అందరి దృష్టి ‘హసీనా’ రెండో అడుగుపైనే..
x

అందరి దృష్టి ‘హసీనా’ రెండో అడుగుపైనే..

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పర్యటన కోసం న్యూఢిల్లీ కి వచ్చారు. ఇరు దేశాల మధ్య దాదాపు..


బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా జనవరిలో తిరిగి ఎన్నికైన తర్వాత తన మొదటి ద్వైపాక్షిక పర్యటన కోసం చైనా కంటే ముందు భారత్‌ను ఎంచుకుంది, ఆమె రెండు రోజుల న్యూఢిల్లీ పర్యటనలో దాదాపు పది ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే తీస్తా నదీ జల వివాదాలపై మాత్రం పెద్దగా శ్రద్ద చూపలేదు.

భారత్- బంగ్లాదేశ్ మధ్య చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు 54 నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి చాలా సార్లు రెండు దేశాల సరిహద్దులను దాటుతూ ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న తీస్తా నదీ జలాలు ఇరు దేశాల మధ్య సున్నితమైన, భావోద్వేగ సమస్యగా మిగిలిపోయింది. అందువల్ల ఇరుదేశాలు దీనిపై ఎటువంటి శ్రద్ధ చూపట్లేదని అర్ధమైంది. వచ్చే నెలలో అధికారిక పర్యటన నిమిత్తం హసీనా చైనా వెళ్లనున్నారు. అందులో చైనా ప్రతిపాదించిన తీస్తా ప్రాజెక్ట్ ఉంది.
పక్షం రోజుల్లో రెండో ప్రయాణం
ఇంతకుముందు భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడో సారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు పొరుగుదేశాల అధినేతలు హజరైన సందర్భంలో వారితో పాటు హసీనా కూడా న్యూఢిల్లీకి వచ్చారు. ఇప్పుడు మరోసారి దేశానికి అధికారిక పర్యటన నిమిత్తం వచ్చారు. జూన్ 21 నుంచి 22 వరకు హసీనా రెండు రోజుల న్యూ ఢిల్లీ పర్యటన, మోదీ వరుసగా మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ప్రారంభించిన తరువాత జరిగిన మొదటి పర్యటన.
బంగ్లాదేశ్ ప్రధాని జనవరిలో తిరిగి ఎన్నికైన తర్వాత తన మొదటి పర్యటన కోసం భారతదేశాన్ని ఎన్నుకోవాలని తీసుకున్న నిర్ణయం, న్యూఢిల్లీకి తను ఇస్తున్న అత్యంత ప్రాధాన్యం సంగతి తెలియజేస్తుంది.
విస్తృత శ్రేణిలో ఒప్పందాలు జరిగాయి
ఇరు పక్షాలు పరస్పరం తమ "జాతీయ అభివృద్ధి లక్ష్యాలను" సాధించడంలో సాయపడటానికి వివిధ రంగాలలో దాదాపు 10 ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా తమ సంబంధాలను మరింత పటిష్టం చేసుకున్నాయి. బంగ్లాదేశ్ తన సొంత ఉపగ్రహ వాహాక నౌక తన మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించడంలో సాయం చేయాలని భారత్ నిర్ణయించింది.
భారతీయ ఆసుపత్రులు, వైద్య కేంద్రాలలో వైద్య చికిత్స కోసం మన దేశానికి వచ్చే బంగ్లాదేశ్ ప్రజలకు ఇ-వీసా సౌకర్యాన్ని కూడా న్యూఢిల్లీ ప్రకటించింది. రక్షణ, అంతరిక్షం, సముద్ర శాస్త్రం, సరిహద్దు నిర్వహణ, ఉమ్మడి నదుల నీటిని పంచుకోవడం, కనెక్టివిటీ, వాణిజ్యం, వాణిజ్యం, డిజిటల్, గ్రీన్ టెక్నాలజీలు వంటి అవగాహన ఒప్పందాలు (MOUలు) ఇరుపక్షాలు సంతకం చేసిన విస్తృత శ్రేణిలో ఉన్నాయి. అలాగే ఇరుపక్షాల మధ్య కీలకమైన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై త్వరలో చర్చలు ప్రారంభించేందుకు కూడా అంగీకరించాయి.
సరిహద్దు- భద్రత
ఇరుపక్షాలు తమ సరిహద్దులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి ప్రయత్నిస్తామని, తమ తమ సరిహద్దు బలగాలు జరిపే కాల్పుల వల్ల సంభవించే మరణాల సంఖ్యను తగ్గిస్తామని కూడా ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్‌కు ఈ విషయంలో హామీ ఇచ్చింది. సరిహద్దులో బంగ్లాదేశ్ పౌరులు క్రమం తప్పకుండా సరిహద్దు ఉద్రికత్తల కారణంగా మరణించడం ఒక భావోద్వేగ సమస్యగా మారింది. ఇది పొరుగుదేశంలో మనదేశంపై వ్యతిరేకత పెరగడానికి దారితీస్తోంది.
హసీనా ద్వైపాక్షిక, ప్రాంతీయ, అలాగే ప్రపంచ పరిణామాలపై నిషేధిత ఫార్మాట్‌లో, ప్రతినిధుల స్థాయిలో మోదీతో సమావేశాలు నిర్వహించారు. తీవ్రవాద వ్యతిరేకత, రాడికలిజం వ్యతిరేక రంగాలలో ఇరుపక్షాలు ఏవిధంగా కలిసి పనిచేయగలవని చర్చించారు. ఈ సమస్య ను అదుపు చేయకపోతే రెండు దేశాల అభివృద్ధి, వృద్ధికి తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రధాని మోదీ తో సమావేశం పూర్తయ్యాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తో కూడా హసీనా భేటీ అయ్యారు.
సాంప్రదాయ లింక్‌ల పునరుద్ధరణ
హసీనా, ఆమె ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ప్రధాని మోదీ ప్రసంగించారు. రెండు దేశాల మధ్య సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్యం, కనెక్టివిటీ సహకారంపై దృష్టి సారించే విషయంలో తాను, హసీనా గత ఏడాది దాదాపు 10 సార్లు కలుసుకున్నామని చెప్పారు.
1965 భారత్-పాకిస్థాన్ యుద్ధం వరకు రెండు దేశాల మధ్య ఉన్న సంప్రదాయ నీరు, రోడ్డు, రైలు మార్గాలను పునరుద్ధరించడమే భారత్ ప్రయత్నమని మోదీ అన్నారు. లింక్‌లు పునరుద్ధరించబడిన తర్వాత, అవి రెండు దేశాల మధ్య మాత్రమే కాకుండా ఇతర సరిహద్ధు దేశాల వారితో వస్తువుల, వ్యక్తుల కదలికకు సాయపడతాయని, దాని వల్ల ఉభయ దేశాలు లాభపడతాయాని మోదీ అన్నారు.
విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మాట్లాడుతూ, ఇద్దరు ప్రధానుల మధ్య చర్చలు ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై దృష్టి సారించాయని, ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ఎలా అనే అంశంపై చర్చించారని చెప్పారు. ఇందులో మూడో దేశం ప్రస్తావన రాలేదని పరోక్షంగా చైనా పేరును వెల్లడించారు.
చైనాతో గొడవ
భారత్ ను ఇబ్బందుల్లో నెట్టేందుకు చైనా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అందుకోసం బంగ్లాదేశ్ లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. దాని ప్రభావం తగ్గించడానికి భారత్ కూడా కౌంటర్ గా కొన్ని పనులు, ఒప్పందాలు చేసుకోవడంలో నిమగ్నమైంది. ఈ రెండు ప్రపంచ శక్తుల మధ్య గొడవ మే 2020 నుంచి తీవ్రమైంది.
ఎల్ఏసీ వెంట భారత సైన్యం, ప్రపంచంలోనే శక్తివంతులని చెప్పుకునే పీఎల్ఏ ను నిర్భంధించింది. ఇది ఇరుదేశాల మధ్య అనధికారిక సరిహద్దు కావడంతో ఎప్పుడూ ఇదో రావణకాష్ఠంలా రగులుతూనే ఉంటుంది. ఇది గత నాలుగు సంవత్సరాలుగా ఇంకా అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా చైనా పర్యటనకు వెళ్లే ముందు న్యూఢిల్లీ ని సందర్శించి ఒప్పందాలు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
హసీనా చర్యల వెనక ఉద్దేశం..
హసీనా బీజింగ్‌ను త్వరగా సందర్శించాలని చైనీయులు ఆసక్తిగా ఉన్నారు, అయితే ఆమె భారత పార్లమెంటరీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూడాలని నిర్ణయించుకుంది. బీజింగ్‌కు వెళ్లే ముందు న్యూ ఢిల్లీ పర్యటనను పూర్తి చేసింది.
చాలా మంది భారతీయ పరిశీలకులు ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ఉపఖండంలోని ఇతర దేశాల కంటే న్యూఢిల్లీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే చైనా ప్రతిపాదన వినకముందే తీస్తా నది వంటి కీలక సమస్యలపై భారత్‌కు కట్టుబడి ఉండేలా హసీనా చురుకైన దౌత్య నీతిని చూపారని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వివాదాస్పద తీస్తా..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి బలమైన ప్రతిఘటన కారణంగా బంగ్లాదేశ్‌తో తీస్తా నది నీటిని పంచుకోవడంపై మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోలేకపోయింది. పొరుగుదేశానికి ఎంతనీటిని వదిలితే మన దేశంలోని రైతులకు అంతే మొత్తం లో నష్టం జరుగుతుందని మమతా అప్పట్లో వాదించారు. 2014 లో మోదీ ప్రధాని అయ్యాక కూడా ఈ విషయంలో మమతా బెనర్జీని ఒప్పించడంలో విఫలమయ్యారు. తీస్తానదీపై యధాతథ స్థితి చివరకు చైనా ను సంప్రదించాలనే నిర్ణయానికి హసీనా వచ్చారు.
బీజింగ్ ఆఫర్
నాలుగు సంవత్సరాల క్రితం, బీజింగ్ బహుళార్ధసాధక తీస్తా రివర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. 1-బిలియన్ యూఎస్ డాలర్ల ప్రాజెక్టులో డ్రెడ్జింగ్, రిజర్వాయర్ల నిర్మాణం, నది పొడవునా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఒడ్డున కట్టలు, చిన్న నగరాలను నిర్మించడం వంటివి ఉన్నాయి ఇందులో ఉన్నట్లు స్థానిక వార్తా పత్రికలు వెల్లడించాయి.
అయితే మేలో బంగ్లాదేశ్‌లో పర్యటించిన సందర్భంగా విదేశాంగ కార్యదర్శి క్వాత్రా తీస్తా ప్రాజెక్టుకు భారత్‌ మద్దతును అందించారు. ఇరుపక్షాల మధ్య గంగా జలాల ఒప్పందం గడువు త్వరలో ముగియనున్నందున, దాని విషయాన్ని కూడా భారత ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన ఢాకాకు హమీ ఇచ్చారు.
భారత్ ఈశాన్య రాష్ట్రాలను కలిపే వ్యూహాత్మక భూభాగం - సిలిగురి "చికెన్ నెక్" కారిడార్ నుండి కేవలం 100 కి.మీ దూరంలో ఉన్న ప్రాంతంలో చైనా తీస్తా నదీ నిర్మాణం పేరుతో రావడం భారత్ కు సుతారం ఇష్టం లేదు. ఇది రెండు వైపులా భారత్ ను దిగ్భంధనం చేసే ప్రమాదం ఉంది కాబట్టి న్యూఢిల్లీ తక్షణమే స్పందించింది.
తర్వాత ఏంటి?
తీస్తా నదీ జలాల వివాదంపై న్యూఢిల్లీ ఇచ్చిన ఆఫర్ హసీనాపై పనిచేసింది. బీజింగ్ ఇచ్చిన ఆఫర్ ను సీరియస్ గా చూడాలని సంబంధిత శాఖలోని అధికారులను కోరినట్లు ప్రధాని ఆ దేశ పార్లమెంట్ లో ప్రకటించారు. బంగ్లాదేశ్ కు ఇది ముఖ్యమైన ప్రాజెక్ట్ కావడంతో భారత్ ను బలవంతంగా నైనా తీస్తా ప్రాజెక్ట్ విషయంలో ఒప్పించే పనికి హసీనా పూనుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే పక్షం రోజుల వ్యవధిలో ఆమె రెండో సారి మనదేశంలో అధికారికంగా పర్యటించారు.
బంగ్లాదేశ్‌లోని తీస్తా నది నిర్వహణ కోసం సాంకేతిక బృందాన్ని పంపేందుకు భారత్ ఇప్పుడు అంగీకరించింది. అయితే ఈ ఉమ్మడి నది నీటిని పంచుకోవడం గురించి కాదని క్వాత్రా స్పష్టం చేశారు. ఇప్పుడు భారత్ దృష్టి మొత్తం కూడా హసీనా జరపబోయే బీజింగ్ పర్యటనపైనే ఉంది. అక్కడ ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయో వేచి చూడాలి.
Read More
Next Story