
‘హనుమంతుడి సూత్రాన్ని అనుసరించాం’
మానవత్వాన్ని చాటుకున్నారని భారత వైమానిక దళాలను అభినందించిన కేంద్రం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు విజయవంతంగా నాశనం చేశాయి. మొత్తం 9 స్థావరాలపై క్షిపణులను ప్రయోగించారు. బుధవారం తెల్లవారుజామున 1.40 ప్రాంతంలో ఈ దాడులు కొనసాగాయి. దాడి చేసిన స్థావరాల్లో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా స్థావరాలు కూడా ఉన్నాయి. ఉగ్ర స్థావరాలపై నాశనం చేయడానికి ఉపక్రమించిన కొన్ని గంటల తర్వాత ప్రధాని మోదీ సమావేశమయ్యారు.
హనుమంతుడిలా: రాజ్‌నాథ్
భారత వైమానిక దళాలు కేవలం ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath) ప్రశంసించారు. "హనుమంతుడు అశోక వాటికలోకి ప్రవేశించినపుడు అనుసరించిన సూత్రాన్ని మేమూ అనుసరించాము. జిన్ మోహి మారా, తిన్ మోహి మారా. అమాయక పౌరులను చంపిన వారిని మాత్రమే మేము లక్ష్యంగా చేసుకున్నాం" అని అన్నారు.
‘‘నిన్న రాత్రి, మన భారత సాయుధ దళాలు శౌర్య ప్రతాపాలు చాటాయి. కొత్త చరిత్రను లిఖించాయి. ఏ మాత్రం ప్రాణనష్టం జరగకుండా కేవలం నిర్దేశిత లక్ష్యాలనే టార్గెట్ చేసి ధ్వంసం చేశాయి. ఇది మన జవాన్లు మానవత్వాన్ని చాటుతుంది. దేశం తరపున జవాన్లు, అధికారులను నేను అభినందిస్తున్నాను. సాయుధ దళాలకు మద్దతు ఇచ్చిన ప్రధాని మోదీని కూడా నా అభినందనలు’’ అని పేర్కొన్నారు రాజ్‌నాథ్ సింగ్.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో..ప్రధాని మోదీ (PM Narendra Modi) తాను వెళ్లాల్సిన యూరప్ పర్యటనను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఆయన క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
పాక్ సైన్యం కాల్పులు..
పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసీ గ్రామాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఫిరంగి, మోర్టార్ దాడులకు పాల్పడింది. ఫలితంగా 12 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. భారత సైన్యం కూడా ఈ దాడులకు ప్రతిస్పందించింది. పాక్ వైపు కూడా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది.