
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ
‘‘భారత్- పాక్ మధ్య మేము కూడా మధ్యవర్తిత్వం చేశాము’’
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రకటన
పహల్గాం దాడి తరువాత భారత్- పాక్ మధ్య చెలరేగిన సైనిక ఘర్షణలో ఇన్నాళ్లు తానే మధ్యవర్తిత్వం నెరిపానని, అణు యుద్ధం ఆపానని టముకు వేసుకున్న ట్రంప్ కు తోడుగా మరో దేశం కూడా దిగింది.
రెండు దేశాల మధ్య తాము కూడా మధ్యవర్తిత్వం చేసి సైనిక ఘర్షణ నిలువరించామని పేర్కొంది. ఈ కొత్త ప్రకటన చేసింది కమ్యూనిస్టు దేశం చైనా. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ఎక్కువ స్థాయిలో ఈ సంవత్సరం స్థానిక ఘర్షణలు, రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. భౌగోళిక రాజకీయ అల్లకల్లోలాలు చెలరేగి అవి వ్యాప్తి చెందుతున్నాయి’’ అని వాంగ్ యీ అన్నారు.
చైనా తటస్థంగా ఉంది
బీజింగ్ లో జరిగిన అంతర్జాతీయ పరిస్థితులు, చైనాతో విదేశీ సంబంధాలు అనే సదస్సులో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడారు. శాశ్వత శాంతిని స్థాపించే లక్ష్యంతో మూలకారణాలు, లక్షణాలు పరిశీలించి తటస్థ వైఖరిని చైనా అవలంభించిందని చెప్పారు.
‘‘ప్రపంచంలోని కీలకమైన సమస్యలను పరిష్కరించడానికి చైనా ఈ విధానాన్ని అనుసరించింది. మేము ఉత్తరాన మయన్మార్, ఇరాన్, అణు సమస్య, పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రికత్తలు, పాలస్తీనా- ఇజ్రాయెల్ సమస్య, థాయిలాండ్- కంబోడియా వివాదంలో మధ్యవర్తిత్వం నెరిపాము’’ అని వాంగ్ అన్నారు.
చైనా పాత్ర ఏంటీ?
ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్- పాకిస్తాన్ వివాదంలో చైనా పాత్ర, పాకిస్తాన్ సైనిక సాయం అందించిన కోణంలో పరిశీలనలో ఉంది.
పహల్గాం దాడి తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడులను చైనా తీవ్రంగా విమర్శించింది. అయితే మే 7 న రెండు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.
‘‘ఈ ఉదయం భారత్ చేపట్టిన సైనిక చర్య విచారకరమని చైనా భావిస్తోంది’’ అని ఆపరేషన్ సిందూర్ మొదటి రోజు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది.
‘‘చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తోంది’’ అని పహల్గాం ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ చైనా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. శాంతి ప్రయోజనాల కోసం ఇరుదేశాలు సంయమనం పాటించాలని కోరింది.
పాక్ కు సైనిక మద్దతు..
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు చైనా సైనిక సాయం అందించింది. పాకిస్తాన్ హర్డ్ వేర్ లలో 81 శాతానికి పైగా ఆయుధాలు చైనా ఎగుమతి చేసినవే. బీజింగ్ ఈ ఘర్షణను లైవ్ ల్యాబ్ గా ఉపయోగించుకుందని భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ లెప్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ప్రకటించారు. ఈ ఆరోపణలపై చైనా సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా ‘‘36 వ్యూహాలు’’ అనే పురాతన సైనిక వ్యూహాన్ని పాక్ కు అందించిందని, ఇది అప్పుగా తీసుకున్న కత్తితో ప్రత్యర్థిని చంపడం అని జనరల్ సింగ్ అన్నారు. భారత్ ను దెబ్బతీయడానికి బీజింగ్ పాకిస్తాన్ కు సాధ్యమైన సైనిక మద్దతును అందించిందని ఆయన అన్నారు.
భారత్- చైనా సంబంధాలు..
చైనా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. భారత్- చైనా మధ్య సంబంధాలు పెరుగుతున్నాయని, ఈ సంవత్సరం ఆగష్టులో టియాంజిన్ లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ బీజింగ్ కు వచ్చారని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం భారత్, డీపీఆర్కే నాయకులను చైనాకు ఆహ్వానించాము. చైనా- భారత్ సంబంధాలు మంచి స్థితిలో ఉన్నాయి. డీపీఆర్కేతో మంచి సంబంధం ఏర్పడింది. ఎస్సీఓ సమావేశం విజయవంతం అయింది’’ అన్నారు.
భారత్- పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సిందూర్ తరువాత జరిగిన సాయుధ ఘర్షణలో భారత్ అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒకే మాటను స్థిరంగా చెబుతూ వస్తోంది. భారత్- పాకిస్తాన్ కు చెందిన డీజీఎంలు(డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) మాట్లాడుకున్న తరువాత కాల్పుల విరమణ కుదిరినట్లు ప్రకటించింది.
Next Story

