
రైలు హైజాక్: 155 మందిని రక్షించిన సైన్యం
27 మంది తిరుగుబాటుదారుల మృతి, ఖండించిన బలూచ్ ఆర్మీ
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో సైనికులు, ప్రయాణీకులతో వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బీఎల్ఏ తిరుగుబాటుదారులు హైజాక్ చేసిన తరువాత పాకిస్తాన్ భద్రతా దళాలు ఆపరేషన్ ను ప్రారంభించాయి.
ఈ దాడుల్లో కనీసం 27 మంది ఉగ్రవాదులు మరణించారని, 150 మందికి పైగా ప్రయాణీకులను రక్షించామని సైన్యం ప్రకటించింది. అయితే కొంతమంది బందీలను చీకట్లో తిరుగుబాటుదారులు కొండల్లోని తీసుకెళ్లారు. వారిని రక్షించారో లేదో అన్న విషయం తెలియరాలేదు.
రాత్రంతా కాల్పులు..
తిరుగుబాటుదారులతో జరిగిన కాల్పుల తరువాత 155 మంది బందీలను రక్షించినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. ఇందులో డజన్ల కొద్ది మహిళలు, పిల్లలు ఉన్నారు. వారిని బలూచిస్తాన్ లోని కాచ్చి జిల్లాలోని మాచ్ అనే పట్టణానికి తీసుకెళ్లారు. అక్కడ తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.
ఖండించిన బలూచ్..
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటుదారులకు, పాకిస్తాన్ దళాలకు మధ్య కాల్పులు రాత్రిపూట కొనసాగాయాని బీఎల్ఏ ప్రకటించింది. తమ పోరాట యోధులు 30 మంది పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టాయని, బీఎల్ఏ వీరులు క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. అయితే ఇస్లామాబాద్ దీనిని ధృవీకరించలేదు.
చిన్న చిన్న గ్రూపులుగా బలూచ్ లు..
‘‘చీకటిలో తప్పించుకోవడానికి తిరుగుబాటుదారులు చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయాయని, కానీ రైలు ఉన్న సొరంగాన్ని తాము చుట్టుముట్టామని మిగిలిన ప్రయాణీకులను త్వరలో రక్షిస్తాము’’ అని అధికార వర్గాలు తెలిపాయి.
రైలు ఉన్న సొరంగం ప్రాంతంలో ఉన్న జిల్లా పోలీస్ అధికారి రాణా ముహ్మద్ దిలావర్ మాట్లాడుతూ.. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, అయితే ఉగ్రవాదులు, కొంతమంది మహిళలు, పిల్లలను బందీలుగా తీసుకున్నట్లు తెలిసిందన్నారు. రైలులో ఐదుగురు ప్రభుత్వ అధికారులు ఉన్నారని ఆయన తెలిపారు.
కొనసాగుతున్న ఆపరేషన్..
బలూచ్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ మాట్లాడుతూ.. భద్రతా దళాలు ముందుగా 80 మంది ప్రయాణికులను రక్షించగలిగాయి. వారిలో 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు.
సొరంగంలో ఆగిన రైలు..
తొమ్మిది బోగీలలో దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ మంగళవారం మధ్యాహ్నం క్వెట్టా నుంచి పెషావర్ కు వెళ్తోంది. గుడాలర్ - పిరు కున్రి పర్వత ప్రాంతాల సమీపంలోని సొరంగంలో సాయుధ వ్యక్తులు దానిని అడ్డగించారు. ఈ దాడికి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత వహించింది.
అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వనప్పటికీ రైల్వే అధికారులు సొరంగంలో రైలు ఆగి ఉందని, కఠిన ప్రాంతంలోకి భద్రతా దళాలు చేరుకున్నాయని రిండ్ చెప్పారు.
పెషావర్, క్వెట్టాలో సహయక డెస్క్ లు
బలూచ్ తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేసిన తరువాత సొరంగం దగ్గర తీవ్ర కాల్పులు, పేలుళ్లు సంభవించినట్లు పాకిస్తాన్ మీడియా వార్తలు ప్రసారం చేసింది. పెషావర్ వెళ్తున్న ప్యాసింజర్ రైలుపై తీవ్రమైన కాల్పులు జరిగాయని నివేదికల మధ్య తాము సహాయక బృందాలను పంపినట్లు రిండ్ చెప్పారు.
పెషావర్- క్వెట్టా రైల్వే స్టేషన్ లో పాకిస్తాన్ రైల్వేలు అత్యవసర డెస్క్ లను ఏర్పాటు చేశాయి. దాడి గురించి సమాచారం కోసం బంధువులు, స్నేహితులు రైల్వే స్టేషన్ కు వస్తున్నారు.
పాకిస్తాన్ రైల్వేలు క్వెట్టా నుంచి పెషావర్ కు సేవలు నిలిపివేసిన నెలన్నర తరువాత తిరిగి కొత్తగా ప్రారంభం అయిన తరువాత వెంటనే బలూచ్ రెబెల్స్ దాడులు చేశాయి.
నాలుగు నెలల్లో రెండో అతిపెద్ద దాడి..
గత ఏడాది నవంబర్ లో క్వెట్టా రైల్వే స్టేషన్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 26 మంది మృతి చెందారు. 62 మంది గాయపడ్డారు. ఆ తరువాత రైలు సేవలు నిలిచిపోయాయి.
పెషావర్ రైల్వే స్టేషన్ సీనియర్ అధికారి తారీఖ్ మహమూద్ మాట్లాడుతూ..సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు పట్టించుకోవద్దని కోరారు.
Next Story