భారత్ కు ఎఫ్ -35 అందజేస్తాం: డొనాల్డ్ ట్రంప్
x

భారత్ కు ఎఫ్ -35 అందజేస్తాం: డొనాల్డ్ ట్రంప్

మగా, మిగా తెలిస్తే మెగా భాగస్వామ్యమన్న ప్రధాని మోదీ


భారత ప్రధాని నరేంద్ర మోదీ - అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధన రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడం, అక్రమ వలసదారులను తిప్పి పంపడం, 26/11 దాడుల కుట్రదారుడు తహవ్వూర్ రాణాను అప్పగించడం వరకూ అనేక అంశాలపై ఒప్పందాలు కుదిరాయి.

అలాగే కీలకమైన భద్రతా రంగంలో వ్యూహాత్మక సంబంధాలను విస్తృతం చేసుకోవడంలో పెద్ద ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాయి. భారత్ అమెరికా తయారీ ఎఫ్ -35 ఫైటర్ జెట్లను అందించడానికి మార్గం సుగమం చేస్తుందని.. ట్రంప్ చర్చల అనంతరం ప్రకటించారు. ఇవి బిలియన్ డాలర్ల సైనిక సరఫరాలను పెంచడంలో న్యూఢిల్లీకి సాయం చేస్తాయని అన్నారు.
గొప్ప స్నేహితులం..
ఇద్దరి దేశాధినేతల మధ్య చర్చలు ప్రారంభం కావడానికి ముందు ట్రంప్, మోదీని స్వాగతించారు. ఇద్దరూ వైట్ హౌజ్ లోని ఓవల్ కార్యాలయంలో సుదీర్ఘంగా కరచాలనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ట్రంప్, మోదీని గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు. ఆయనకు ‘అవర్ జర్నీ టుగెదర్’ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ పుస్తకంలో హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ కార్యక్రమాలకు సంబంధించిన అనేక ఫొటోలు ఉన్నాయి.
వాణిజ్య ఒప్పందాలు..
ఇరువురి దేశాధినేతలు చర్చలు ప్రారంభించడానికి ముందు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘‘మేము భారత్ తో కలిసి పనిచేయబోతున్నాం. సమీప భవిష్యత్ లో మాకు ప్రత్యేక పెద్ద వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి’’ అని ట్రంప్ తన పరిపాలన వాణిజ్య విధానం గురించి మాట్లాడుతూ అన్నారు.
ఎఫ్ -35 జెట్ లను సరఫరా చేయబోతున్నాం..
మోదీతో చర్చల తరువాత సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. ప్రపంచంలోనే అతి పురాతన ప్రజాస్వామ్యం- అతి పెద్ద ప్రజాస్వామ్యం మధ్య ప్రత్యేక బంధం ఉందని, ఇంధనం, కీలకమైన సాంకేతికతల వంటి విభిన్న రంగాలలో సహాకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయని అన్నారు.
అలాగే ఈ సంవత్సరం తమ దేశం నుంచి బిలియన్ డాలర్ల విలువైన సైనిక ఎగుమతులు న్యూఢిల్లీకి చేరతాయని, అలాగే ఎఫ్ 35 స్టెల్త్ ఫైటర్ జెట్లను ఎగుమతి చేయడానికి మార్గం సుగమం చేస్తామని అన్నారు.
చమురు- గ్యాస్ వాణిజ్యం
అమెరికా నుంచి భారీ ఎత్తున గ్యాస్- చమురును భారత్ కు సరఫరా చేయబోతున్నామని, దీనిపై ఒప్పందానికి వచ్చామని ట్రంప్ చెప్పారు. దీనిని మోదీ ధృవీకరిస్తూ మాట్లాడిన మోదీ.. ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం చేకూర్చే వాణిజ్య ఒప్పందాలపై పని చేస్తాయని అన్నారు.
‘‘భారత ఇంధన భద్రత కోసం అమెరికాతో గ్యాస్, చమురు వాణిజ్యం చేస్తాము. ఇంధన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు పెరుగుతాయి. అణుశక్తి రంగంలో చిన్న మాడ్యులర్ రియాక్టర్ల దిశలో మా సహకారాన్ని మరింతగా పెంచుకోవడం గురించి మాట్లాడాము. భారత్ రక్షణ సంసిద్దతలో అమెరికా కీలకపాత్ర పోషిస్తుంది. రాబోయే రోజుల్లో కొత్త సాంకేతికత, పరికరాలు మా సామర్థ్యాన్ని పెంచుతాయి’’ అని మోదీ అన్నారు.
తహావ్వూర్ రాణా అప్పగింత..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడానికి భారత్- అమెరిక మునుపెన్నడూ లేని విధంగా కలిసి పని చేస్తాయని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఇందులో భాగంగా 26/11 కుట్రదారుడు రాణాను భారత్ కు అప్పగించబోతున్నామని ట్రంప్ చెప్పారు.
ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుడైన ఒకరిని అప్పగించడానికి మా పరిపాలన ఆమోదం తెలిపింది. ఇది చెప్పడానికి ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాని ట్రంప్ అన్నారు.
ఉగ్రవాదంతో జరిగే పోరాటంలో భారత్- అమెరికా కలిసి ఉన్నాయి. సరిహద్దుకు అవతలి వైపున ఉద్భవించే ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి దృఢమైన చర్య తీసుకోవాలని మేము అంగీకరిస్తున్నామన్నారు.
సుంకాలు సమాన స్థాయిలో ఉండాలి: ట్రంప్
వివాదాస్పద సుంకాల అంశంపై అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సమాన స్థాయిలో సుంకాలు ఉండాలని అన్నారు. దీనిపై ఇరుదేశాల మధ్య ఆందోళలను చర్చించుకోవాలని అంగీకారానికి వచ్చారు. వాణిజ్యం, సుంకాలపై ఇద్దరు నాయకులు వివరణాత్మక చర్చలు జరిపారని ఇరు దేశాల అధికారులను ఉటంకిస్తూ నివేదికలు వచ్చాయి. ఇందుకోసం అందుబాటులో ఉన్న మార్గాలను ఉపయోగించుకున్నారు.
ప్రతిష్టాత్మకమైన భారత్- మధ్య ప్రాచ్యం- యూరప్ ఆర్థిక కారిడార్ పై ప్రపంచ వ్యాప్తంగా చరిత్రలో గొప్ప వాణిజ్య మార్గాలలో ఒకదానిని నిర్మించడానికి సాయపడాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
అలాగే అమెరికా అణు సాంకేతిక పరిజ్ఞానం భారత మార్కెట్లోకి స్వాగతించడానికి తన చట్టాలను సంస్కరిస్తోందని ట్రంప్ అన్నారు. ఇరు దేశాల మధ్య సహకారం మెరుగైన ప్రపంచాన్ని రూపొందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
అక్రమ వలసదారులను తీసుకుంటుంది
అమెరికా అక్రమ భారతీయ వలసదారులను తిరిగి తీసుకుంటుందని మోదీ అన్నారు. వారిని ఇప్పటికే బలవంతంగా ట్రంప్ పాలన విభాగం వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇతర దేశాలలో చట్టవిరుద్దంగా నివసించే హక్కు ఎవరికి లేదు. నిజంగా భారత పౌరులు అయి ఉండి, అమెరికాలో నివసిస్తూ ఉంటే వారిని తిరిగి తీసుకుంటామని అన్నారు. అయితే ఈ ఆపరేషన్ వలసదారులను లక్ష్యంగా చేసుకోవడంతో ముగియకూడదని, మానవ అక్రమ రవాణాను ఒక్కసారిగా ఆపాలని ఆయన అన్నారు.
ఈ అక్రమ వలసదారులు చిన్న చిన్న కుటుంబాల వారికి పెద్ద పెద్ద కలలు చూపిస్తారు. ఇలా అమెరికా వచ్చిన వారిలో ఎక్కువ మందిని అలా తప్పుదారి పట్టించి ఇక్కడికి తీసుకొచ్చిన వారే అన్నారు.
మనం ఇలా మొత్తం మానవ అక్రమ రవాణా వ్యవస్థపై దాడి చేయాలి. దాని వ్యవస్థ మూలాలను పెకలించడానికి ప్రయత్నించాలి. దీనికి భారత్ తో అమెరికా సహకరిస్తుందని ఆశిస్తున్నానని మోదీ అన్నారు.
అమెరికాలో నివసిస్తున్న భారతీయులు రెండు దేశాల మధ్య వారిధిగా ఉన్నారని అన్నారు. మా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడానికి లాస్ ఏంజిల్స్, బోస్టన్లలో త్వరలో కాన్సులేట్లను ప్రారంభించాలని తమ ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. భారత్ లో ఆఫ్ షోర్ క్యాంపస్ లను ప్రారంభించమని మేము యూఎస్ విశ్వవిద్యాలయాలను ఆహ్వనిస్తున్నామని అన్నారు.
యుద్దంలో ట్రంప్ కు మోదీ మద్దతు...
రష్యా- ఉక్రెయిన్ వివాదంపై ప్రధాని, అమెరికా అధ్యక్షుడు సమాధానాలు ఇచ్చారు. ‘‘యుద్దాన్ని ముగించడానికి సాధ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను నేను సమర్థిస్తున్నాను’’ అని మోదీ అన్నారు.
యుద్దం విషయంలో న్యూఢిల్లీ తటస్థంగా ఉందని ప్రపంచం భావిస్తోంది. కానీ నేను దేశం తటస్థంగా ఉండలేదని నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. వాస్తవానికి భారత్ శాంతి వైపు ఉంది’’ అని మోదీ అన్నారు.
భారత్ ఎల్లప్పూడు రష్యా, ఉక్రెయిన్ తో సన్నిహితంగా ఉంటోంది. రెండు దేశాల నాయకులను కలిశాను. పుతిన్ తో మాట్లాడుతూ ఇది యుద్దాలు చేయడానికి ఇది సమయం కాదని తాను పునరుద్ఘాటించానని మోదీ అన్నారు.
‘‘ఈ రోజుకు కూడా సమస్యకు పరిష్కరాలు యుద్దభూమిలో దొరకవని నా దృఢ నమ్మకం, చివరకు ఏదైన చర్చలతోనే సాధ్యమవుతుందన్నారు. వీలైనంత త్వరగా ఆయన విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
మాగా వర్సెస్ మైగా
ట్రంప్ నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ తో సమాంతరంగా భారత ప్రధానమంత్రి 2047 నాటికి భారత్ అభివృద్ది చెందాలనే దార్శనికత గురించి మాట్లాడారు.
‘‘ అమెరికా ప్రజలకు మగా గురించి బాగా తెలుసు. భారత ప్రజలు కూడా వికసిత్ భారత్ 2047 వైపు అడుగులు వేస్తున్నారు. అమెరికా భాషలో చెప్పాలంటే.. ఇది మేక్ఇండియా గ్రైట్ అగైన్(మిగా) అమెరికా- భారత్ కలిసి పనిచేస్తే అంటే మగా ప్లస్ మిగా కలిస్తే మెగా భాగస్వామ్యంగా మారుతుంది. ఈ రోజు ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని నిర్ణయించుకున్నాము’’ అని ఆయన అన్నారు.
ట్రంప్ ను కలవడానికి ముందు ప్రధాని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్, నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్, బిలియనీర్ ఇలాన్ మస్క్, రిపబ్లికన్ నాయకుడు వివేక్ రామస్వామిలతో విడివిడిగా చర్చలు జరిపారు.
Read More
Next Story