
యూఎస్ఏ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
రష్యాను దెబ్బతీయడానికే భారత్ పై సుంకాలు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై 25 శాతం ప్రతీకార సుంకం విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ముగించేలా ఒత్తిడి చేయడానికి తాము ఈ మార్గం అనుసరించినట్లు చెప్పుకొచ్చారు.
ఈ నెల ప్రారంభంలో అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ట్రంప్ కలిసినప్పటి నుంచి తలెత్తిన తరువాత కొన్ని అవాంతరాలు ఉన్నాయని అయినప్పటికీ రష్యా- ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతికి మధ్యవర్తిగా యుద్ధాన్ని ముగించగలమనే నమ్మకం ట్రంప్ పరిపాలన నమ్మకంగా ఉందని వాన్స్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ పై బాంబు దాడులు ఆపివేస్తే వారిని(రష్యా) ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఆహ్వానించవచ్చని, కానీ దాడులు ఆపకపోతే మాత్రం మాస్కో ఒంటరిగానే ఉంటుందని ట్రంప్ కు రష్యా స్పష్టం చేశారని కూడా ఆయన అన్నారు.
‘‘రష్యా, ఉక్రెయిన్ లో హత్యాకాండను ఆపివేస్తే వారిని తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఆహ్వానించవచ్చని అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ వారు(రష్యా) అలా చేయకపోతే వారు ఒంటరిగానే ఉంటారు’’ అని వాన్స్ హెచ్చరించారు.
అమెరికా దళాలు లేవు..
ఉక్రెయిన్ కు అమెరికా సైన్యాన్ని పంపదని వాన్స్ స్పష్టం చేశారు. అలాంటి మోహరింపుకు ట్రంప్ వ్యతిరేకంగా ఉన్నారు. ‘‘అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఉక్రెయిన్ లో ఎటువంటి దాడి జరగబోదు. కానీ ఉక్రెనియన్లకు భద్రత హమీలు, యుద్ధాన్ని ఆపడానికి అవసరమైన విశ్వాసం ఉండేలా చూసుకోవడంలో మేము చురుకైన పాత్ర పోషిస్తునే ఉంటాము. రష్యన్లు తమ వైపు యుద్ధాన్ని ముగింపుకు తీసుకురాగలరని భావిస్తున్నాను’’ అని వాన్స్ అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు ఖండించిన జైశంకర్..
భారత్ రష్యా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం అనే ట్రంప్ వాదనను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తోసిపుచ్చిన కొన్ని రోజుల తరువాత వాన్స్ ఈ వ్యాఖ్య చేశారు. ఆ ప్రత్యేకత చైనాకే చెందుతుందని ఆయన అన్నారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి రష్యా చమురును కొనుగోలు చేయాలని భారత్ ను కోరింది అమెరికాయే అని జైశంకర్ చెప్పారు.
భారత్ నుంచి ముడి చమురు లేదా శుద్ది చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ఎవరికైనా సమస్య ఉంటే వారు వాటిని కొనడం మానేయాలని ట్రంప్ పరిపాలనకు స్పష్టమైన సందేశం పంపాలని కూడా ఆయన స్పష్టం చేశారు.
Next Story