ఎంతకూ లొంగని బుల్లి గాజా, ఇజ్రాయెల్ అంచనా తలకిందులు!
ఇజ్రాయిల్ దాడులకు గాజా వశం కావడం లేదు, సరికదా, అక్కడ యుద్ధం చేస్తున్న గోలాని బ్రిగేడ్ యూనిట్లను ఉపసంహిరించుకుంటున్నట్లు వార్తలు, ఇంతకీ ఎం జరుగుతోంది?
(ఇఫ్టూ ప్రసాద్)
బుల్లి గాజాపై అణ్వస్త్ర ప్రాంతీయ అగ్రరాజ్యం ఇజ్రాయెల్ జాతి హనన యుద్ధం 77వ రోజుకు చేరింది. భూతల యుద్ధం కూడా దాదాపు రెండు నెలలకు చేరనుంది. గత రాత్రి కీలక పరిణామం జరిగింది. ఇజ్రాయెల్ సైన్యంలో అత్యంత కీలక విభాగం గత అర్ధరాత్రి నుండి హఠాత్తుగా గాజా నుండి ఉపసంహరణ ప్రారంభమైనది.
ఈ సైనిక విభాగం పేరు "గోలాని యూనిట్". దాని మీద యుద్ధనేరాల ఆరోపణలు కూడా ఉన్నాయి. సైనిక దాడుల సందర్భాల్లో ఊచకోత సాగించిన దుష్ట చరిత్ర మూటకట్టుకుంది. 1948 నక్బా పాపంలో ఈ గోలాని బ్రిగేడ్ (Golani Brigade) ప్రధాన భాగస్వామిగా ఉంది.
నేటి గాజా పిల్లల మరణాల పాపంలో సైతం దీని వాటా ఉంది. అది గత అర్ధరాత్రి గాజా నుండి తిరుగుమొఖం పట్టింది. రాత్రి ఒంటిగంట తర్వాత నేతన్యాహు సర్కారు గ్రీన్ సిగ్నల్ తో వెనక్కి రాసాగింది.
ఈ తెల్లవారు జాము నుండి ఇజ్రాయెల్ ప్రచార మాధ్యమాలు కూడా ధృవీకరించాయి.
గాజాలో ప్రతి ఇల్లూ ఓ ప్రతిఘటనా కేంద్రంగా మారింది. ఏ సందులో నుండి ఏ గల్లీ లో నుండి ఏ శిథిల కొంపల్లో నుండి గ్రెనేడ్స్ వస్తున్నాయో ఇజ్రాయెల్ మిలిటరీకి అర్ధం కావడం లేదు. ఆ సైనికవిభాగం మానసిక స్థైర్యం కోల్పోతున్నట్లు గత వారం రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
పై నేపథ్యంలో సైన్యం వత్తిడి వల్లనే నేతన్యాహు సర్కార్ మీద యుద్ధ విరమణకు వత్తిళ్ళు వస్తున్నట్లు వారం రోజుల నుంచి వదంతులు వినిపిస్తున్నాయి. రక్షణ మంత్రి కాల్పుల విరమణ ప్రతిపాదన 18వ తేదీ చేయడం వెనక ఇదొక కారణంగా కూడా వార్తలు గత మూడు రోజుల నుంచి వినిపిస్తున్నాయి.
హమాస్ రెండు షరతులు విధించింది. ఇక ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో స్వచ్చందంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని ఉంటుంది.
స్టాలిన్ గ్రాడ్, లెనిన్ గ్రాడ్ పట్టణ (అర్బన్) గెరిల్లా పోరాటాలు ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేనివి. వాటిని నమూనాగా తీసుకొని గ్రామీణ విముక్తి పూర్తి అయ్యే క్రమంలో తుది దశలో వియత్నాం గెరిల్లా పోరాటం కూడా సైగాన్, హనోయ్ వంటి నగరాల్లో అర్బన్ గెరిల్లా పోరాటం చరిత్ర సృష్టించింది.
ఇరాక్ లో బాగ్దాద్, ఫలూజా, బాకుబా, రమాది, తిక్రిట్ తదితర నగరాలు, పట్టణాల్లో అమెరికా సైన్యాల్ని గెరిల్లా పోరాట శక్తులు ముప్పుతిప్పలు పెట్టాయి. లెబనాన్ కి 2006 లో ఇజ్రాయెల్ సైన్యాలు భూతల యుద్ధానికి వెళ్లి చావు దెబ్బ తిన్నాయి. నేడు గాజా కూడా ఇజ్రాయెల్ కి శ్మశాన వాటికగా మారే పరిస్థితి ఏర్పడింది.
నిన్న హమాస్ ప్రతినిధి ఇంటర్వ్యూ ప్రకారం ఇంతవరకూ 720 ఇజ్రాయెల్ సైనిక వాహనాలను తమ గెరిల్లా సాయుధ బలగాలు ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ సైనికుల మరణాల సంఖ్యను నేతన్యాహు సర్కార్ తగ్గించి చెబుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇవ్వన్నీ బయటకు చెప్పకుండా మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తే ప్రదర్శించవచ్చు. కానీ యుద్ధం చేసే సైనికుల ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే దాచిపెట్టి ఉంచడం సాధ్యం కాదు కదా!
ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా పలాయనం చిత్తగించినట్లు అమెరికా శిష్యురాలు ఇజ్రాయెల్ కి కూడా తప్పదేమో! బుల్లి గాజా సైతం అణ్వస్త్ర రాజ్యానికి గుణపాఠం చెబుతుందా? చరిత్రను గాజా పునరావృతం చేస్తుందా? వేచి చూద్దాం.
(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు. ఫెడరల్ తెలంగాణ కు సంబంధం లేదు)