
భారత ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఆగష్టు చివరలో భారత్ తో అమెరికా వాణిజ్య చర్చలు..
అధికారిక సమాచారం లేదంటున్న అధికారులు
భారత్- అమెరికా మధ్య జరగాల్సిన వాణిజ్య చర్చలు తిరిగి ఆగష్టు 25న జరిగే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ రెండోసారి విధించిన పెనాల్టీ ఆగష్టు 27 నుంచి అమల్లోకి రావాలి. అయితే అంతకుముందే ఆగష్టు 25న అమెరికా బృందం ఇండియాకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ పర్యటనకు సంబంధించి అమెరికా అధికారులు షెడ్యూల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే అధికారిక వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. ఈ విషయంలో ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని, కొత్త తేదీ కూడా ఇంకా అందలేదని తెలుస్తోంది.
భారత్ - అమెరికా మధ్య ఇప్పటి వరకూ ఐదు విడతలుగా వాణిజ్య చర్చలు జరిగాయి. ఆరో రౌండ్ చర్చల కోసం అమెరికా బృందం భారత్ కు రావాల్సి ఉంది.
పెరిగిన సుంకాల ఆందోళన..
భారత్ తో అమెరికా చర్చలు ఆగష్టు 25 నుంచి 29 వరకూ జరగాల్సి ఉంది. ‘‘ఈ సందర్శన తిరిగి రీ షెడ్యూల్ చేసే అవకాశం ఉంది’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి జాతీయ మీడియాకు తెలిపారు.
భారత వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాన్ని ప్రకటించినందున సమావేశం వాయిదా వేయడం లేదా తిరిగి షెడ్యూల్ చేయడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. షెడ్యూల్ చేయబడిన సమావేశంలో ఈ ఒప్పందంపై స్పష్టత వస్తుందని భారత అధికారులు ఆశిస్తున్నారని, అయితే ట్రంప్ సుంకాలు ఆగష్టు 27 నుంచి అమల్లోకి రానున్నందున వాయిదా వేయడం విషయాలను క్లిష్టతరం చేసిందని పలు వర్గాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది.
అమెరికా ఏం ఆశిస్తుంది..
వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి రాజకీయంగా సున్నితమైన రంగాలలో ఎక్కువ మార్కెట్ యాక్సెస్ కోసం అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఇది చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధిని ప్రభావితం చేస్తుంది కాబట్టి భారత్ దీన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే పరిస్థితి లేదు. రైతులు, పశువుల పెంపకందారుల ప్రయోజనాల విషయంలో తాను రాజీపడబోనని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా ప్రకటించారు.
2025 సెప్టెంబర్- అక్టోబర్ నాటికి మొదటి దశను ముగించాలని అమెరికా- భారత ప్రణాళికలను ప్రకటించాయి. రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 191 బిలియన్ డాలర్ల వాణిజ్యం నెరుపుతున్నాయి.
భారత్- అమెరికా వాణిజ్యం..
ఆగష్టు 7 నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. రష్యా నుంచి ముడి చమురు, సైనిక పరికరాలను కొనుగోలు చేసినందుకు భారత్ పై అదనంగా 25 శాతం సుంకాలు విధించింది.
ఇది ఆగష్టు 27 నుంచి అమల్లోకి వస్తుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్- జూలై కాలంలో అమెరికాకు దేశ ఎగుమతులు 21. 64 శాతం పెరిగి 33. 53 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 12. 33 శాతం పెరిగి 17. 41 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
2025-26 ఏప్రిల్- జూలై కాలంలో అమెరికా, భారత దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అమెరికాకు భారత్ ఎగుమతులు సానుకూల వృద్దిని నమోదు చేస్తున్నాయి.
Next Story