‘‘టార్గెట్ గుర్తించాం.. లోడ్ అయ్యాం.. అనుకుంటే వస్తాం’’
x
డొనాల్డ్ ట్రంప్

‘‘టార్గెట్ గుర్తించాం.. లోడ్ అయ్యాం.. అనుకుంటే వస్తాం’’

ఇరాన్ ను ఉద్దేశిస్తూ ట్రంప్ హెచ్చరికలు, ఇస్లామిక్ పాలనపై విసుగుతో భారీ ఎత్తున నిరసన చేస్తున్న ప్రజలు


ఇరాన్ లో చెలరేగిన ప్రజా నిరసనలపై అమెరికా, ఇరాన్ పరస్పరం బెదిరింపులు చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్లామిక్ రిపబ్లిక్ లో జరుగుతున్న హింసను ప్రస్తావిస్తూ.. మేము సిద్ధంగా ఉన్నాము. లోడ్ అయ్యామని వ్యాఖ్యనించగా, ఇందులో మీ జోక్యం అనవసరం అని టెహ్రాన్ అధికారులు గట్టిగా హెచ్చరించారు.

ఈ నిరసన ప్రదర్శనలలో కనీసం ఎనిమిది మంది ఇరానియన్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తో పాటు ప్రధాన నగరాలైన ఇస్ఫహాన్, కరాజ్, తబ్రీజ్, మాషద్ లలో ప్రజలు భారీ ఎత్తున నిరసన చేస్తున్నారు. తమకు ఇస్లామిక్ పాలన వద్దని నినాదాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ నిరసనలను పెద్ద ఎత్తున అణచివేస్తోంది.
ట్రంప్ ఏమన్నారు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్రూత్ లో ఓ పోస్ట్ చేశారు. ‘‘ శాంతియుత నిరసనకారులను హింసాత్మక చంపితే అమెరికా వారిని రక్షించడానికి వస్తుంది’’ అని హెచ్చరించారు.
‘‘మేము టార్గెట్ లాక్ చేశాము. లోడ్ అయ్యాము. వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము’’ అని ట్రంప్ రాసుకొచ్చారు. దీనికి ప్రతిగా ఇరాన్ ఉన్నతాధికారులు గట్టిగా బదులిచ్చే ప్రయత్నం చేసింది.
ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా పనిచేస్తున్న మాజీ పార్లమెంట్ స్పీకర్ అలీ లారిజాని ఎక్స్ లో అమెరికా, ఇజ్రాయెల్ పై ఆరోణలు చేశారు. రెండు దేశాలు తమ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, నిరసనకారులను రెచ్చగొడుతున్నాయని అన్నారు.
‘‘దేశీయ సమస్యల్లో అమెరికా జోక్యం ఈ ప్రాంతంలో గందరగోళానికి, అమెరికా ప్రయోజనాల నాశనానికి దారితీస్తుందని ట్రంప్ తెలుసుకోవాలి. దీనిని ఇరాన్ అడ్డుకుంటుంది’’ అని రాసుకొచ్చారు.
సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనికి సలహదారుగా పనిచేస్తున్న అలీ షంఖానీ మాట్లాడుతూ.. ఇరాన్ విషయంలో వేలుపెడితే చేతినే కత్తిరిస్తామని కఠినపదజాలంతో హెచ్చరించారు.
ట్రంప్ సాహసయాత్ర ప్రారంభించాడని అమెరికా తెలుసుకోవాలని, వారి సైనికులను జాగ్రత్తగా చూసుకోవాలని లారిజానీ హెచ్చరించారు. గతంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు తలెత్తినప్పుడూ టెహ్రన్ అణు స్థావరాలపై అమెరికా బీ2 బాంబర్లతో దాడి చేసింది. ఈ సందర్భంగా ఇరాన్ కూడా ఖతార్ లోని అమెరికా స్థావరంపై దాడి చేసింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. అయినప్పటికీ ఇది పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
మరోవైపు ఈ విషయంలో యూఎన్ సహ ప్రపంచదేశాలు కలుగజేసుకోవాలని ఇరాన్ ప్రతినిధి అందరికి లేఖలు రాశారు. ఇరాన్ సార్వభౌమత్వంలో అమెరికా కావాలనే జోక్యం చేసుకుంటుందని ఇది మంచి పరిణామం కాదన్నారు.
కొనసాగుతున్న నిరసనలు..
దేశంలోని ప్రధాన నగరాలలో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. డాలర్ తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ ఏకంగా 42 వేల దిగువకు పడిపోవడంతో సగటు ఇరానియన్ తీవ్రంగా ప్రభావితం అయ్యాడు.
ఇవే దేశవ్యాప్తంగా నిరసనలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇరాన్ లోని 31 ప్రావిన్సులలో 22 ప్రావిన్సులలోని వంద పట్టణాలలో నిరసనలు జరుగుతున్నాయి. శుక్రవారం ఫార్స్ ప్రావిన్సులో మార్వ్ డాష్ట్ లో ఒక నిరసనకారుడు పోలీసులతో జరిగిన ఘర్షణలో మరణించాడు.
పాకిస్తాన్ తో సరిహద్దు ఉన్న సిస్తాన్ బెలూచిస్తాన్ ప్రాంతంలో కూడా వేలాదిగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. ఈ నిరనల సందర్భంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ లో పనిచేస్తున్న ఓ సైనికుడిని కొంతమంది వేటడి హతమార్చారు. దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చింది.
రెండు సంవత్సరాల క్రితం అమిని అనే యువతి తలపై స్పార్క్ కాస్త జరిగినందుకు మోరల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి చిత్రవధ చేయడంలో బాధితురాలు మరణించింది. ఈ చర్యతో ఇరాన్ లో నిరసన ప్రదర్శనలు చెలరేగాయి. లక్షలాది మంది యువతులు తమ స్పార్క్ ను విప్పి గాల్లోకి విసిరేసి, నిప్పుల్లో వేసి కాల్చి తమ నిరసనను తెలిపారు. దీనిని ప్రభుత్వం క్రూరంగా అణచివేసింది.
ప్రస్తుతం నిరసనకారులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. అయితే ఆర్థిక విషయంలో తాము ఏం చేయలేమని కూడా పేర్కొంది.
Read More
Next Story