
కాలిఫోర్నియాలో సంగీత కార్యక్రమంలో కాల్పులు.. 9 మందికి గాయాలు
ఒకరి పరిస్థితి విషమం..
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. కాలిఫోర్నియాలో ఓ సంగీత కార్యక్రమం జరుగుతున్న సమయంలో దుండగులు జనంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ కాల్పుల వెనుక గ్యాంగ్‌ల ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని తులారే కౌంటీ పరిధిలో ఉన్న స్ట్రాత్‌మోర్ పట్టణంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 150 మంది హాజరైన సంగీత కార్యక్రమంలో రాత్రి 7.30 గంటల సమయంలో ఒక్కసారిగా కాల్పులు ప్రారంభమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు జనంపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పలువురు తుపాకీ గాయాలతో బాధపడుతున్నారు. పోలీసులు క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించడంతోపాటు, వారిని ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు.
ఈ కాల్పుల్లో 26 ఏళ్ల యువకుడికి ఛాతీలో బుల్లెట్ గాయమైంది. అతడికి శస్త్రచికిత్స చేసినప్పటికీ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు బాధితులు 19, 22 ఏళ్ల వయసున్నవారు. వీరికి కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. మిగిలిన ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఇక ఈ ఘటన వెనుక గ్యాంగ్‌ల మధ్య విభేదాలు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే కాల్పులకు పాల్పడినవారు ఎవరు? దాడికి అసలు కారణమేంటి? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు కూడా పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని షెరీఫ్ కార్యాలయం స్పష్టం చేసింది. కాల్పులకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Next Story
