ట్రంప్- పుతిన్ మధ్య ‘బుడాపెస్ట్’ చర్చలు రద్దు
x
యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

ట్రంప్- పుతిన్ మధ్య ‘బుడాపెస్ట్’ చర్చలు రద్దు

వృథా చర్చలు ఎందుకని వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు


అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగాల్సిన బుడాపెస్ట్ చర్చలు రద్దయ్యాయి. రష్యాతో సమయం వృథా చేసే చర్చలు వద్దని ట్రంప్ అన్నారు.

హంగేరీ రాజధాని అయిన బుడాపెస్ట్ లో జరగాల్సిన సమావేశం వాయిదా వేయాలని గతవారం ట్రంప్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రకటనపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్ రోవ్ మధ్య చర్చలు జరిగాయి. అనంతరం అధికారికంగా ఈ ప్రకటన వెలువడింది.

‘‘నేను వృథా చర్చలను కోరుకోవడం లేదు’’ అని ట్రంప్ అన్నారు. ‘‘నేను సమయం వృథా చేయాలనుకోవడం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ట్రంప్ అన్నారు. అంతకుముందు రష్యా విదేశాంగమంత్రి లావ్రోస్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ తో తక్షణ కాల్పుల విరమణను మాస్కో వ్యతిరేకిస్తుందని అన్నారు.
ట్రంప్, పుతిన్ కలవకపోవడం యూరోపియన్ నాయకులకు పెద్ద ఉపశమన చర్యగా చెప్పవచ్చు. యుద్ధభూమిలో అవసరమైన సాయం అందేవరకూ చర్చల పేరుతో పుతిన్ కాలయాపన చేస్తున్నారని ఈయూ నాయకులు వాదిస్తున్నారు.
అలాగే ఇప్పటిదాకా రష్యా యుద్ధం గెలుచుకున్న భూమిని వారికే స్వాధీనం చేసేలా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను సైతం వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా బ్రిటిష్ ప్రధాని, ఫ్రెంచ్ అధ్యక్షుడు, జర్మనీ ఛాన్స్ లర్ ఈ ప్రతిపాదనకు అంగీకరించేది లేదని చెబుతున్నారు.
ఉక్రెయిన్ ఆర్థిక సాయం చేసేందుకు స్తంభింపజేసిన రష్యా నిధులు వాడుకోవాలని కూడా వారు ప్రణాళిక రచిస్తున్నారు. అయితే వీటి చట్టబద్దతపై కొన్ని సందేహాలు ఉన్నాయి.
అలస్కాలో సమావేశం..
రష్యా అధ్యక్షుడు పుతిన్- అమెరికా అధ్యక్షుడు పుతిన్ మధ్య చివరగా ఆగష్టు లో అలాస్కా వేదికగా చర్చలు జరిగాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం పై అనేక విషయాలు చర్చించినప్పటికీ తుది ఫలితం మాత్రం రాలేదు. ఇదే సమయంలో ట్రంప్ తో సమావేశం కావడానికి క్రిమ్లిన్ కూడా వేచిచూసే ధోరణినే అనుసరిస్తోంది.
తోమహాక్ క్షిపణులు కావాలి: జెలెన్ స్కీ
రష్యా తో జరిగే యుద్ధంలో పై చేయి సాధించాలంటే తమకు తోమహాక్ క్షిపణులు సరఫరా చేయాలని కీవ్ కోరుకుంటోంది. అయితే వీటిని అమెరికా సరఫరా చేస్తుందా లేదా పూర్తి సమాచారం బయటకు రావడం లేదు.
‘‘మనం ఈ యుద్ధాన్ని ముగించాలి. ఒత్తిడి మాత్రమే శాంతికి దారితీస్తుంది’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ టెలీగ్రామ్ లో పోస్ట్ చేశారు. తోమహక్ క్షిపణులు అందిస్తాని అమెరికా ప్రకటించగానే పుతిన్, ట్రంప్ కు ఫోన్ చేశారని, కానీ ఒత్తిడి తగ్గగానే దౌత్య ప్రక్రియ నుంచి క్రిమ్లిన్ పక్కకు జరుగుతోందని ఆరోపించారు.
నాటో చీఫ్ తో ట్రంప్ సమావేశం..
వైట్ హౌజ్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నాటో చీఫ్ మార్క్ రుట్టేతో చర్చలు జరుపుతున్నారు. ఈ సైనిక కూటమే ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరాను సమన్వయం చేస్తోంది.
అమెరికా నుంచి చాలా రకాల ఆయుధాలను ఇప్పటికే యూరోపియన్ యూనియన్, కెనడా కొనుగోలు చేశాయి. వీటిని కీవ్ కు చేర్చడానికి ఈ సమావేశం జరిగింది. అలాగే ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చే 35 దేశాల ‘కోయలిషన్ ఆఫ్ ది విల్లింగ్’ సమావేశం శుక్రవారం లండన్ లో జరగనుంది.
తరుచుగా మాట మారుస్తున్న ట్రంప్..
యుద్ధం ఆగాలంటే తక్షణమే రష్యాకు కోల్పోయిన భూభాగంపై ఆశలు వదులుకోవాలని మొన్నటిదాకా వాదించిన ట్రంప్.. సడన్ ఇప్పుడు ప్లేట్ మార్చి.. ఆక్రమించిన మొత్తం భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యమే అని కొత్త పల్లవి అందుకున్నారు.
ఇప్పుడు మరోసారి డాన్ బాస్ ప్రాంతంపై ఆశలు వదులుకోవాలని అన్నారు. కానీ ఉక్రెయిన్ కు ఇది ఆమోదయోగ్యం కాదని చెబుతూ వస్తోంది. చివరకు రష్యాను మేము ఓడించగలమా అనే సందేశం తమకు వస్తుందని మనసులో ఉన్న భయాన్ని సైతం వెళ్లగక్కాడు. రష్యాపై వెంటనే ఆర్థిక ఆంక్షలు విధించి ఒత్తిడి పెంచాలని ఈయూ నాయకులను కోరారు.
Read More
Next Story