‘బంగ్లా’ లో ‘షేక్’ అయినా హసీనా సర్కార్.. ప్రధాని పదవికి రాజీనామా
x

‘బంగ్లా’ లో ‘షేక్’ అయినా హసీనా సర్కార్.. ప్రధాని పదవికి రాజీనామా

బంగ్లా ప్రధాని షేక్ హసీనాను ఆ దేశ విద్యార్థులు తరిమేశారు. కొన్ని రోజులుగా దేశంలో కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి ప్రజా మద్ధతు లభించడంతో హసీనా రాజీనామా చేసి..


బంగ్లాదేశ్ లో షేక్ హసీనా సర్కార్ కూలిపోయింది. ప్రజా ఉద్యమానికి బెదిరిన ప్రధాని తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని తన కుటుంబంతో సహ దేశాన్ని విడిచి భారత్ లో ఆశ్రయం పొందిందని సమాచారం. దీనితో నిరసన కారులు అధికార అవామీ లీగ్ పార్టీ కార్యాలయాలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.

బంగ్లాదేశ్ కు స్వాతంత్రం లభించిందని నిరసన కారులు రాజధాని ఢాకాలో ఊరేగింపు నిర్వహించారు. పరిస్థితి కుదుటపరచడానికి ఆర్మీరంగంలోకి దిగింది. సైనిక జనరల్ వాకర్ ఉజ్ జమాన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. దేశంలో మధ్యంతరం సైనిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని కోరారు. అన్ని హత్యలపై విచారణ కొనసాగుతుందని ప్రజలకు హమీ ఇచ్చారు.

కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ సంస్కరణలు కోరుతూ విద్యార్థులు ఉద్యమం చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కోటాను తీసి వేయడంతో ఉద్యమం శాంతించింది. అయితే ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తి వేయాలని కోరుతూ మరోసారి విద్యార్థులు, రాజకీయ పార్టీలు రోడ్డెక్కారు.

మూడు రోజులుగా జరుగుతున్న ఉద్యమంలో ఇప్పటికే 100 మంది మరణించారు. రికార్డు స్థాయిలో నాలుగో సారి ప్రధానిగా ఎన్నికైన షేక్ హసీనా జనవరిలోనే పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వరుసగా జరిగిన ప్రజా ఉద్యమాలతో హసీనా తప్పుకుంది.

ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ టెలివిజన్ లో మాట్లాడుతూ.. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. “ మనం రాజకీయ పరివర్తన కాలంలో ఉన్నాము. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అన్ని హత్యలపై విచారణ జరుగుతుంది. సైన్యాన్ని విశ్వసించండి, ” అని జనరల్ చెప్పారు.

శాంతి భద్రతలను కాపాడాలని ఆర్మీ చీఫ్ ప్రజలకు సూచించారు. "నాపైన నమ్మకం ఉంచండి, కలిసి పని చేద్దాం. పోరాటం వల్ల మనకు ఏమీ రాదు. సంఘర్షణను నివారించండి. అందరం కలిసి అందమైన దేశాన్ని నిర్మించాం’’ అని పిలుపునిచ్చారు.

గత వారం ప్రభుత్వం నిషేధించిన జమాతే ఇస్లామీతో సహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. అయితే తాత్కాలిక ప్రభుత్వానికి ఎవరు సారథ్యం వహిస్తారనే దానిపై స్పష్టత రాలేదు. తాను అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్‌ను కలుస్తానని, ఈ రోజు చివరిలోగా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు జనరల్ జమాన్ తెలిపారు.




ఉద్యమం అణచివేయడానికి...

షేక్ హసీనా ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయడానికి అనేక చర్యలు చేపట్టింది. ఇంటర్నేట్ నిలిపివేయడం, సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు, కాల్స్ సంఖ్యపై నియంత్రణ, నిరవధిక కర్ప్యూ వంటి పద్ధతులను ఉపయోగించింది. అయితే ఇవేవీ ఈ ఉద్యమాన్ని ఆపలేకపోయాయి.

పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగంతో కోపంగా ఉన్న ప్రజలు వారితో చేరడంతో కోటా సంస్కరణ నిరసన ‘ప్రజా ఉద్యమంగా’ మారింది. ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించినప్పటికీ, ఉద్యమంలో జరిగిన మరణాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మరో ఉద్యమం కొనసాగింది.

ఇది వెంటనే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది. ఆదివారం, 13 మంది పోలీసులతో సహా కనీసం 100 మంది మరణించారు. సోమవారం, ఢాకాలో కనీసం ఆరుగురు మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

దేశాన్ని విడిచిపెట్టిన షేక్ హసీనా..

హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలిసి దేశం విడిచి వెళ్లిన తర్వాత నిరసనకారులు ప్రధాని నివాసం గణభవన్‌పై దాడి చేసి లూటీ చేశారు. అవామీ లీగ్ కార్యాలయాలు, ఢాకా తదితర ప్రాంతాల్లోని ఆ పార్టీ నేతల నివాసాలపై కూడా ప్రజలు దాడి చేశారు.

ఫారెక్స్ నిల్వలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వస్తువుల ధరల కారణంగా ఇప్పటికే భారం పడుతున్న ఆర్థిక వ్యవస్థను నిరసనలు కుంగదీశాయి. ఫ్రీలాన్సర్లు, చిన్న ఆన్‌లైన్ వ్యాపారాలపై ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ దెబ్బతినడంతో దేశంలోని ఎగుమతి ఆధారిత రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమలో ఉత్పత్తి దెబ్బతింది.

ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నందున శాంతిభద్రతలను పునరుద్ధరించడం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. దీర్ఘకాలంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు, శాంతియుతంగా అధికారం అప్పగించడం పరిస్థితిని మెరుగుపరుస్తుంది.

Read More
Next Story