
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
భారత్ - పాక్ వార్ టెన్షన్స్ ను మేము పట్టించుకోము: జేడీ వాన్స్
రెండు దేశాలు దౌత్యపరంగా మాట్లాడుకోవాలని సూచించిన అమెరికా ఉపాధ్యక్షుడు
భారత్- పాక్ గొడవలతో మాకు సంబంధం లేదని, ఆ రెండు దేశాలే కలిసి మాట్లాడుకోవాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ‘‘ ప్రాథమికంగా మాకు సంబంధం లేని వివాదంలో జోక్యం చేసుకోము’’ అని అమెరికా ఆయన అన్నారు.
ఈ వివాదానికి సంబంధించి ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ.. అమెరికా.. భారత్, పాకిస్తాన్ లను నియంత్రించలేకపోయినా, అణ్వాయుధాలను కలిగి ఉన్న రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి ప్రొత్సహిస్తూనే ఉంటుందని చెప్పారు.
రెండు అణు శక్తులు ఢీ కొని పెద్ద సంఘర్షణకు దారి తీసే పరిస్థితులు ఏర్పడితే తాము నిజంగానే ఆందోళనకు గురవుతామని వాన్స్ అన్నారు. ఉద్రిక్తతలు వీలైనంత త్వరగా తగ్గాలని వాషింగ్టన్ కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చెప్పిన మాటలనే వాన్స్ పునరుద్ఘాటించారు.
పరిమితులు..
అమెరికా పరిమితుల గురించి ఉపాధ్యక్షుడు వాన్స్ స్పష్టంగా చెప్పారు. ‘‘ ఈ దేశాలను మనం నియంత్రించలేము. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఫిర్యాదులు ఉన్నాయి. మనం చేయగలిగేది ఏమిటంటే వాటిని తీవ్రతరం కాకుండా ప్రొత్సహించడం, కానీ వాటిని నియంత్రించే లక్ష్యంతో సంబంధం లేని యుద్ధంలో మనం పాల్గొనబోము’’ అన్నారు.
‘‘భారత్, పాకిస్తానీయులు ఆయుధాలను విడిచిపెట్టమని మేము చెప్పలేము. దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించడానికి మేము మా ప్రయత్నాలను కొనసాగిస్తున్నాము. ఈ పరిస్థితి విస్తృత ప్రాంతీయ సంఘర్షణగా లేదా అణు యుద్దంగా మారదని మేము ఆశిస్తున్నాము.’’ అని అన్నారు.
పహల్గామ్ దాడి పరిణామాలు..
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ లో అధికారికంగా పర్యటనలో ఉన్నారు.
ఈ దాడి తరువాత మే 7న భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ ను ప్రారంభించింది. పాక్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారీ ఎత్తున దాడులకు పాల్పడింది.
ఈ దాడులతో పాకిస్తాన్ మే 8 నుంచి జమ్మూ, పఠాన్ కోట్, ఉధంపూర్ సహ అనేక ప్రాంతాలలో సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ సాయుధ దళాలు దాయాదీ దేశం పంపిన డ్రోన్లు, మిస్సైల్లను కూల్చివేసింది. ఈ పరిణామంతో రెండు దేశాలు మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని ఆర్మీ ప్రకటించింది.
దౌత్యపరమైన సహకారం..
అంతకుముందు విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ లతో విడివిడిగా మాట్లాడి ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
భారత్- పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష సంబంధాలకు అమెరికా మద్దతును తెలియజేశారు. ఇరుదేశాలు తమ కమ్యూనికేషన్ లను మెరుగుపరుచుకోవాలని సూచించారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఉపసంహరించుకోవాలని రూబియో పాక్ ప్రధానిని కోరారు.
దౌత్యంపై దృష్టి పెట్టండి..
వైట్ హౌజ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ మాట్లాడారు. భారత్ - పాక్ లు కొనసాగిస్తున్న ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం ఉందని రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షరీఫ్ లతో చెప్పినట్లు వివరించారు. రెండు దేశాలు తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆమె కోరారు.
సైనిక చర్య, హింస పరిష్కరాలు కావని, విదేశాంగ కార్యదర్శి, యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిన సందేశం ఇదే అని నొక్కి చెప్పారు.
‘‘యుద్ధం, సైన్యం, ఎక్కువ హింస పరిష్కారం కాదని ఈ పరిపాలన యాంత్రాంగం స్వయంగా స్పష్టం చేసింది. అన్నింటికి దౌత్యమే సమాధానం, తరాల కొద్ది సాగుతున్న హింసను అంతం చేయడానికి కొత్త విధానాలు అవసరం’’ అని బ్రూస్ పేర్కొన్నారు.
పహల్గామ్ దాడికి పాల్పడిన వారిని జవాబుదారీగా ఉంచాలని అమెరికా కోరుకుంటోందని అన్నారు. వివాదం మరింత తీవ్రతరం కాకూదని రూబియో నొక్కి చెప్పారని బ్రూస్ విలేకరులతో అన్నారు.
Next Story