మధురో ఎలా బంధించామంటే.. వివరాలు వెల్లడించిన ట్రంప్
x
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో కళ్లకు గంతలు కట్టి విమానంలో తరలిస్తున్న అమెరికా

మధురో ఎలా బంధించామంటే.. వివరాలు వెల్లడించిన ట్రంప్

కొత్త ప్రభుత్వం ఏర్పడే దాక తామే సాయడతామని వెల్లడి, భారీ ఎత్తున చమురు విక్రయించే ప్రతిపాదనలు


వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా ప్రత్యేక దళాలు అదుపులోకి తీసుకుని న్యూయార్క్ కు తరలించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

మధురో నివాసాన్ని పోలిన ఇంటిని నిర్మించి నెలల తరబడి ప్రత్యేక సాధన చేసినట్లు ఆయన చెప్పారు. ఎలాంటి గందరగోళం లేకుండా అమెరికా సేనలు అత్యంత సాహసోపేతమైన సైనిక చర్యలను గంటల వ్యవధిలోనే పూర్తి చేసినట్లు వెల్లడించారు.

2003 లో అమెరికా, ఇరాక్ పై యుద్ధం తరువాత మరోసారి ఇలాంటి చర్యకు దిగడం ఇదే ప్రథమం. అయితే ఈ ఆపరేషన్ పై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

దేశాన్ని మేమే నడుపుతాం
లాటిన్ అమెరికా దేశాన్ని తాత్కాలికంగా అమెరికా నడుపుతుందని, దాని విస్తారమైన చమురు నిల్వలను ఇతర దేశాలకు విక్రయిస్తామని వాషింగ్టన్ ప్రకటించింది.
అమెరికా సార్వభౌమత్వాన్ని బెదిరించి, అమెరికన్ల జీవితాలను ప్రమాదంలో పడవేసే ఎవరికైనా ఈ చర్యలు హెచ్చరికగా పనిచేస్తుందని ఆయన ఎప్పటిలాగే గొప్పలు చెప్పుకున్నారు. అంతకుముందు ఆయన తన సొంత సోషల్ మీడియా అయిన ‘ద ట్రూత్’ లో మదురోను బంధించి తీసుకు వెళ్తున్న చిత్రాన్ని విడుదల చేశారు.
దాడి ఎలా జరిగింది
అమెరికా గత కొన్ని నెలలుగా వెనెజువెలాపై దాడి చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. తమ బద్ద వ్యతిరేకి అయిన మదురో ను పదవి నుంచి దింపడానికి ముందుగా కరేబియన్ జలాల్లో అమెరికా బలగాలను భారీగా మోహరించింది. తరువాత అక్కడి నుంచి వెళ్తున్న అయిల్ ట్యాంక్ లను స్వాధీనం చేసుకుంది.
ఇదే సమయంలో మదురో బంధించడానికి రహస్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అమెరికా నిఘా సంస్థలు మదురో ప్రతి కదలికను జాగ్రత్తగా అధ్యయనం చేశాయి.
శనివారం తుది ఆదేశాలు రాగానే అర్థరాత్రి యూఎస్ డెల్టా విభాగానికి చెందిన ప్రత్యేక దళాలు దాడులు ప్రారంభించాయి. అత్యాధునిక హెలికాప్టర్లలలో వెనెజువెలా రాజధాని అయిన కారకాస్ కు చేరుకుని నేరుగా అధ్యక్ష భవనం మీద దిగిన దళాలు.. దాడులు ప్రారంభించాయి.
అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ ను అదుపులోకి తీసుకుని అమెరికా యుద్దనౌకకు తరలించారు. అక్కడి నుంచి వారిని నేరుగా వాషింగ్టన్ కు చేర్చారు. ఆయనపై డ్రగ్స్ కేసులతో పాటు అవినీతి ఆరోపణల కేసులు సైతం నమోదు చేశారు.
మీడియా సమావేశంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ మాట్లాడుతూ..మదురో ఏ సమయంలో ఎక్కడ ఉంటారు. ఏం తింటారు.. పెంపుడు జంతువులు, ఆయన వేసుకునే దుస్తులు వంటి వాటి గురించి కూడా వివరంగా తెలుసుకున్నట్లు చెప్పారు.
డిసెంబర్ నాటికి మిషన్ పూర్తి చేయడానికి సిద్ధమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించే వరకూ వేచి చూశామని, అయినప్పటికీ కొంత ప్రతికూల పరిస్థితులు తట్టుకుని ప్రయాణం మొదలు పెట్టినట్లు చెప్పారు. భూమికి అత్యంత తక్కువ ఎత్తులో ఎగురుతూ టార్గెట్ రీచ్ అయ్యామని, కేవలం 30 నిమిషాల్లో ప్రధాన లక్ష్యాన్ని చేరుకున్నామని తెలిపారు.
వైస్ ప్రెసిడెంట్.. బాధ్యతల స్వీకరణ
కారకాస్ లో జరిగిన పరిణామాల తరువాత వెనెజువెలా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ చట్టప్రకారం అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అమెరికా దాడిలో కొంతమంది వెనిజులా పౌరులు, సైనికులు మరణించినట్లు చెప్పారు. అమెరికా వెంటనే మదురో ను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. మదురోనే దేశానికి సరైన నాయకుడని, వాషింగ్టన్ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొంది.
వ్యతిరేకించిన డెమోక్రాట్..
కాంగ్రెస్ ఆమోదం లేకుండా అమెరికా అధ్యక్షుడు వెనెజువెలా అధ్యక్షుడిని తీసుకురావడంపై డెమోక్రాట్ పార్టీ విమర్శించింది. కనెక్టికట్ ప్రతినిధి అయిన జిమ్ హిమ్స్ మాట్లాడుతూ.. వెనెజువెలాపై దాడి చేయడానికి సమర్థించే ఆధారాలు తనకు కనిపించలేదని, లాటిన్ అమెరికా ప్రాంతంలో స్థిరత్వాన్ని నిర్ధారించే ప్రణాళికలు కూడా ఏవి లేవన్నారు. దీనిపై అధ్యక్షుడు వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read More
Next Story