బందీలుగా ఉన్న 214 మంది సైనికులను హతమార్చాం: బలూచ్ రెబెల్స్
x

బందీలుగా ఉన్న 214 మంది సైనికులను హతమార్చాం: బలూచ్ రెబెల్స్

పాక్ సైనిక దురహంకారమే దీనికి కారణమన్న తిరుగుబాటుదారులు


పాకిస్తాన్ లోని కల్లోలిత బలూచిస్తాన్ మీదుగా ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసిన బలూచ్ తిరుగుబాటుదారులు, పాక్ సైనికులను బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే.

రైలు నుంచి సాధారణ ప్రజలను విడిచిపెట్టిన తిరుగుబాటుదారులు, వందలాది పాక్ సైనికులను తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించినట్లు ప్రకటించారు. తాము పాక్ ప్రభుత్వానికి ఇచ్చిన 48 గంటల గడువుపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆధీనంలో ఉన్న 214 మంది పాకిస్తాన్ సైనికులను ఉరితీసినట్లు ప్రకటించింది.
బీఎల్ఏ ప్రతినిధి జీయంద్ బలూచ్ఈ విషయాన్ని వెల్లడించారు. తమ ప్రాంతం నుంచి అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రజలు, నాయకులకు తిరిగి తమకు అప్పగించాలని, 48 గంటల అవకాశం ఇచ్చినప్పటికీ రావల్పిండి, ఇస్లామాబాద్ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని, అసలు పట్టించుకున్న దాఖలా కనిపించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘పాకిస్తాన్ తనకు వారసత్వంగా వచ్చిన మొండితనం, సైనిక దురహంకారం ప్రదర్శిస్తూ వస్తోంది. తద్వారా చర్చలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, క్షేత్ర స్థాయి వాస్తవాలను విస్మరించింది. ఈ మొండితనం ఫలితంగా 214 మంది బందీలను ఉరితీశాం’’ అని బీఎల్ఏ ప్రకటన లో పేర్కొంది.
ఆధారాలు చూపని బీఎల్ఏ
పాకిస్తాన్ మొండితనమే ఇటువంటి చర్యలకు కారణమని బీఎల్ఏ ఆరోపించింది. తాము ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలను గౌరవించామని చెప్పుకుంది. అయితే బందీలను ఉరితీసినట్లు ఎలాంటి ఫొటోలు, వీడియోలను బలూచ్ ఆర్మీ విడుదల చేయలేదు.
పాకిస్తాన్ సైన్యం ఇంతకుముందే ఈ విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. హైజాక్ చేసిన రైలును విడుదల చేశామని, 33 మంది ఉగ్రవాదులు హతమార్చామని, 354 మంది బందీలను సురక్షితంగా రక్షించామని పేర్కొంది. బీఎల్ఏ దగ్గర ఎవరూ బందీలుగా ఉన్నట్లు ఆధారాలు లేవని ప్రకటించింది.
23 మంది సైనికులు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు పౌర ప్రయాణికులు సహ 31 మంది మరణించినట్లు సైన్యం అంగీకరించింది. పాకిస్తాన్ అధికారులు బీఎల్ఏ అతిశయోక్తి వాదనలు చేస్తోందని ఆరోపించారు.
భారత్ పై నిందలు..
బలూచ్ ఉగ్రవాదులకు భారత్, ఆఫ్ఘన్ లోని తాలిబన్లు మద్దతు ఇస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే ఈ రెండు దేశాలు వీటిని ఖండించాయి. ఉగ్రవాదానికి న్యూఢిల్లీ మద్దతు ఇస్తోందని ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది.
ఇస్లామాబాద్ తన వైఫల్యాలకు ఇతరులపై నిందలు మోపే ముందు తన అంతర్గత అంశాలను ఆత్మావలోకనం చేసుకోవాలని చురకలు అంటించింది. ‘‘ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడ ఉందో అందరికి అర్థమయింది’’ అని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
‘‘పాకిస్తాన్ చేసిన నిరాధార ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.
Read More
Next Story