
సంవత్సరంలో వచ్చే కాలుష్యాన్ని రెండు వారాల్లో తీసుకొచ్చిన యుద్ధం
పశ్చిమాసియా సంక్షోభంతో పర్యావరణానికి తీవ్రహాని, ఇప్పటికే విడుదల అయిన 5 మిలియన్ టన్నుల ఉద్గారాలు
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందా? లక్షలాది టన్నుల ఉద్గారాలతో పాటు కార్బన్ మోనాక్సైడ్ విపరీతంగా ఉత్పత్తి అవుతుందా అంటే అవుననే అంటున్నాయి స్వతంత్య్ర వాతావరణ పరిశోధన సంస్థలు. ఇవి భవిష్యత్ దీర్ఘకాలిక ప్రభావాలను చూపించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. క్లైమేట్ అండ్ కమ్యూనిటీ ఇన్‌స్టిట్యూట్ చేసిన ఒక వాతావరణ విశ్లేషణను 'ది గార్డియన్' ప్రత్యేకంగా ప్రచురించింది.
ఈ విశ్లేషణ ప్రకారం ఈ యుద్ధం ప్రారంభమైన మొదటి 14 రోజుల్లోనే ఐదు మిలియన్ టన్నుల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను విడుదల అయినట్లు పేర్కొంది. ఇది ప్రపంచంలోని అత్యల్ప ఉద్గారాలు వెలువరించే 84 దేశాలతో సమానంగా ఉంది. ఘనాలోని యూనివర్శిటీ ఆఫ్ ఎనర్జీ అండ్ నేచురల్ రిసోర్సెస్‌కు చెందిన ఫ్రెడ్ ఒటు-లార్బీ నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనానికి, ఆ సంస్థ పరిశోధనా సంచాలకుడైన పాట్రిక్ బిగ్గర్ సహ రచయితగా అన్నారు.
భవనాల వల్లే అత్యధిక కార్భన్..
పౌర మౌలిక సదుపాయాల విధ్వంసమే ఉద్గారాలకు అతిపెద్ద మూలం. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల సుమారు 20,000 భవనాలు దెబ్బతిన్నాయని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ నివేదించింది. ఈ దాడుల వల్ల దాదాపు 24 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ (tCO2e) ఉద్గారాలు వెలువడ్డాయని, దీంతో ఇరాన్‌లోని చాలా ప్రాంతాలు పరిశోధకులు వర్ణించినట్లుగా పర్యావరణ దుర్భర క్షేత్రంగా మారాయని విశ్లేషణ అంచనా వేసింది.
బాంబర్లు, నౌకాదళాలు..
సైనిక కార్యకలాపాల వల్ల మరింత కర్భన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. మొదటి రెండు వారాల్లో విమానాలు, నౌకాదళ నౌకలు, భూతల వాహనాలు 15 కోట్ల నుంచి 27 కోట్ల లీటర్ల ఇంధనాన్ని వినియోగించాయని, దీనివల్ల 5.29 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ (tCO2e) ఉత్పత్తి అయిందని విశ్లేషణ అంచనా వేసింది. పశ్చిమ ఇంగ్లాండ్ వంటి సుదూర ప్రాంతాల నుంచి దాడులు చేసిన అమెరికా భారీ బాంబర్లు దీనికి ప్రధానంగా కారణమయ్యాయని తెలిసింది.
లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీకి చెందిన బెంజమిన్ నీమార్క్ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ, అమెరికా నౌకాదళం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసిందని అన్నారు. "అమెరికా సైనికుల సంఖ్య గణనీయంగా ఉంది, వారికి ఆహారం, వసతి కల్పించాలి. వారు నిరంతరం పనిచేయాలి. ఈ తేలియాడే నగరాలన్నింటికీ(విమాన వాహక నౌకలు) శక్తి అవసరం," అని ఆయన అన్నారు.
ఇంధన డిపోలపై దాడులు కూడా..
ఇజ్రాయెల్ ప్రధాన ఇంధన నిల్వ డిపోలపై బాంబు దాడి చేసిన తర్వాత టెహ్రాన్‌పై కమ్ముకున్న నల్లటి మేఘాలు, ఆమ్ల వర్షం ఈ యుద్ధంలోని అత్యంత ఆందోళనకరమైన దృశ్యాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఇది లక్షలాది మందిని విషపూరిత కాలుష్యానికి గురిచేసింది.
తనపై దాడులకు నిరసనగా ఇరాన్ కూడా గల్ఫ్ లోని ఇతర దేశాల ఇంధన డిపోలు, గ్యాస్ క్షేత్రాలపై దాడులకు తెగబడటంతో 25 లక్షల నుంచి 59 లక్షల బ్యారెళ్ల చమురు మంటల్లో కాలిపోయిందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల 18.8 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ (tCO2e) విడుదలయ్యింది.
సైనిక పరికరాలే లక్ష్యంగా జరిగిన దాడులతో మరిన్ని ఉద్గారాలు వెలువడ్డాయి. అమెరికా నాలుగు విమానాలను, ఇరాన్ 28 విమానాలను, 21 నౌకాదళ నౌకలను, సుమారు 300 క్షిపణి ప్రయోగ వాహనాలను కోల్పోయింది. ఇవి 1,72,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్‌కు (tCO2e) దోహదపడ్డాయి. అన్ని పక్షాలు ఉపయోగించిన క్షిపణులు, డ్రోన్‌ల వల్ల అదనంగా 55,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ (tCO2e) విడుదలయ్యింది.
కువైట్ వార్షిక ఉత్పత్తికి సమానమైన..
మొదటి రెండు వారాల్లో 5,055,016 కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు విడుదలయ్యాయి. ఇది దాదాపుగా కువైట్ వార్షిక ఉద్గారాలకు లేదా ప్రపంచంలోని అత్యల్ప ఉద్గారాలు వెలువరించే 84 దేశాల సంయుక్త వార్షిక ఉత్పత్తికి సమానం. ఈ గణాంకాలు మరింత దిగజారుతాయని ఒటు-లార్బీ హెచ్చరించారు.
"సాయుధ ఘర్షణ కొనసాగుతున్న కొద్దీ ఉద్గారాలు వేగంగా పెరుగుతాయని మేము భావిస్తున్నాము, ప్రధానంగా చమురు సౌకర్యాలను ఆందోళనకరమైన స్థాయిలో దాడులు జరుగుతున్నందు వల్లే ఇలా అయింది," అని ఆయన 'ది గార్డియన్' పత్రికకు తెలిపారు.
భూగోళం మండుతున్న పట్టదా?
ఈ యుద్ధాల వల్ల పుడమి తల్లికి ఎలాంటి లాభం ఉండదని బిగ్గర్ అభిప్రాయపడ్డారు. "ప్రతి క్షిపణి దాడి వేడెక్కుతున్న, మరింత అస్థిరమైన గ్రహంపై మరో ముందస్తు సంక్షోభం లాంటిది. ఇవేవీ భూమిని సురక్షితంగా ఉంచవు. ప్రతి రిఫైనరీ అగ్నిప్రమాదం, ట్యాంకర్ దాడి, శిలాజ ఇంధన ఆధారిత భౌగోళిక రాజకీయాలు నివాసయోగ్యమైన వాతావారణానికి విరుద్ధమని గుర్తుచేస్తాయి," అని ఆయన అన్నారు.
శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం, 2024 మధ్య నాటికి, భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచడానికి 50 శాతం అవకాశం ఉన్నప్పటికీ, మానవాళి సుమారుగా 130 బిలియన్ టన్నుల CO2ను విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత రేటు ప్రకారం ఈ బడ్జెట్ 2028 నాటికి అయిపోతుంది. మరోవైపు, 'వన్ ఎర్త్' జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధం విడిగా అంచనా ప్రకారం 33 మిలియన్ టన్నుల CO2e ను ఉత్పత్తి చేసింది.
Next Story

