ఇజ్రేల్ దెబ్బ: రెండుగా విడిపోతున్న పశ్చిమాసియా ముస్లిం దేశాలు...
x

ఇజ్రేల్ దెబ్బ: రెండుగా విడిపోతున్న పశ్చిమాసియా ముస్లిం దేశాలు...

ఇజ్రాయెల్- హమాస్ పోరుకు 100 రోజులు పూర్తయ్యాయి. హమాస్ ను తుదముట్టించే వరకూ పోరు ఆపమని టెల్ అవీవ్ చేసిన ప్రతిజ్ఞ, పశ్చిమాసియా రెండు ముక్కలుగా ఉందని రుజువు చేసింది.


తన ప్రయోజనాలే పరమావధిగా భావించే అమెరికా, దాని అనుంగు మిత్రదేశం ఇజ్రాయెల్ పశ్చిమాసియా దేశాలను విడగొట్టి తమ పబ్బం గడుపుకోవడంలో విజయం సాధించాయి. యుద్దం ప్రారంభంలో కొన్ని ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ ను వ్యతిరేకించిన, యుద్ధం ముగిసిన తరువాత యూదు దేశంతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడానికి అవి సిద్దంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇజ్రాయెల్ పై గత ఏడాది అక్టోబర్ 7 జరిగిన పైశాచిక దాడి అనంతరం ప్రపంచంలోని చాలా దేశాలు యూదు దేశంపై సానూభూతి చూపెట్టాయి. అయితే తరువాత టెల్ అవీవ్ గాజాపై చేస్తున్న మారణకాండ వల్ల దానిపై మెల్లగా వ్యతిరేకత ప్రారంభం అయింది. ఇజ్రాయెల దాడుల వల్ల ఇప్పటి వరకూ దాదాపు 23000 వేల మంది పాలస్తీనా వాసులు మృత్యుముఖంలోకి చేరుకున్నారు. అయినప్పటీకీ చాలా అరబ్ ముస్లిందేశాలు తమ చర్యలు మాటల వరకే పరిమితం చేశాయి.

మొదట అరబ్ దేశాలన్నీ పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించాయి. స్వత్రంత్ర్య పాలస్తీనా ఏర్పాటు చేయాలని మూకుమ్మడిగ తీర్మానించాయి. నాలుగు యుద్దాలు సైతం చేశాయి. అయితే 1973 తరువాత పరిస్థితులన్నీ కూడా క్రమంగా మారిపోయాయి. మొదట ఇజ్రాయెల్ తో ఈజిప్ట్ బంధం ప్రారంభం అయింది. 1994లో జోర్డాన్, ఇజ్రాయెల్ తో స్నేహం మొదలుపెట్టింది. క్రమంగా యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, టర్కీ లు దానితో స్నేహం చేశాయి. ప్రస్తుతం సౌదీ అరేబియా దానికి అనుంగు మిత్రదేశం. రియాద్- టెల్ అవీవ్ మధ్య కుదరాల్సిన ఒప్పందం ప్రస్తుతం జరుగుతున్న యుద్దం వల్ల కాస్త పక్కన పడింది. అయినప్పటీకీ అవి రెండు కూడా ఎప్పటి నుంచో మిత్రత్వం చేయడానికి తహతహ లాడుతున్నాయి.

పశ్చిమాసియాలో అమెరికా అతి పెద్ద సైనిక స్థావరాలు ఖతార్ లో ఉన్నాయి. దాని ప్రోద్భలంతోనే ఖతార్- ఇజ్రాయెల్ తో శాంతి చర్చలు జరపడానికి ఒప్పుకుంది. ఖతార్ పాలకులకు ఇటూ హమాస్ తోను మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరు పక్షాలను దారికి తేవడంలో ఖతార్ ఓ మోస్తారు విజయం సాధించింది. అయితే ఖతార్ మిగిలిన ఇస్లామిక్ దేశాలతో పోలిస్తే ఇజ్రాయెల్ తో అతి తక్కువ వ్యూహాత్మక సంబంధాలను నెరిపింది.

ఇరాన్ వ్యతిరేకించింది.

ఇజ్రాయెల్, అరబ్బు ప్రాంతంలో ఉండడానికి వీలలేదని ఇరాన్ వాంఛ. 1979 లో ఇరాన్ విప్లవం తరువాత వచ్చిన పాలకులు ఈ విధానాన్ని బలంగా అవలంభించడం ప్రారంభించారు. పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్న హమాస్, లెబనాన్ నుంచి దాడులు చేస్తున్న హెజ్బుల్లా, ప్రస్తుతం ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న హౌతీలు మొదలైన తీవ్రవాద గ్రూపులకు ఇరాన్ మద్దతు ఉందనేది బహిరంగ రహస్యం.

ఏవిధంగా నైనా ఇజ్రాయెల్- హమాస్ పోరును ఆపాలని టెహ్రన్ వాంఛిస్తోంది. అందుకే ఓ వైపు హెజ్బుల్లా, మరోవైపు హౌతీ ల నుంచి దాడులు చేయిస్తోంది. మరోవైపు ఈ మధ్య దివంగత జనరల్ ఖాసీం సులేమని వర్థంతి సందర్భంగా ఇరాన్ లో బాంబు దాడి జరిగి 84 మంది చనిపోయారు. దీనిపై మొదట ఇజ్రాయెల్ అని ఇరాన్ ఆరోపించగా, తరువాత ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది. ఇవన్నీ ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

సున్నీ దేశాలన్నీ అమెరికా, ఇజ్రాయెల్ వైపు నిలవగా, షియా దేశాలు వారికి వ్యతిరేకంగా ఉన్నాయి. షియా- సున్నీ దేశాల మధ్య వైరాన్ని ఈ రెండు దేశాలు తమకు అనుకూలంగా మార్చుకుని ఓ బలమైన అడ్డుగోడను నిర్మించాయి.

ఇరాన్ - పాకిస్తాన్ వివాదం

తమ పై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ నుంచి వచ్చాయని అనుమానించిన ఇరాన్, కొద్ది రోజుల క్రితం దాడులకు పాల్పడింది. అయితే దీనిని పాకిస్తాన్ ఖండించింది. తమ దేశం సార్వభౌమత్వం ఉల్లంఘించారని మండిపడింది. ఆ తరువాత పాకిస్తాన్ వైమానిక దళం కూడా ఇరాన్ ఆధీనంలో ఉన్న సీస్థాన్- బెలూచిస్తాన్ పై దాడి చేసింది. బెలూచ్ ఉగ్ర సంస్థ క్యాంపులే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు ప్రకటించింది.

పాకిస్తాన్ మొదట నుంచి అమెరికా ఆధిపత్యంలో ఉంది. ఇరాన్ పై దాడికి దాని పాత్ర ఎంత ఉంది అనేది ప్రస్తుతానికి ఏం తేలలేదు. అయితే పాకిస్తాన్ కు ప్రతిదాడి చేయడం తప్పా వేరే దారి లేదు. మరోవైపు రెండు దేశాలు కూడా చైనా కు చాలా దగ్గిర స్నేహితులు. ఇక్కడ చెప్పవలసిన మరో విషయం ఏంటంటే.. ఇరాన్ షియాలకు ప్రతినిధి దేశంగా ముద్రపడింది. పాక్, సున్నీ ముస్లిం దేశం. తమ దేశంలోని షియా లలో ప్రాబల్యం పెంచుకోవడానికే ఇరాన్ ఇలా దాడులకు తెగబడిందనేది పాక్ వాదన. ఇదీ మున్ముందు ఏ విపత్తులకు దారి తీస్తుందో అని ప్రపంచం హడలిపోతోంది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు సజావుగా లేవు. ఓవైపు అంతర్జాతీయ వాణిజ్యం జరగకుండా హౌతీల దాడులు, వాటిపై అమెరికా, మిత్ర పక్షాల దాడులు, భవిష్యత్ లో యుద్దం మరింత విస్తరించేలా కనిపిస్తోంది. వీటన్నింటికి ఏకైక పరిష్కారం.. ఇజ్రాయెల్, గాజాలో హింసను ఆపడం. అలా అయితేనే ఇవన్నీ ఓ కొలిక్కి వస్తాయి.

Read More
Next Story