మమ్మల్ని క్షమించండి మహ ప్రభో.. మాల్దీవుల లేఖ
భారతీయులు తమ దేశానికి ఇక రారు అనే భయం మాల్దీవుల పర్యాటక రంగాన్ని వెంటాడుతోంది. దాంతో వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
పర్యాటక రంగంపై నే వచ్చే ఆదాయంపై, అది కూడా భారత్ నుంచి సింహభాగం వస్తున్నప్పటికి, కన్నుమిన్నూ కానక ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు ఇప్పుడు అల్లాడిపోతోంది. భారతీయులు ప్రతిస్పందన ఇలా ఉంటుందని తెలియక, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మాపై కాస్త దయచూపండి అంటూ లేఖలు రాస్తోంది.
భారత ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాల్దీవుల పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఉందని భావించిన ఆ దేశ టూర్ ఆపరేటర్ బాడీ వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
ఆన్ లైన్ వేదికగా పర్యాటక సేవలు అందిస్తున్న ఈజ్ మై ట్రిప్ సీఈఓ కు మాల్దీవుల ట్రావెల్ అండ్ టూర్ ఆపరేటర్ బాడీ( MATATO) మంగళవారం ఓ లేఖ రాసింది. మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నామని ప్రకటించింది. "కొందరు డిప్యూటీ మంత్రులు అవమానకరమైన వ్యాఖ్యలకు మేం నిజాయితీగా క్షమాపణలు చెబుతున్నాం.. ఆ మాటలు ఇతరులను బాధ పెట్టేలా ఉన్నాయి" అంటూ లేఖలో వివరించే ప్రయత్నం చేసింది.
వెంటనే మాల్దీవులకు నిలిపివేసిన విమాన టికెట్ బుకింగ్ సర్వీసులు ప్రారంభించాలని వేడుకుంది. మీపై చేసిన అవమానకర వ్యాఖ్యలకు ప్రతిగా ముగ్గురు డిప్యూటీ మంత్రులను ప్రభుత్వం తొలగించింది అని మటాటో అధ్యక్షుడు అబ్ధుల్లా ఘియాస్, వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ షాజ్ లేఖలో ప్రస్తావించారు.
"ఇటీవల జరిగిన పరిణామాలు ఇరు దేశాల సంబంధాలపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. మన దేశాలను కలిపే బంధాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. భారతీయులను కేవలం టూరిస్టుల్లానే కాకుండా ప్రేమగల సహచరుల్లానే భావిస్తాం" అందులో వారు పేర్కొన్నారు.
మంగళవారం మాల్దీవులు అధ్యక్షుడు మొయిజు చైనా పర్యటనకు వెళ్లారు. భారత్ నుంచి పర్యాటకులు రాకపోవచ్చనే అనుమానాల నేపథ్యంలో ఆదేశం నుంచి పర్యాటకుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ సందర్భంలోనే లేఖ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అగ్రస్థానం భారతీయులదే
మాల్దీవులకు వెళ్లే టూరిస్టుల జాబితాలో అగ్రస్థానం భారతీయులదే అని అక్కడి పర్యాటక శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023లో ఆ దేశాన్ని 17 లక్షలమంది టూరిస్టులు సందర్శించారు. అందులో 2.09 లక్షల మంది భారతీయులు ఉన్నారు. తరువాత స్థానంలో రష్యన్లు, ఆతరువాత చైనీయులు ఉన్నాయి.
అంతకుముందు అంటే 2022లో కూడా భారత్ నుంచి 2.40 లక్షల మంది, 2021లో 2.11 లక్షల పర్యాటకులు ఇక్కడి నుంచి మాల్దీవులకు వెళ్లారు. అందులో బాలీవుడ్ సెలబ్రీటీలు ప్రధాన గమ్యస్థానంగా ‘మాలే’ నే ఉంది. వీరి నుంచి రోజుకు లక్షలాది రూపాయలను అక్కడి రిసార్ట్ లు వసూలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన పరిణామాలతో ఆదాయం మొత్తం కోల్పొయే పరిస్థితి వచ్చింది.
వివాద నేపథ్యం..
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆప్టికల్ ఫైబర్ పూర్తి అయిన సందర్భంగా లక్షద్వీప్ లో పర్యటించారు. అనంతరం అక్కడి పగడపు దిబ్బల్లో డైవింగ్ చేశారు. ఆ ఫోటోలను సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేయగా, మాల్దీవుల డిప్యూటీ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారతీయులు భగ్గుమన్నారు. బాయ్ కాట్ మాల్దీవులు అని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలాగే లక్షద్వీప్ సందర్శించాలని కామెంట్లు చేశారు.
దీంతో వేలాది మంది భారతీయులు మాల్దీవులలో తాము బుక్ చేసుకున్న హోటల్ బుకింగ్స్, విమాన టికెట్లను రద్దు చేసుకున్నారు. దీనికి సంఘీభావంగా ఈజ్ మై ట్రిప్ అనే ఆన్లైన్ పోర్టల్ కూడా మాల్దీవులకు తమ పోర్టల్ ద్వారా బుక్ చేసుకున్న అన్ని విమాన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ నిశాంత్ పిట్టి ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా దేశీయ టూరిజాన్ని ప్రోత్సహించండి.. లక్షద్వీప్ అందాలు మాల్దీవులు, సీషెల్స్ కంటే ఏమాత్రం తీసిపోవు.. మీ కోసం ఉత్తమమైన ఆఫర్లతో వస్తాం అని పోస్ట్ లో రాసుకొచ్చారు. దీనితో మాల్దీవులు టూర్ ఆపరేటర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.