తుపాకీ కొనుగోలు కేసులో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కుమారుడు దోషే!
x

తుపాకీ కొనుగోలు కేసులో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కుమారుడు దోషే!

డ్రగ్స్ అలవాటున్న హంటర్ బైడెన్ చట్టానికి విరుద్ధంగా ఓ షాపులో రివాల్వర్ (తుపాకి)ని కొనుగోలు చేశారనే ఆరోపణలపై ఆయన్ను కోర్టు జ్యూరీ దోషిగా తేల్చింది.


మెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ను డెలావేర్ లోని విల్మింగ్టన్ కోర్టు దోషిగా తేల్చింది. డ్రగ్స్ అలవాటున్న హంటర్ బైడెన్ చట్టానికి విరుద్ధంగా ఓ షాపులో రివాల్వర్ (తుపాకి)ని కొనుగోలు చేశారనే ఆరోపణలపై ఆయన్ను కోర్టు జ్యూరీ దోషిగా తేల్చింది. ఇప్పుడీ వ్యవహారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు తలనొప్పిగా మారింది. నవంబర్ 4న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న జో బైడెన్ ఈ తీర్పుతో తక్షణమే రాజీనామా చేస్తారా లేక పోటీ నుంచి తప్పుకుంటారా అనే అంశమై ఊహాగానాలు మొదలయ్యాయి. జ్యూరీ నిర్ణయం తర్వాత తన కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు బైడెన్ దేశ రాజధాని వాషింగ్టన్ నుంచి తన స్వస్థలమైన డెలావర్ రాష్ట్రం వెళ్లారు.

బైడెన్ స్వస్థలమైన డెలావేర్ రాష్ట్రంలోని విల్మింగ్టన్‌ కోర్టు జ్యూరీ హంటర్ బైడెన్ ను మూడు నేరపూరిత ఆరోపణలపై దోషిగా నిర్ధారించింది. దీంతో ఆయన తండ్రి హడావుడిగా తన షెడ్యూల్‌ను మార్చుకుని ఇంటికి వెళ్లారు. తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే అధ్యక్షుడు బైడెన్ తన ఇంటికి వెళ్లి తన కొడుకును కౌగిలించుకుని ఓదార్చారు. తన మనవడు బ్యూ బైడెన్ తలను ముద్దాడారు. మొత్తం మీద ఈ వ్యవహారం తండ్రీకొడుకుల మధ్య అనుబంధానికి అగ్ని పరీక్షగా నిలిచింది.

అధ్యక్షుడు జో బైడెన్ మొదటి భార్య సంతానంలో మిగిలిన కుమారుడు హంటర్ బైడెన్. మొదటి భార్య మరణించారు. పెద్ద కొడుకు, కుమార్తె కూడా కన్నుమూశారు. హంటర్ బైడెన్ పాటు కుటుంబంలోని అనేక మందిని పీడిస్తున్న మాదకద్రవ్యాలు, మద్యపాన వ్యసనాలతో ఇప్పటికే బైడెన్ కుటుంబం చాలా అప్రదిష్టపాలైంది. ఇప్పుడు ఆయన కుమారుడు హంటర్ అటువంటి ఆరోపణలతోనే కోర్టు జ్యూరీ ఎదుట దోషిగా మిగిలారు. ఇప్పుడీ జ్యూరీ తీర్పు బైడెన్ ప్రత్యర్థి పార్టీ అయిన రిపబ్లికన్ల పాలిట వరమైంది. మూడేళ్లుగా చేస్తున్న అవినీతి, ఆర్థిక నేరాల ఆరోపణలకు హంటర్ వ్యవహారం తోడవడంతో బైడెన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఇంకా ఐదు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. డెమోక్రాట్ల తరఫున బైడెన్ అభ్యర్థిగా దాదాపు ఖరారు కావొచ్చిన నేపథ్యంలో ఫెడరల్ కోర్ట్‌రూమ్‌లో హంటర్ దోషిగా తేలారు. బైడెన్ పార్టీకి ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
అయితే బైడెన్ మాత్రం ఇప్పటికీ తన కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదని, చట్టం నుంచి సురక్షితంగా బయటపడతాడన్న నమ్మకంతో ఉన్నారు. హంటర్ బైడెన్ 2019 నుంచి హుందాగా ఉంటున్నారని పేర్కొన్నారు.(ఇది 2018ల నాటి కేసు) అంతమాత్రాన తన కొడుకు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు అంత తేలికైన ముగింపు ఉండదనే వాస్తవాన్ని అధ్యక్షుడు అంగీకరించారు.
ప్రస్తుతం తన కుమారుని భవిష్యత్తు ఏమిటనే దాని గురించే బైడెన్ దీర్ఘాలోచన చేస్తున్నారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలన్న ఆలోచనా లేకపోలేదంటున్నారు.
అసలేమిటీ కేసు..
హంటర్ బైడెన్ కు మాదక ద్రవ్యాల అలవాటుంది. 2018 నుంచి ఆయన ఆ అలవాటును మానేశారు. డ్రగ్స్ కు బానిసలైన వారి వద్ద తుపాకులు ఉండకూడదు. అటువంటి వాళ్లు కొనకూడదు. ఈ చట్టానికి విరుద్ధంగా హంటర్ బైడెన్ తుపాకీ కొనుగోలు చేశారనే ఆరోపణలపై ఆయన్ను కోర్టు జ్యూరీ దోషిగా నిర్ధారించింది. కోర్టు న్యాయమూర్తి ఇంకా తీర్పు ప్రకటించలేదు. అమెరికా నిబంధనల ప్రకారం 12మందితో కూడిన జ్యూరీ ముందు తీర్పు ఇస్తుంది. ఆ తర్వాత కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇస్తారు. మాదకద్రవ్యాల బానిసలు తుపాకీలను కలిగి ఉండకూడదన్న చట్టాలను ఉల్లంఘించాడని జ్యూరీ నిర్ధారించారు.
ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యుడొకరు ఈ తరహా నేరానికి పాల్పడినట్టు కోర్టు నిర్దారించడం ఇదే తొలిసారి. తండ్రి పదవిలో ఉన్న సమయంలో నేరానికి పాల్పడినట్లు జ్యూరీ తీర్పు ఇచ్చిన తొలి కేసు కూడా ఇదే. జో బైడెన్ అధ్యక్షుడు కావడానికి ముందు నుంచే హంటర్ బైడెన్ పై నేరారోపణలు ఉన్నాయి.
మంగళవారం సమావేశమైన 12 మంది జ్యూరీ సభ్యులు కేవలం మూడు గంటలలోపే చర్చించి హంటర్ ను దోషిగా తేల్చారు. తుపాకులు అమ్మె ఓ షాపులో హంటర్ బైడెన్ 2018 అక్టోబర్ లో తుపాకీ కొనుగోలు చేసినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. మొత్తం మూడు ఆరోపణలు చేసింది.
డ్రగ్స్ వాడకంపై హంటర్ అబద్ధం చెప్పారన్నది తొలి ఆరోపణ. డ్రగ్స్ వాడకం అలవాటు ఉన్నప్పుడు తుపాకీ చేతిలో ఉండకూడదన్నది రెండోది. రివాల్వర్ ను ఓ షాపులో కొనుగోలు చేసి కూడా అబద్ధం చెప్పారన్నది మూడో ఆరోపణ. ఈ మూడింటిని జ్యూరీ సభ్యులు నిర్దారించారు. ఆయన్ను ఈ మూడు ఆరోపణలలోనూ దోషిగా తేల్చారు.
జ్యూరీ తీర్పు తర్వాత 120 రోజుల్లో శిక్షను ఖరారు చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. హంటర్ బైడెన్ కి 25 ఏళ్ల వరకు జైలు శిక్ష, 7.5 లక్షల డాలర్ల వరకు జరిమానా విధించవచ్చు. అయితే హంటర్ చేసింది తొలి తప్పుగా భావించి న్యాయమూర్తి శిక్షను తగ్గించవచ్చు.
హంటర్ స్పందన ఏమిటంటే..
"ఫలితం పట్ల నిరాశ చెందడం" కంటే చెప్పగలిగిందేమీ లేదన్నారు హంటర్ బైడెన్. కష్టకాలంలో తన కుటుంబం తనకు అండగా నిలిచిందని కృతజ్ఞతలు తెలిపారు. జ్యూరీ తీర్పుపై హంటర్ న్యాయపోరాటం చేస్తారని ఆయన తరఫు న్యాయవాది అబ్బే లోవెల్ చెప్పారు. "హంటర్‌కు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకుంటాం" అని చెప్పారు.
తండ్రిగా నా వంతు పాత్ర పోషిస్తా..
నేరారోపణ రుజువైన నేపథ్యంలో ఓ తండ్రిగా తన కుమారునికి ఎంతవరకు అండగా ఉండాలో అంతవరకు ఉంటానని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. "నేనింతకు ముందే చెప్పా. నేను అధ్యక్షుణ్ణే. అదే సమయంలో నేనో తండ్రిని కూడా. జిల్ (బైడెన్ రెండో భార్య), నేను మా కుమారుణ్ణి ప్రేమిస్తున్నాం. ఈ రోజు అతనున్న స్థితిని చూసి మేము చాలా గర్వపడుతున్నాం" అని జో బైడెన్ చెప్పారు.
"ఈ కేసు కేవలం వ్యసనాల గురించి మాత్రమే కాదు. హంటర్ బైడెన్ డ్రగ్స్ ఉపయోగిస్తున్నప్పుడు చేసిన "చట్టవిరుద్ధమైన పనుల" గురించి అన్నారు ప్రత్యేక న్యాయవాది డేవిడ్ వీస్. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, అధ్యక్షుడు కుమారుడైనా సామాన్యుడైనా చట్టం ముందు ఒక్కటేనని అన్నారు.
ఈ తీర్పు ఇవ్వడానికి జ్యూరీలోని 12 మంది సభ్యుల మధ్య కూడా తీవ్రంగానే చర్చ సాగింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే మంగళవారం ఉదయం కోర్టు సమావేశమైన తర్వాత మూడు గంటల పాటు మళ్లీ వాదోపవాదనలు సాగాయి. ఏకగ్రీవ తీర్పు ఇచ్చారు. హంటర్ బైడెన్ ను దోషిగా గుర్తించడం తప్ప తమకు వేరే మార్గం లేదన్నారు. అయితే ఒక సభ్యుడు మాత్రం ఈ కేసు "ప్రజలు చెల్లించిన పన్నుల్ని వృధా చేయడం తప్ప మరేముంది ఇందులో అని వ్యాఖ్యానించారు. "హంటర్ బైడెన్ జీవనశైలిపై కాకుండా సాక్ష్యాధారాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా తీర్పు ఇచ్చామని జ్యూరీ చెప్పినా ఇది కేవలం రాజకీయ కక్షగానే వ్యాఖ్యాతలు భావించారు.
వారం రోజుల కిందట అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కి ఓ కేసులో శిక్ష పడింది. అయినా ఆయన అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ కుమారుడు హంటర్ ని డెలావర్ కోర్టు దోషిగా తేల్చడం గమనార్హం.
Read More
Next Story