చైనా, దక్షిణాసియా చేరువ కావాలి, సహకరించుకోవాలి
x
భారత్ ,చైనా, దక్షిణాసియాల మైత్రి పెరుగుతుందా?

చైనా, దక్షిణాసియా చేరువ కావాలి, సహకరించుకోవాలి

భారత్, చైనా,ఆసియా దేశాల మధ్య సత్సంబంధాలు, సంపూర్ణ మైత్రి నెలకొనాలి, అన్ని రంగాలలో సహకారం నెలకొల్పుకొవాలి: భారత చైనా మిత్ర మండలి


డాక్టర్. యస్. జతిన్ కుమార్

ప్రస్తుత బహుళపక్ష ప్రపంచంలో, పరస్పర జాతీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం ఆధారంగా దేశాల మధ్య సంబంధాలు నెలకొంటున్నాయి, అభివృద్ది చెందుతున్నాయి. ప్రతి దేశం తానున్న ప్రాంతం యొక్క శాంతినీ, అభివృద్ధిని కోరుతున్నాయి. వర్ధమాన దేశాలు తమపై ఇతరుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గతంలో అనుసరించిన వలసవాద విధా నాలను, నేటి సామ్రాజ్యవాద పెత్తందారితనాన్ని ఎదిరిస్తున్నాయి. వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవటానికి నడుంకడుతు న్నాయి.

తమకు అండగా నిలిచే శాంతి ప్రియ దేశాలతో స్నేహం చేస్తున్నాయి. ఈ నేపధ్యం లో డిసెంబర్ 12,2023న “చైనా దక్షిణ ఆసియా దేశాల మైత్రి సంఘా”ల 8వ ద్వివార్షిక సమావేశం జరిగింది, చైనా పీపుల్స్ అసోసియేషన్ ఫర్ ఫ్రెండ్ షిప్ విత్ ఫారిన్ కంట్రీస్ (సీపీఏఎఫ్ఎఫ్సీ) ఈ ఫోరమ్ కు పిలుపు నిచ్చింది, జియాంగ్ షీ ప్రావిన్స్ లోని నాన్చాంగ్ నగరంలో సమావేశం ఏర్పాటు చేసింది.

జియాంగ్సీ ప్రావిన్షియల్ ప్రజాప్రభుత్వము,దక్షిణ ఆసియా ప్రాంత దేశాల మధ్య మైత్రీ, సహకారం కొరకు ఏర్పడిన సంస్థ [ఆర్గనైజేషన్ ఫర్ సౌత్ ఏషియన్ రీజినల్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్—ఓఎస్ఏఆర్ఎఫ్సీసీ] సంయుక్తంగా 2023 డిసెంబర్ 11 నుంచి 15 వరకు ' మానవాళి భవిష్యత్తు కోసం పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలు' అనే కీలక అంశం (థీమ్) తో ఈ ఫోరమ్ ను నిర్వహించాయి.

"చైనా- దక్షిణా సియా దేశాల మధ్య మంచి సంబంధాలు వృద్ధిచెందడానికి, నేరుగా “ప్రజల నుండి ప్రజలకు” స్నేహపూర్వక మార్పిడిని మరింతగా ప్రోత్సహించడానికి, వారి అనుభవాల ను పంచుకొని పరస్పర సహకార అవకాశాలను పెంచుకోవడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం" జరిగింది. ఈ ఫోరం లో భారత చైనా మిత్ర మండలి (ఆంధ్ర-తెలంగాణ) తరఫున ఇద్దరు సభ్యుల ప్రతినిధి బృందం పాల్గొంది. ఒకరోజు చర్చలు, రెండు రోజులు క్షేత్ర పర్యటనలు నిర్వహించారు.

జరుగుతున్న అభివృద్ధిని, మౌలిక వసతుల నిర్మాణాన్ని, ప్రాచీన నాగరికత, సంస్కృతులకు నిలయమైన యాంగ్సీనదీ పరీవాహక ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను, సాంస్కృతిక కేంద్రాలను సందర్శిం చే అవకాశం కలిగింది. రెండువేల సంవత్సరాల నాటి కళా కృతులను, సంగీత సాహిత్య కృతులను సేకరించి, పురాతన వస్తువులను తవ్వి తీసి, భద్రపరచిన వస్తుశాలలు, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పింగాణీ వస్తువులను క్రోడీకరించి, వాటి తయారీని ఆధునిక పరిశ్రమగా తీర్చిదిద్దిన కథనాలను పరిశీలించాము.

మన పొరుగు దేశాలైన నేపాల్ (5) బంగ్లాదేశ్ (2) భారత్ (2) పాకిస్థాన్ (1) మాల్దీవులు (1), శ్రీలంక (9) నుండి స్నేహ సంస్థల ప్రతినిధులు మొత్తం 20 మంది ఈ సదస్సుకు హాజరయ్యారు.

నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దౌత్య కార్యాలయ ప్రతినిధులు ఈ వేదికకు తమ సహకారాన్ని అందించగా, కొందరు చర్చల ఆసాంతం అక్కడే ఉండిపోయారు. గతంలోఈ సమావేశాలకు భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు కొన్నిసార్లు హాజర య్యారు కానీ ఈ సారి భారత దేశం నుండి అధికార ప్రతినిధులు ఎవ్వరూ ఈ సమావేశానికి రాలేదు. చైనాలోని వివిధ ప్రావిన్సులకు చెందిన స్నేహ సంస్థలు, స్థానిక చైనా ప్రభుత్వ ప్రతినిధులు అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో ఎనిమిది మంది సభ్యుల బృందం విదేశీ ప్రతినిధులకు ఐదు రోజులు తోడుగా నిలిచి అన్నికార్యక్రమాలను అను సంధానించింది.

జియాంగ్సీ ప్రావిన్షియల్ పీపుల్స్ గవర్నమెంట్ లో విదేశీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ శ్రీ ఫాన్ యాంగ్ యాంగ్ నిర్వహించిన అద్భుతమైన ప్రారంభ కార్యక్రమం తరువాత ఈ ఫోరం మూడు సెషన్లలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో సిపిఎఎఫ్ఎఫ్ సి వైస్ ప్రెసిడెంట్ జియాంగ్ జియాంగ్, జియాంగ్సీ వైస్ గవర్నర్ జియా వెన్యాంగ్ ప్రసంగించారు.

తమదేశం పరస్పర ప్రయోజనం అనే లక్ష్యంతో ఈ ప్రపంచ ఆర్ధిక అభివృద్దికి, పేదరికం నిర్మూలనకు కట్టుబడి వుందని చెప్పారు. శాంతియుత వాతావరణంలోనే అభివృద్ధి సాధ్యమని అందుకు అన్ని దేశాలతో తాము స్నేహాన్ని కోరుకుంటున్నామని, ఇతరుల అంతర్గత వ్యవహారాలలో జోక్యంలేకుండా దౌత్య సంబంధాలు నిర్వహించటం, అన్ని దేశాలను సమాన ప్రాతిపదికపై గౌరవించటం తమ విధానం అని స్పష్టం చేశారు.

వాణిజ్య వ్యాపార అభివృద్దికి ఇతరులతో సహకారానికి ఎప్పటికప్పుడు ప్రవేశ పెడుతున్న అనేక పథకాలను వివరించారు. ఓఎస్ ఏఆర్ ఎఫ్ సీసీ చైర్మన్ అనూప్ భట్టారాయ్, బీజింగ్ లోని నేపాల్ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సురేంద్ర కుమార్ యాదవ్, దక్షిణ ఆసియా దేశాలకు చైనా ఒక గొప్ప అండగా వుందని అనేక దేశాల అభివృద్ది కి తోడుగా నిలుస్తున్నదని కొనియాడారు. తమ నేపాల్లో సర్వతోముఖాభివృద్ధికి అనేక విధాలుగా సహకరిస్తున్నదని, బెల్ట్ అండ్ రోడ్ పథకం వల్ల తమకు ఎంతో ప్రయోజనం చేకూరిందని వారు పేర్కొన్నారు.

సిపిఎఎఫ్ఎఫ్ సి- ఆసియా ఆఫ్రికా వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్- జు యాన్ అధ్యక్షత వహించిన ప్యానల్ డిస్కషన్ మొదటి సెషన్, చైనా-దక్షిణాసియాల ఉమ్మడి అభివృద్ధి కోసం కొత్త చోదక శక్తులను పెంపొందించడంపై దృష్టి సారించింది. రెండో సెషన్ లో చైనా, దక్షిణా సియా దేశాల మధ్య ప్రజారంగం లో నెలకొనవలసిన సంబంధాలు, సాంస్కృతి క మార్పిడిలో కొత్త పురోగతి సాధించడంపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సభకు శ్రీలంకకు చెందిన ఇంద్రానంద అబేశేఖర వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

చైనా, దక్షిణాసియా దేశ నగరాల మధ్య స్నేహపూర్వక సహకారం కోసం కొత్త అధ్యాయాన్ని రూపొందించడంపై మూడవ ప్యానెల్ చర్చించింది, ఈ సెషన్ కు జియాంగ్సీ పిఎఎఫ్ఎఫ్ సి ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు టు అన్బో అధ్యక్షత వహించారు. సిపిఎఎఫ్ఎఫ్సి ఆసియా, ఆఫ్రికా వ్యవహారాల- డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జు యాన్ ఈ సమావేశాల సారాంశాన్ని క్రోడీకరిస్తూ ప్రవేశ పెట్టిన సంయుక్తప్రకటన [8వ సిఎస్ఎఎఫ్ఓ నాన్చాంగ్ డిక్లరేషన్] ను ఆమోదించి ఫోరం ముగిసింది ఆ ప్రకటనలో ముఖ్యాంశాలు లోతుగా అధ్యయనం చేయ తగ్గవి.

“ ఇటీవల చైనా, దక్షిణాసియా మధ్య పెరిగిన ఆచరణాత్మక సహకారం, సాధించిన విజయాలను ఈ ఫోరం ప్రశంసించింది. భాగస్వామ్య దేశాలలో ఆర్థికాభివృద్ధికి, ప్రజల జీవనోపాధి మెరుగుదలకు బీఆర్ఐ (బెల్ట్ అండ్ రోడ్ ఇన్సియేటివ్) దోహదం చేస్తుంది. ప్రభుత్వేతర శక్తులను సమీకరించడానికి, దక్షిణాసియా దేశాల అభివృద్ధి వ్యూహాలతో బిఆర్ఐని మరింత సమన్వయం చేయడానికి, అంతరాయం లేకుండా ప్రాంతీయ ఆర్థిక సహకారాలను ప్రవహింప జేయటానికి, ఉన్నతీకరించడానికి దక్షిణాసియా లోని ప్రజలకు మరిన్ని ప్రయోజనాలను అందించడానికి చైనా సిద్ధంగా ఉన్నది. దీని అమలుకోసం కృషి చేయడానికి మైత్రీ సంఘాలు తోడ్పడుతాయి.

చైనా, దక్షిణాసియా దేశాలు పరస్పరం సహకరించుకునే స్నేహపూర్వక పొరుగు దేశాలు, అభివృద్ధి భాగస్వాములు. ఇద్దరం ఉమ్మడి భవిష్యత్తు ఉన్న ఒకే వర్గానికి చెందినవాళ్లం. అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రతిపాదించిన దౌత్యంలో సామరస్యం, చిత్తశుద్ధి, పరస్పర ప్రయో జనం, సమ్మిళిత సూత్రాల ద్వారా పొరుగు దేశాలతో సంబంధాలను నిర్వహించటంలో మార్గనిర్దేశం చేయబడింది.

చైనా, దక్షిణాసియా దేశాలు ఒకరినొకరు సమానంగా గౌరవించు కుంటాయి, ఒకే దిశలో కలిసి పనిచేశాయి, వివిధ రంగాల సహకారంలో ఫలవంతమైన ఫలితాలను సాధించాయి. ఈ తత్వాన్ని నిలబెట్టడానికి, చైనా-దక్షిణాసియా సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాము.

చైనా గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్ లను ఫోరం ప్రశంసిస్తున్నది తన మద్దతు ఇస్తుంది. మేము ప్రజల శక్తిని సమీకరిస్తాము, కమ్యూనికేషన్ రంగాలను విస్తరిస్తా ము, ఈ మూడు కార్యక్రమాల యొక్క దృఢమైన పురోగతిని ప్రోత్సహించడానికి, సహకారా నికి మరిన్ని అవకాశాలకు తలుపులు తెరుస్తాము. మానవాళికి భాగస్వామ్య భవిష్యత్తు గల సమాజాన్ని నిర్మించడానికి కలిసి పనిచేస్తాము.

మెరుగైన ప్రపంచ క్రమాన్ని, అరమరికలు లేని విధానాలను చైనా అలుపెరగకుండా ప్రోత్సహి స్తున్నది. అధిక-నాణ్యత గల అభివృద్ధితో అన్ని రంగాలలో చైనా ఆధునీకరణను ముందుకు తీసుకువెళుతున్నది. చైనా, దక్షిణాసియాలు రెండూ తమ అభివృద్ధి వ్యూహాలలో పరస్పర పరిపూరకమైన ప్రయోజనాల సమన్వయాన్ని కోరుకుంటున్నాయి.

ఇప్పటికే కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, పెట్టుబడుల్లో సంతృప్తికరమైన పురోగతిని సాధించాయి. చైనా, దక్షిణాసియా కలిసి పనిచేయాలని, ఆయా అభివృద్ధి దార్శనికతలను సాకారం చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్నిసృష్టించాలని, ఆధునీకరణ మార్గంలో భాగస్వాములు కావాలని, చైనా, దక్షిణాసియా ప్రజలు సహకార అభివృద్ధి ఫలాలను పంచుకునేలా చూడాలని మేము ఏకగ్రీవంగా విశ్వసిస్తున్నాము.

చైనా, ఆసియాలతోపాటు ఆఫ్రికా దేశాలు నిజమైన బహుళపక్షవాదానికి కట్టుబడి ఉన్నాయి. అంతర్జాతీయ నిష్పాక్షికతను, న్యాయాన్ని కాపాడటంలో ఒక ముఖ్యమైన శక్తిగా పనిచేస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ఉమ్మడిగా పరిరక్షించడానికి,అంతర్జాతీయ న్యాయం మరియు ధర్మాలను కలిసి రక్షించడానికి, అలాగే ఈ ప్రాంతం యొక్క శాశ్వత “శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు” కోసం నిరంతరం కొత్త సహకారాలను పెంపొందించడానికి ప్రభుత్వేతర సంస్థల పాత్రను పూర్తి స్థాయిలో వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాము.

చైనా, దక్షిణాసియా రెండూ గొప్ప, అద్భుతమైన నాగరికతలను కలిగి వున్నాయి. అవి మానవ సమాజం ఆధునికం కావడానికి గణనీయమైన సహకారం అందించాయి. వివిధ రూపాల్లో ప్రజల మధ్య సాంస్కృతిక మార్పిడిని నిర్వహించాలని, బంధాలను పటిష్టం చేయాలని, సంప్రదాయ స్నేహాన్ని పెంపొందించుకోవాలని, చైనా, దక్షిణాసియా ప్రజల మధ్య అవగాహన, సుహృద్భావాన్ని పెంపొందించడానికి ప్రజలు పూర్తి పాత్ర పోషించాలని ఈ సమావేశం విజ్ఞప్తి చేస్తున్నది.”

8వ చైనా దక్షిణాసియా మైత్రీ సంఘాల ఫోరమ్ స్నేహపూర్వక వాతావరణంలో, లోతైన, ఆచరణాత్మక ఆలోచనల కలబోత తో జరిగింది. భారత చైనా మిత్రమండలి తరఫున ఇద్దరు సభ్యుల ప్రతినిధి వర్గం ఈ సమావేశాలలో చురుకుగా పాల్గొన్నది. భారత ప్రభుత్వ వ్యూహా లు, ప్రజల ఆకాంక్షల మధ్య గల అంతరాన్ని వివరించింది.

ఆధిపత్య శక్తులతో కలిసి భారతదేశ ప్రభుత్వం చైనా వ్యతిరేక కూటమిలో చేరుతున్నప్పటికి ప్రజలు చైనాతో స్నేహ సహకారాలు, వాణిజ్యవ్యాపారాలు కోరుకుంటున్నారు, వాటిని ప్రోత్సహిస్తున్నారు, వారు స్నేహ ప్రియులు,శాంతిప్రియులు. సరిహద్దుల సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కోరుతున్నారు. యుద్ద వాతావరణాన్నివ్యతిరేకిస్తున్నారు. అన్ని దక్షిణాసియా దేశాల మధ్య సమన్వయం కమ్యూనికేషన్ ను పెంపొందించాలని భావిస్తున్నారు.

అందువలన స్థానిక ప్రభుత్వాలు, థింక్ ట్యాంక్ లు, మీడియా వంటి వివిధ రంగాలలో మార్పిడి, సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని మేము కోరుతున్నాము. పొరుగు దేశాల మధ్య స్నేహం కోసం ప్రజల మద్దతును నిరంతరం బలోపేతం చేయడానికి ఆయా స్నేహ సంస్థలతో చేతులు కలిపి కృషి చేయాలని భారత చైనా మిత్ర మండలి భావిస్తున్నది. చైనాతో దక్షిణాసియా దేశాలు కలిసి నిలవడాన్ని అభినందిస్తున్నది.

అమెరికా వంటి దేశాల యుద్దవ్యూహాలను అడుగడుగునా వ్యతిరేకిస్తున్న చైనా వైఖరి వల్ల ప్రపంచ బడుగు దేశాలకు చైనా మైత్రి ప్రీతి పాత్రమయ్యింది. ఆదేశాలు చైనాను తమ సహజ మిత్రుని గా, నాయకునిగా భావిస్తున్నాయి. ఈ ఫోరంలో పాల్గొన్న దక్షిణ ఆసియా దేశ ప్రతినిధుల ప్రసంగాలు ఈ సత్యాలను చాటి చెబుతున్నాయి.

భారత ప్రభుత్వం కూడా చైనా తోను, ఇతర ఆసియా దేశాల తోనూ సత్సంబంధాలు, సంపూర్ణ మైత్రి, అన్ని రంగాలలో సహకారం నెలకొల్పుకొవాలని భారత చైనా మిత్ర మండలి భావిస్తు న్నది. ఆసియాలో, ప్రత్యేకించి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో యుద్ద జ్వాలలు రగిలిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద కుట్రలను తిప్పి కొట్టాలన్నా, ఈ ప్రాంతంలో యుద్దంపడగ నీడ పడ కుండా చూడాలన్నా భారత్, చైనా, ఇతర దక్షిణాసియా దేశాలు కలిసి జట్టుగా వ్యవహ రించటం అత్యావశ్యకమని భారత చైనా మిత్ర మండలి ప్రతినిధి బృందం ఫోరం లో విజ్ఞప్తి చేసింది.

ఈ ఫోరంలో చైనా, దక్షిణాసియా దేశాల మధ్య పెరుగుతున్న స్నేహ బంధం ప్రస్పు టంగా కాన వచ్చింది. మైత్రి శ్రేయస్కరం. యుద్దం విధ్వంసకరం. ఆధిపత్యాలు అణచివేతలు లేని జగతి కోసం కృషి చేద్దాం! ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ గీతం పాడుకొందాం !

[ఈ వ్యాస రచయిత భారత చైనా మిత్రమండలి-ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల తరఫున సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి డా.ఎం.మోహన్ రెడ్డి తో కలిసి ఫోరమ్ చైనా సమావేశం లో పాల్గొని వచ్చారు. ఇద్దరూ ఫోరమ్ లో తమ అధ్యయన పత్రాలను సమర్పించారు. ఇందులో వక్తం చేసిన అభిప్రాయాలు వారి సొంతం]

Read More
Next Story