారులను (డిపోర్టీ) అమృత్‌సర్‌కే తీసుకువస్తున్నారు?" అని ప్రశ్నించారు. "వాటికన్ నగరానికి చెందిన వలసదారులు ఉంటే.. అక్కడ విమానం ల్యాండ్ అయ్యేనా?" అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. పంజాబ్‌కు చెందిన వారిని వారి స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. హర్యాణా వాసులను కూడా తమ సొంత రాష్ట్రాలకు తామే తరలిస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించగా, హర్యాణా ప్రభుత్వం ఇప్పటికే తమ ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల వారిని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపి, అక్కడి నుండి వారి స్వస్థలాలకు తీసుకెళ్లనున్నట్లు మాన్ తెలిపారు. అలాగే, ప్రయాణికుల కోసం భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు చెప్పారు.
BJP నేత కౌంటర్..
భగవంత్ మాన్ వ్యాఖ్యలకు BJP నేత RP సింగ్ కౌంటర్ ఇచ్చారు. "అమెరికా నుంచి భారతదేశానికి వచ్చే విమానాలకు అమృత్‌సర్ సమీప అంతర్జాతీయ విమానాశ్రయం" అని కౌంటర్ ఇచ్చారు. అలాగయితే అమృత్‌సర్ నుంచి నేరుగా అమెరికా వెళ్లే విమాన సర్వీసులు ఎందుకు ప్రారంభించరు?" అని ఎదరు ప్రశ్నించారు RP సింగ్.
ట్రావెల్ ఏజెంట్లపై SIT దర్యాప్తు
NRI వ్యవహారాల అదనపు డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సిన్హా ఆధ్వర్యంలో నాలుగురి సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటయ్యింది. నకిలీ ట్రావెల్ ఏజెంట్ల ముఠాలను వెలికితీయాలని పంజాబ్ DGP గౌరవ్ యాదవ్ ఆదేశాలు ఇచ్చారు.