రిజర్వేషన్ లపై బంగ్లా సుప్రీంకోర్టు తీర్పు.. ఏం చెప్పిందంటే..
x

రిజర్వేషన్ లపై బంగ్లా సుప్రీంకోర్టు తీర్పు.. ఏం చెప్పిందంటే..

వారం నుంచి బంగ్లాదేశ్ అంతటా మెరిట్ ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు..


కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ విషయంలో హింసాత్మక ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్ విధానాన్ని హైకోర్టు సమర్థించడంతో విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులంతా ఆందోళన బాట పట్టారు. అయితే తాజాగా ఆ దేశ సుప్రీంకోర్టు రిజర్వేషన్ కోటాలో భారీ స్థాయిలో కోత విధించింది.

బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలలో మెరిట్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆ దేశ యువత చాలాకాలంలో కోరుతోంది. ప్రస్తుతం బంగ్లాలో ఆ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన వారి కుటుంబాలనకు 30 శాతం కోటా ఇస్తున్నారు. దీనిని 2018 లో నిరసనల కారణంగా నిలిపివేశారు. అయితే ఈ నిర్ణయంపై సదరు వర్గం హైకోర్టుకు వెళ్లగా దానిని కోర్టు తిరిగి పున: రుద్దరించింది.
తాజాగా సుప్రీంకోర్టు అప్పీల్‌పై తీర్పునిస్తూ, అనుభవజ్ఞుల కోటాను 5 శాతానికి తగ్గించాలని, 93 శాతం ఉద్యోగాలను మెరిట్ ఆధారంగా కేటాయించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మిగిలిన 2 శాతం మైనారిటీలు, ట్రాన్స్‌జెండర్లు వికలాంగుల కోసం కేటాయించాలని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత నిరసన తెలిపిన విద్యార్థులను తిరిగి తరగతులకు హాజరుకావాలని ప్రభుత్వం కోరింది.
సవాలు
ప్రధాన ప్రతిపక్ష గ్రూపులు బహిష్కరించిన జనవరి ఎన్నికలలో ప్రధాని షేక్ హసీనా వరుసగా నాలుగోసారి గెలిచినప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఈ నిరసనలు అత్యంత తీవ్రమైన సవాలుగా మారాయి. ఈ ఉద్యమంతో యూనివర్శిటీలు రణరంగంగా మారాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో విద్యాసంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి. అలాగే ఇంటర్నెట్, టెలి కమ్యూనికేషన్ సేవలపై ఆంక్షలు విధించారు. ప్రజలు ఇంటి నుంచి బయటకురావద్దని ప్రభుత్వం ఆదేశించింది.
ఢాకా యూనివర్శిటీలో విద్యార్థులు పోలీసులతో ఘర్షణకు దిగిన ఒక రోజు తర్వాత నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాళ్లు రువ్వుతున్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించడంతో పాటు స్మోక్ గ్రెనేడ్‌లు ప్రయోగించడంతో హింస తీవ్రరూపం దాల్చింది. బంగ్లాదేశ్ అధికారులు మరణించిన, గాయపడిన వారి సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు కానీ స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి సంఖ్య దాదాపుగా 103 వరకూ ఉంటుందని ఓ అంచనా.
చెదురుమదురు గొడవలు
శనివారం కూడా రాజధాని ఢాకాలో విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే ఇక్కడ ఏమైన మరణాలు సంభవించాయో లేదో ఇంకా వివరాలు బయటకు రాలేదు.
సుప్రీంకోర్టు విచారణకు ముందు, సైనికులు దక్షిణాసియా దేశంలోని నగరాల్లో గస్తీ నిర్వహించారు. ప్రజలు అవసరమైన పనుల కోసం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్టే ఎట్ హోమ్ ఆర్డర్‌ను సడలించనున్నట్లు హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ తెలిపారు. ఇదిలావుండగా, ప్రభుత్వం ఆది, సోమవారాలను ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించింది, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉందని పేర్కొంది.
'కోటా వ్యవస్థలో వివక్ష'
కోటా విధానం వివక్షతో కూడుకున్నదని, స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన అవామీ లీగ్ పార్టీ హసీనా మద్దతుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని స్థానంలో మెరిట్ ఆధారిత వ్యవస్థను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. హసీనా కోటా వ్యవస్థను సమర్థించారు, వారి రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా, పాకిస్తాన్‌పై యుద్ధంలో వారు చేసిన కృషికి అనుభవజ్ఞులు అత్యున్నత గౌరవం పొందాలని పేర్కొన్నారు.
ఈ వివాదంపై ఇరు వర్గాల ప్రతినిధులు శుక్రవారం సమావేశమై ఒక తీర్మానం చేసేందుకు ప్రయత్నించారు. అలాగే నిరసనకారుల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని న్యాయ మంత్రి అనిసుల్ హుక్ తెలిపారు. వారి డిమాండ్లలో ప్రస్తుత కోటా వ్యవస్థ సంస్కరణ, ఘర్షణల తరువాత పోలీసులు మూసివేసిన విద్యార్థుల వసతి గృహాలను తిరిగి తెరవడం, క్యాంపస్‌లను రక్షించడంలో విఫలమైన కొంతమంది విశ్వవిద్యాలయ అధికారులు పదవీవిరమణ చేయడం వంటివి ఉన్నాయి.
ప్రతిపక్షాల మద్దతు
ఈ ఉద్యమానికి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నిరసనలకు మద్దతు ఇచ్చింది, దాని మద్దతుదారులు చాలా మంది విద్యార్థుల నేతృత్వంలోని నిరసనలలో పాల్గొన్నారు. అలాగే తమ పార్టీ కూడా సొంతంగా నిరసనలు చేస్తుందని బీఎన్పీ ప్రకటించింది. అయితే దేశంలో సంభవించిన హింసాత్మక నిరసనలకు తమ పార్టీ కార్యకర్తలు కారణం కాదని వెల్లడించింది.
అధికార అవామీ లీగ్, BNP తరచుగా రాజకీయ గందరగోళం, హింసకు ఆజ్యం పోస్తున్నాయని పరస్పరం ఆరోపించుకున్నాయి, ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికలకు ముందు,ఇరు పార్టీలు వీధిపోరాటాలకు దిగాయి. తమను అవామీ లీగ్ అణచివేస్తోందని ప్రతిపక్ష బీఎన్పీ ఆరోపిస్తోంది. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థకు బీఎన్పీ ఆటంకాలు కలిగిస్తోందని అవామీ లీగ్ వాదనగా ఉంది.
Read More
Next Story