సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు మాకుంది: ఇరాన్
x

సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు మాకుంది: ఇరాన్

పశ్చిమాసియాలో యుద్దభయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ చేసిన దాడిపై ప్రతిదాడి చేసే హక్కు మాకుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో..


పశ్చిమాసియాలో యుద్ధభయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో నలుగురు సైనికులు మృతి చెందారని టెహ్రన్ ప్రకటించింది. తమకు పగ తీర్చుకునే హక్కు ఉందని కూడా వెల్లడించింది. మరో వైపు ఇజ్రాయెల్, గాజాపై వైమానిక దాడులను కొనసాగిస్తునే ఉంది. లాహియా ప్రాంతంలో జరిగిన దాడుల్లో 45 మంది పాలస్తీనీయులు మరణించారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాదాపు వంద ఫైటర్ జెట్లతో ఇరాన్ లోని సైనిక లక్ష్యాలపై దాడులు ప్రారంభించింది. అక్టోబర్ 1న ఇజ్రాయెల్ పై ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ క్షిపణులు కొన్నింటిని మార్గమధ్యలోనే అమెరికా దాని మిత్ర దేశాలు అడ్డుకున్నాయి. అయితే కొన్ని మాత్రం ఇజ్రాయెల్ భూభాగంలో పడ్డాయి. దీని పై టెల్ అవీవ్ అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. కచ్చితంగా ఎదురుదాడి చేస్తామని ప్రకటించింది.
మా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం..
మా సార్వభౌమత్వన్ని కాపాడుకునే హక్కు ఉందని ఇరాన్ కూడా హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, UN భద్రతా మండలి ప్రెసిడెంట్ పాస్కేల్ క్రిస్టీన్ బెయిరిస్‌విల్‌లకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘచి రాసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు.
తాము తీవ్ర స్థాయిలో ప్రతిదాడి చేస్తామని అన్నారు. న్యూస్‌వీక్ ప్రకారం, UNలో ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇరవాని ద్వారా లేఖ పంపారు. యూఎన్ చార్టర్ నియమాలు, అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని వారు ఆరోపించారు. ఈ దాడులను నేరపూరిత చర్యగా అభివర్ణించింది. ఈ పిరికి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
‘‘ ఇది లెబనాన్, గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమం వంటి దాడిగానే చూస్తున్నాం. ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలి’’ అని ఇరాన్ విదేశాంగమంత్రి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
దాడి ఎంతవరకు జరిగిందనేది ఇప్పటివరకు అస్పష్టంగా ఉన్నప్పటికీ, టెహ్రాన్‌కు పశ్చిమాన పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, టెహ్రాన్‌కు పశ్చిమ- నైరుతి ప్రాంతంలోని కొన్ని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వార్తా సంస్థలు తెలిపాయి.
హతమైన నలుగురు సైనికులను ఎక్కడ మోహరించారు అనే విషయాన్ని కూడా ఇరాన్ వెల్లడించలేదు. అయితే ఈ దాడిలో తమ ప్రమేయం లేదని యుఎస్ తెలిపింది, అయితే దాడులు జరిగినప్పుడు అధ్యక్షుడు జో బిడెన్‌కు సమాచారం అందించినట్లు ధృవీకరించింది.
శరణార్థులపై దాడులు.. అల్ జజీరా..
ఉత్తర గాజాలోని బీట్ లాహియా నివాస ప్రాంతాలలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అనేక భవనాలను ధ్వంసం అయ్యాయని ఖతార్ న్యూస్ ఛానెల్ అల్ జజీరా రిపోర్టు చేసింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖను నివేదికను ఉటంకిస్తూ ఈ వార్తను ప్రసారం చేసింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఈ దాడుల్లో దాదాపు 35 మంది మరణించారు. డజను పైగా ప్రజలు గాయపడ్డారు.
యుద్ధంలో స్థానభ్రంశం చెందిన అనేక కుటుంబాలు బీత్ లాహియా, జబాలియా అనే రెండు ప్రాంతాల్లోని శరణార్థులుగా ఉంటున్నాయి. ఇదే సమయంలో ఐడీఎఫ్ దళాలు బీరూట్ లోని అనేక ప్రాంతాలలో వైమానిక దాడులు జరిపాయి.
వివాదంపై భారత్ ఆందోళన..
పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని, వివాదాలన్నీ చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని కోరింది.
"ఈ ప్రాంతంలోని మా మిషన్లు భారతీయ సమాజంతో సంప్రదింపులు జరుపుతున్నాయి" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది. అమాయక బందీలు, పౌర జనాభా బాధలు కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుత శత్రుత్వాలు ఎవరికీ ప్రయోజనం కలిగించవు" అని అది పేర్కొంది. శుక్రవారం జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల సందర్భంగా పశ్చిమాసియా వివాదం పై కూడా మాట్లాడుకున్నారని సమాచారం.


Read More
Next Story