నేపాల్‌లో ఇదే తొలి జంట..
తమ పెళ్లికి అనుమతించాలని కోర్టు తలుపు తట్టారు. అందుకు ‘నో’ చెప్పింది న్యాయస్థానం. నేపాల్ సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆ జంటకు మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ అయ్యింది
‘సుప్రీం’ జోక్యంతో..
నేపాల్ (Nepal) అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ఐదు నెలలకు.. అక్కడి అధికారులు ఓ జంటకు వివాహ ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేశారు. దీంతో నేపాల్‌లో ‘సేమ్ సెక్స్ మ్యారేజ్ స్టేటస్’ను పొందిన తొలిజంటగా గుర్తింపు పొందారు. ఆసియాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన ఏకైక దేశం తైవాన్. సౌత్ ఏసియాలో అయితే నేపాల్ ఒక్కటే.
ఒక్కటైన జంట..
ట్రాన్స్-ఉమెన్ మాయా గురుంగ్ వయసు 35. సురేంద్ర పాండేకు 27 ఏళ్లు. ఇతను గే. పశ్చిమ నేపాల్‌లోని లామ్‌జంగ్ జిల్లాలో వీరి వివాహం నమోదైంది. వాస్తవానికి వీరు ఆరేళ్ల క్రితం గుడిలో సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు తొమ్మిదేళ్లు కలిసి ఉన్నారు. కాని చట్టబద్దంగా వీరి పెళ్లికి గుర్తింపు లభించలేదు.
ఎట్టకేలకు చేతికందిన సర్టిఫికెట్..
2007లో స్వలింగ సంపర్కుల వివాహానికి (Same sex marriage) నేపాల్ సుప్రీంకోర్టు (Supreme court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అందుకు అవసరమైన చట్టాలు లేవంటూ.. ఖాట్మండు(Kathmandu) జిల్లా కోర్టు సేమ్ సెక్స్ మ్యారేజస్‌కు నో చెప్పింది. సురేంద్ర పాండే, మాయల వివాహ దరఖాస్తును తిరస్కరించింది. జూన్ 27, 2023న గురుంగ్‌తో సహా పలువురు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌తో నేపాల్‌లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా పశ్చిమ నేపాల్ లుమ్‌జంగ్ జిల్లా డోర్డి మునిసిపల్ అధికారులు మాయా గురుంగ్, సురేంద్ర పాండేల వివాహాన్ని అధికారికంగా నమోదు చేశారు.‘‘సుప్రీం కోర్ట్ ఆర్డర్, ప్రభుత్వ అధికారుల సూచనను పరిగణనలోకి తీసుకుని మేం ఈ జంటకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (Marriage certificate) జారీ చేశాం’’ అని మునిసిపాలిటీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హేమ్ రాజ్ కాఫ్లే తెలిపారు.
‘‘మా వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మా ఆనందాన్ని కుటుంబసభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం’’ అని మాయ చెప్పింది.
నేపాల్‌లోని స్వలింగ సంపర్కుల హక్కుల సంస్థ ‘బ్లూ డైమండ్ సొసైటీ’ వ్యవస్థాపకుడు సునీల్ బాబు పంత్ మాయా, పాండేల వివాహం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చాలా మంది థర్డ్-జెండర్ జంటలు తమకు గుర్తింపు, హక్కులు లేకుండా జీవిస్తున్నాయి. వారికి గుర్తింపుతో పాటు సమాన హక్కులు కల్పించడం శుభపరిణామన్నారు.