ట్రంప్ టామ్ టామ్...
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ట్రంప్ టామ్ టామ్...

"నేనే... నేనే... నేనే...కాల్పుల విరమణ నేనే చేయించా"


భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన వల్లే సాధ్యమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు బహిరంగంగా ఇదే విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించగా తాజాగా మరోసారి సెల్ప్ క్రెడిట్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు.

రెండు దేశాల మధ్య యుద్దాన్ని ఆపడానికి తాను వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించుకున్నానని చెప్పుకున్నారు. అయితే భారత్ వీటిని ఖండించింది. జమ్మూకాశ్మీర్ విషయాన్ని తాము ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటామని కూడా విదేశాంగ శాఖ వెల్లడించింది.

ట్రంప్ ఎప్పుడూ తనపైనే అంతా దృష్టి కేంద్రీకరించుకునే తత్త్వం కలవాడని ఆయన మొదటి టర్మ్ లో జాతీయ భద్రతా సలహదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ కూడా విమర్శించారు.
వాణిజ్యంతో సెట్ చేశాను..
పాకిస్తాన్- భారత్ విషయాన్ని మేము మొత్తం పరిష్కరించాము. మీరు ఈ విషయాన్ని గమనించే ఉంటారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసో తో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ అన్నారు.
‘‘నేను వాణిజ్యంతో మొత్తం సెట్ చేశానని అనుకుంటున్నాను. మేము భారత్ తో పెద్ద మొత్తంలో పెద్ద ఒప్పందం కుదుర్చుకోబోతున్నాము. అలాగే పాకిస్తాన్ తో కూడా అలాంటిదే ఆఫర్ చేశాము’’ ట్రంప్ చెప్పారు.
భారత్, పాకిస్తాన్ కు మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన సాయుధ ఘర్షణల్లో కాల్పుల విరమణ ప్రకటన రావడానికి ముందే ట్రంప్ అధికారికంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు.
‘‘ భారత్, పాకిస్తాన్ మధ్య యునైటెడ్ స్టేట్స్ రాత్రిపూట సుదీర్ఘంగా చర్చించింది. భారత్, పాకిస్తాన్ లు కాల్పుల విరమణ అంగీకరించాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రెండు దేశాలు తమ కామన్ సెన్స్, తెలివితేటలు ప్రదర్శించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని ఆయన అప్పట్లో ట్రంప్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు.
కాశ్మీర్ పై ద్వైపాక్షిక చర్చలు..
భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్దానికి మధ్యవర్తిత్వం వహించడమే కాకుండా న్యూక్లియన్ వార్ ను జరగకుండా తానే ఆపానని కూడా ట్రంప్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు. జమ్మూకాశ్మీర్ విషయంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు.
అయితే విదేశాంగ శాఖ మాత్రం పీఓజేకే విషయంలో తాము మూడో పక్షాన్ని అనుమతించబోమని ప్రకటించింది. ఈ విషయాన్ని భారత్- పాకిస్తాన్ ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటాయని వెల్లడించింది. అలాగే కాల్పుల విరమణ విషయంలో అమెరికాతో ఎలాంటి వాణిజ్య చర్చలు జరపలేదని కూడా వివరించింది.
‘‘కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ కు సంబంధించి మనకు జాతీయ విధానం ఉంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్- పాకిస్తాన్ మాత్రమే ద్వైపాక్షికంగానే చర్చించుకుంటాయి.
ఆ విషయం మీకు తెలుసు. పాలసీని మేము మార్చలేదు. పాకిస్తాన్ తో ఇప్పుడు కేవలం ఉగ్రవాదం, పీఓజేకే నుంచి పాక్ నిష్క్రమణ పై మాత్రమే చర్చలు జరుగుతాయి’’ అని విదేశాంగ శాఖ చాలా స్పష్టంగా ప్రకటన చేసింది.
వాణిజ్యం గురించి అసలు మాట్లాడలేదు
కాల్పుల విరమణ సమయంలో భారత్- అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య అంశాలు చర్చకు రాలేదని భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
‘‘ఆపరేషన్ సిందూర్ తరువాత రెండు దేశాల మధ్య ప్రారంభమైన మిలిటరీ సంఘర్షణ పై అమెరికా- భారత్ మధ్య చర్చలు జరిగాయి. అయితే ఇందులో ఎలాంటి వాణిజ్య అంశాలు మాట్లాడుకోలేదు’’ అని ఎంఈఏ అధికారులు తెలిపారు. అయితే మొదట్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ మధ్య తాము ఎలాంటి మధ్యవర్తిత్వం చేయమని చెప్పారు.
ట్రంప్ పై విమర్శలు గుప్పించిన మాజీ ఎన్ఎస్ఏ
ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన చేయడంపై మాజీ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ విమర్శించారు. ప్రతి అంశానికి సంబంధించిన క్రెడిట్ ను ట్రంప్ తీసుకుంటారని అన్నారు. ట్రంప్ ది విలక్షణమైన వ్యక్తిత్వమని, పాపులారిటి వచ్చే ప్రతి అంశం పై ఇతరులు క్లెయిమ్ చేసుకోవడానికి కంటే ముందే తనే వాటిని ప్రకటించుకుంటాడని చెప్పారు.
ట్రంప్, ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఉంటారని, అదే ఫోన్ లో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడి ఉండి ఉంటారని బోల్టన్ అంచనా వేశారు.
ఇలాంటి పనులు సాధారణంగా జరుగుతూ ఉంటాయని, ఇతర దేశాల నాయకులు కూడా ఫోన్ లు చేసి ఉంటారని చెప్పారు. ఇలాంటివి బహిరంగ ప్రకటనలు అందరికి చిరాకు తెప్పిస్తాయని, కానీ ట్రంప్ ఇందులో భారత్ కు వ్యతిరేకంగా ఏమి చేయలేదని చెప్పారు.
జాన్ బోల్టన్ ఎవరూ?
జాన్ బోల్టన్ ఏప్రిల్ 2018 నుంచి 2019 వరకూ అంటే ట్రంప్ మొదటిసారిగా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడిగా ఉన్నారు. ఇరాన్ తో బరాక్ ఒబామా హాయాంలో కుదుర్చుకున్న అమెరికా అణు ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలగడంలో కీలక పాత్ర పోషించారు. అయితే తరువాత కాలంలో ట్రంప్ తో విభేదాల కారణంగా అతడిని పదవి నుంచి తొలగించారు.
ట్రంప్ పరిపాలన కాలంలో తన అనుభవాలపై ఆయన 2020 లో ‘ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్’ అనే పేరుతో పుస్తకం రాశారు. ఇది భారీ స్థాయిలో అమ్మడుపోయాయి.
ఆపరేషన్ సిందూర్..
పహల్గామ్ లో ఇస్తామిక్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో గల బైసారన్ గడ్డి మైదానాల్లో పర్యాటకులను కాల్చి చంపారు. కేవలం మతం ఆధారంగా హిందువులని గుర్తించి కాల్చిచంపడంతో దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై ప్రధాని మోదీ స్వయంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
మే 7 న భారత సైన్యం పాక్, పీఓజేకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందమందిని హతం చేసింది. తరువాత పాకిస్తాన్, భారత సైన్యం లక్ష్యంగా దాడులు చేయడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ లోని 12 వైమానిక స్థావరాలు పేల్చివేసింది. వారి మిలిటరీ ఆస్తుల్లో దాదాపు 20 శాతం మేర సైన్యం నాశనం చేసింది. అలాగే పాకిస్తాన్ రాడార్లు, క్షిపణి వ్యవస్థలు, యుద్ద విమానాలు కూల్చివేసింది.
Read More
Next Story