‘రఫా’ పై దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్
x

‘రఫా’ పై దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్, ఈజిప్టు సరిహద్దు ఆనుకుని ఉన్న రఫా పట్టణంపై దాడులు మొదలుపెట్టింది. ఇది గాజాలోని చివరి భూభాగం. ఇప్పటికే ఉత్తర, మధ్య గాజాలో ఉన్న హమాస్ మూకలని ఏరేసిన..


ఇజ్రాయెల్- హమాస్ టెర్రర్ గ్రూపు మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే గాజాలోని అన్ని కీలక పట్టణాలపై దాడులు చేసిన ఐడీఎఫ్( ఇజ్రాయెల్ సైన్యం) ఇప్పుడు చివరిదైన రఫాపై కూడా దాడులు మొదలుపెట్టింది. రాత్రిపూట టెల్ అవీవ్ జరిపిన దాడుల్లో దాదాపు 13 మంది మరణించారని అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇందులో దాదాపు 9 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు.

గాజా జనాభా దాదాపు 23 లక్షలు కాగా ఇప్పటికే ఉత్తర గాజా, ఖాన్ యూనిస్ పట్టణాలు దాదాపుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసి హమాస్ తీవ్రవాదులను ఏరి వేసింది. రఫా పై కూడా దాడి చేసి మిగిలిన హమాస్ తీవ్రవాదులను తుదముట్టిస్తామని ఇంతకుముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహూ శపథం చేశారు.

ప్రపంచ ఒత్తిడులకు తలొగ్గబోమని స్పష్టం చేశారు. వాషింగ్టన్, టెల్ అవీవ్ కు మరోమారు సైనిక సాయం కూడా ప్రకటించింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ శనివారం USD 26 బిలియన్ల సహాయ ప్యాకేజీని ఆమోదించింది, ఇందులో గాజా కోసం USD 9 బిలియన్ల మానవతా సహాయం ఉంటుంది. మరో వైపు అంతర్జాతీయంగా సంయమనం పాటించాలని పిలుపునిచ్చినప్పటికీ, ఈజిప్టు సరిహద్దులో ఉన్న రఫా పై భూతల దాడులకు సైతం ప్రణాళికలు వేస్తున్నామని ఐడీఎఫ్ వెల్లడించింది.

ఇజ్రాయెల్ వైమానిక దళం మొదటి సారి దాడి జరిపినప్పుడు ఒక వ్యక్తి, అతని భార్య, వారి 3 ఏళ్ల బిడ్డ మరణించారని, సమీపంలోని కువైట్ ఆసుపత్రి తెలిపింది. మహిళ గర్భవతి అని, వైద్యులు శిశువును రక్షించగలిగారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.
రెండవ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది పిల్లలు, ఇద్దరు మహిళలు మరణించినట్లు ఆసుపత్రి రికార్డులు చెబుతున్నాయి. ముందు రోజు రాత్రి రఫాలో జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది మరణించారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 34 వేలమంది పాలస్తీనియన్లు మరణించారు. స్థానిక అధికారుల ప్రకారం.. రెండు పెద్ద నగరాలు నేలమట్టం అయ్యాయి. 80 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి తీర ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇక్కడ విపత్తు తీవ్ర దశకు చేరుకుందని అంటున్నారు.
ఇప్పటికే పశ్చిమాసియా మొత్తం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇజ్రాయోల్, ఇద్దరు ఇరాన్ టాప్ కమాండర్లను వైమానికదాడిలో హతం చేయడంతో, టెహ్రన్ కూడా వందల కొద్ది మిస్సైల్లు, డ్రోన్లతో దాడులకు దిగింది. వీటిని అమెరికా కూటమి నేలకూల్చగా, కొన్ని మాత్రమే ఇజ్రాయెల్ ను తాకాయి. మొన్న టెల్ అవీవ్ కూడా టెహ్రన్ భూభాగంపై మిస్సైల్లు ప్రయోగించింది.
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ వెస్ట్ బ్యాంక్ పట్టణం హెబ్రోన్ సమీపంలో కత్తి, తుపాకీతో చెక్‌పాయింట్‌పై దాడి చేసిన ఇద్దరు పాలస్తీనియన్లను ఐడీఎఫ్ దళాలు తుదముట్టించాయి.
పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 469 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైనికులు, వెస్ట్ బ్యాంక్‌లో స్థిరపడిన వారిచే చంపబడ్డారు. ఇజ్రాయెల్ సైనిక నిర్బంధ దాడుల సమయంలో చాలా మంది మరణించారు. ఇలాంటి ఘటనలు ఇక్కడ తరుచూగా ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతున్నాయి.
అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాద సంస్థ అనూహ్యంగా దాడి చేయడంతో 1200 సాధారణ ఇజ్రాయెలీ పౌరులు మరణించారు. దాదాపు 250 మందని అపహరించారు. తీవ్రవాదుల దగ్గర మరో 100 మంది బందీలు ఉంటారని, మరో 30 డెడ్ బాడీలు సైతం వారి దగ్గరే ఉన్నాయని ఐడీఎఫ్ తెలిపింది. బెంజమిన్ నెతాన్యహూ రాజీనామా చేయాలని, బందీలను విడుదల చేయడానికి హమాస్ తో ఒప్పందం చేసుకోవాలని కోరుతూ వేలాదిమంది యూదు పౌరులు వీధుల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
అయితే హమాస్ ను నాశనం చేసి తమ పౌరులందరిని విడిపిస్తామని ఆయన చెబుతున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 13 వేల మంది హమాస్ తీవ్రవాదులను మట్టుబెట్టామని ఐడీఎఫ్ ప్రకటించింది.
Read More
Next Story