
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ పై సైనిక దాడులను పరిశీలిస్తున్నాం: అమెరికా
పరిమిత లక్ష్యాలపై మెరుపుదాడులపై అధ్యక్షుడు ట్రంప్ పరిశీలిస్తున్నారన్న సీనియర్ అధికారులు
ఇరాన్ లో ఉన్న ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై అక్కడి ప్రభుత్వం తీవ్రంగా అణచివేత ధోరణిపై అవలంభిస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. సైనిక జోక్యంపై అధ్యక్షుడు పరిశీలిస్తున్నారని సీనియర్ అధికారులు మీడియాకు చెప్పారు.
ఆర్థిక ఆంక్షలు నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ఈ కారణంతో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనల వల్ల దాదాపు 220 మంది మరణించినట్లు అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ పేర్కొన్నాయి. మరో 2300 మందిని ఇరాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది.
ట్రంప్ హెచ్చరిక..
ట్రంప్ తుది నిర్ణయం తీసుకోలేదని వార్తలు వస్తున్నప్పటికీ ఇరాన్ అధికారులు ప్రజలపై అణచివేత తీవ్రతరం చేస్తే పరిమితదాడులను ఆయన తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
టెహ్రన్ లోని భద్రతా విభాగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉందని కొంతమంది అధికారులు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ఇరాన్ నాయకులను అనేకసార్లు హెచ్చరించారు. సాధారణ ప్రజలపై బలప్రయోగం జరుగుతుందని ఆరోపించారు. దీనిని ఆపకుంటే సైనిక దాడులు తప్పవని కూడా తనదైన శైలిలో బెదిరింపులకు దిగారు.
సోషల్ మీడియాలో ట్రంప్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోరుకునే ఇరానియన్లకు మద్దతు ఇవ్వడానికి అమెరికా సిద్ధంగా ఉందని అన్నారు. ‘‘ఇరాన్ స్వేచ్ఛను చూస్తోంది. బహుశా ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా’’ అని ట్రంప్ శనివారం పోస్ట్ చేశారు. ‘‘యూఎస్ఏ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది’’ అని రాసుకొచ్చారు.
అందరిని ఉరితీస్తాం..
ఇరాన్ లో సంక్షోభం చెలరేగిన తరువాత అమెరికా తీవ్రంగా హెచ్చరిస్తున్నప్పటికి దాని పాలకుడు అయతుల్లా అలీ ఖమేనీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన నిరసనకారులపై ఇంక కఠినంగా వ్యవహరించే సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను నిలిపివేసింది.
ఇది ఉండగా అరెస్ట్ అయిన నిరసనకారులను దేవుని శత్రువులుగా పరిగణిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మొహ్మద్ మొవాహోదీ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ టెలివిజన్ ఛానల్లు మాత్రం దేశమంతా ప్రశాంతంగా ఉన్నట్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అసోసియేట్ ప్రెస్ నివేదిక ప్రకారం.. రోడ్లపై వేలాది మంది నిరసనకారులు ఉన్నారు.
ఈ నిరసనకారుల్లో కొంతమంది 1980 లలో మరణించిన ఇరాన్ మాజీ చక్రవర్తి రెజా పహ్లవికి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. ఆయన కుమారుడు రెజా పహ్లవి నిరసనలు కొనసాగించమని ఇరానియన్లకు పిలుపునిచ్చాడు.
ఆయన దేశంలోకి కీలక పట్టణాలను స్వాధీనం చేసుకోవాలని కూడా కోరాడు. నిరసనకారులు తమ తదుపరి దశలోకి ప్రవేశించాలని 1979కి ముందు ఉన్న జెండాలను దేశమంతా ఎగరవేయాలని కోరాడు.
విదేశాలలో కూడా..
ఇరాన్ లోని నిరసనలు ప్రపంచంలోని పలుదేశాలలో కూడా జరుగుతున్నాయి. శుక్రవారం లండన్ లోని కెన్సింగ్టన్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం భవనంపైకి ఎక్కిన నిరసనకారుడు.. ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాను చించి, దాని స్థానంలో 1979కి ముందున్న ‘‘సింహం, సూర్యుడు’’ ఉన్న చిహ్నాంతో కూడిన జెండాను ఎగరవేశారు.
ఈ సందర్భంగా తోటి ఇరానియన్లు చప్పట్లు కొడుతూ హర్షాతిరేకలు వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. మిగిలిన యూరోపియన్ ప్రాంతాలలో కూడా ఇరానియన్లకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ లోని వైట్ హౌజ్ వెలుపల కూడా ప్రజలు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు.
రూబియో, నెతన్యాహూ మధ్య చర్చలు...
ఇరాన్ పరిస్థితితో పాటు, సిరియాలోని పరిణామాలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘‘ఇరాన్ ధైర్యవంతులైన ప్రజలకు మద్దతు ఇస్తాం’’ అని రూబియో తరువాత పోస్ట్ చేశారు.
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం పరిమిత సైనిక చర్య గురించి కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ఎక్కువ సమయం అవసరమని స్థానిక సైనిక అధికారులు కోరుకుంటున్నారని కూడా ఇండియా టుడే నివేదిక పేర్కొంది.
Next Story

