ఇజ్రాయెల్: హమాస్ దాడికి ఐడీఎఫ్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
x

ఇజ్రాయెల్: హమాస్ దాడికి ఐడీఎఫ్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

ఇజ్రాయెల్ దళాలపై హమాస్ జరిపిన దాడిలో ఎనిమిదిమంది భద్రతా సిబ్బంది మరణించారు. దీనిపై టెల్ అవీవ్ ఎలా విరుచుకుపడుతుందో అని..


ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో ఐడీఎఫ్ దళాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాజాలో ఆపరేషన్ ముగించి వెనుదిరిగి వస్తున్న భద్రతా దళాలపై హమాస్ జరిపిన దాడిలో ఎనిమిది సైనికులు మృతి చెందారు. దీనిని ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు ధృవీకరించారు. యుద్దం దాదాపుగా విరమణకు వస్తున్న సమయంలో జరిగిన ఈ దాడితో రెండు దేశాల మధ్య మరోమారు సాయుధ ఘర్షణ తీవ్రం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఇజ్రాయెల్- గాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు ఇజ్రాయెల్ లో కూడా ఈ సంఘటనపై ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. నిరసనకారులు ఇప్పటికే కాల్పుల విరమణ జరపాలని, యుద్ధ క్యాబినేట్ పై ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోంది.

అక్టోబరు 7న హమాస్ తీవ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో దాదాపు 1200 మంది అమాయక ఇజ్రాయోలీలు మృతి చెందారు. మరో 250 మందిని బందీలుగా హమాస్ ఉగ్రవాదులు తీసుకెళ్లారు. దీనికి ప్రతీగా ఐడీఎఫ్ దళాలు గాజాపై జరుపుతున్న దాడిలో దాదాపు 37 వేల మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించారు. ఇక్కడ దాదాపు 80 శాతం మంది ప్రజలు తమ నివాసాలను వదిలి వలస బాట పట్టారు. యుద్ధంతో తీవ్ర మానవతా సంక్షోభం తలెత్తింది.
ఇజ్రాయెల్, ఉత్తర ప్రాంతాలను ఇప్పుటికే జల్లేడ పట్టింది. దక్షిణ ప్రాంతమైన రఫాపై దాడులను ఉధృతం చేసింది. రెండు రోజులకు ముందు జరిపిన దాడిలో ఐదుగురు బందీలను రక్షించింది. అయితే ఇక్కడ హమాస్ తో జరిపిన దాడిలో దాదాపు 200 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందారు. బందీలను హమాస్ సాధారణ ప్రజల నివాసాల మధ్యలో ఉంచింది. ఈ కారణంగానే భారీ స్థాయిలో పౌరమరణాలు సంభవించాయి. రఫాలో భారీ స్థాయిలో గ్రౌండ్ ట్రూపులను టెల్ అవీవ్ మోహరించింది.
"తమ ప్రాణాలను త్యాగం చేయవలసి ఉంటుందని వారికి తెలుసు, కాని మేము ఈ దేశంలో జీవించడానికి వారు ఈ త్యాగం చేయకతప్పదు. నేను వారికి సెల్యూట్ చేస్తున్నాను.నేను వారి కుటుంబాలను కౌగిలించుకుంటున్నాను, ”అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ గతంలో ట్విటర్‌లో ఎక్స్‌లో పోస్ట్ చేసారు.
రఫాలోని తాల్ అల్-సుల్తాన్ ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటల తర్వాత పేలుడు సంభవించిందని సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి రియర్ అడ్మ్ డేనియల్ హగారి మాట్లాడుతూ, ఇది హమాస్ పెట్టిన పేలుడు పదార్థం లేదా ట్యాంక్ వ్యతిరేక క్షిపణి వల్ల దాడి జరిగిందని అనుకుంటున్నాను. "మేము హమాస్ రఫా బ్రిగేడ్‌ను ఓడించాల్సిన అవసరం ఉంది. మేము దీనిని సంకల్పంతో చేస్తున్నాము," అని ఐడీఎఫ్ అధికారి చెప్పాడు.
జనవరిలో గాజాలో పాలస్తీనా మిలిటెంట్లు జరిపిన ఒకే దాడిలో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఆ దాడి తరువాతే ఇదే అతి పెద్ద దాడి. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ నెల ప్రారంభంలో ఒక కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను ముందుంచారు. ఈ ప్రతిపాదన ప్రకారం దాదాపు 120 మంది బందీలను హమాస్ విడిచిపెట్టాలి. అంతర్జాతీయ సమాజం ఈ ప్రణాళికను అమలు చేయాలని అంగీకరించినప్పటికీ ఇజ్రాయెల్- హమాస్ మాత్రం పరస్పరం అనుమానాలు వ్యక్తం చేశాయి. దీనికి తోడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ.. హమాస్ ను నాశనం చేసే వరకూ యుద్దాన్ని ఆపే ప్రసక్తే లేదని తెగేసీ చెప్పారు.
"మాతృభూమి రక్షణ కోసం మా న్యాయమైన యుద్ధంలో ఈ రోజు మనం మరో హృదయ విదారకమైన మూల్యాన్ని చెల్లించాము" అని నెతన్యాహు శనివారం అన్నారు. "తీవ్రమైన దుఃఖంతో, భారీ శోకంలో, ఇజ్రాయెల్ పౌరులందరితో కలిసి నా శిరస్సు వంచి, మన వీరోచిత యోధుల మరణానికి సంతాపం తెలియజేస్తున్నాను." భావోద్వేగంతో మాట్లాడారు.
ప్రజల మధ్య చీలిక..
అసంకల్పిత యుద్ధం ఇజ్రాయెల్ ప్రజలను విభజించింది, ప్రతి శనివారం రాత్రి పదివేల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి బందీలను ఇంటికి తీసుకువచ్చే ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటికే హమాస్ చేతిలో ఉన్న బందీలలో 40 మందికి పైగా మరణించినట్లు ప్రకటించింది. హమాస్ చెరలో ఉన్నంత వరకూ బందీలు ప్రాణాలతో ఉండే అవకాశం క్రమక్రమంగా తగ్గుతుందని అధికారులు భయపడుతున్నారు.
"120 మందికి పైగా బందీలు ఇప్పటికీ హమాస్ చెరలో ఉన్నారు, నేను రక్షించబడ్డాను. వారు నాలా సురక్షితంగా లేనందున నేను ఈ పరిస్థితి నుంచి ఆనందాన్ని అనుభవించలేను," అని ఒక బందీ అన్నారు. బందీల కుటుంబాల ఫోరమ్ ప్రధాన కార్యాలయం ప్రకారం “వీలైనంత త్వరగా వారిని ఇంటికి తీసుకురావాలని నేను కోరుతున్నాను. ఇజ్రాయెల్, ప్రపంచం, హమాస్, వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.
మరో వైపు నెతన్యాహూ ప్రభుత్వానికి సపోర్టు చేస్తున్న అల్ట్రా-ఆర్థోడాక్స్ పురుషులకు ఇచ్చిన మిలిటరీ డ్రాఫ్ట్ వివాదాస్పద మినహాయింపులను పొడిగించడానికి సంకీర్ణ ప్రభుత్వం అనుకూలంగా ఓటు వేసిన రోజుల తర్వాత ఘోరమైన పేలుడు సంభవించింది. గత నెలలో, ఇజ్రాయెల్ సుప్రీం కోర్ట్ సైన్యంలో సేవ చేయని అల్ట్రా-ఆర్థోడాక్స్ పురుషులకు ప్రభుత్వ రాయితీలను నిలిపివేయాలని ఆదేశించింది. కానీ రాజకీయంగా శక్తివంతమైన అల్ట్రా-ఆర్థోడాక్స్ పార్టీల సపోర్ట్ తో ఉన్న నెతన్యహూ ప్రభుత్వం మరోమార్గం ద్వారా వారి సంస్థలకు రాయితీలు అందిస్తోంది. దీనికోసం కొత్త ముసాయిదాలను ఆమోదించాలని ప్రభుత్వ ఉత్తర్వూల్లో పేర్కొంది.
చాలా మంది యూదు పురుషులు, మహిళలు 18 సంవత్సరాల వయస్సు నుంచి సైన్యంలో పనిచేయవలసి ఉంటుంది. అయితే మతపరంగా కొన్ని మినహంపులు పొందిన కొన్ని సమూహాలకు సైన్యంలో పని చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలలో వివాదానికి దారి తీసింది.

ఈ వారం చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసిన నెతన్యాహు సంకీర్ణంలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ మాత్రమే సభ్యుడు. గాజా స్ట్రిప్‌లో హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ సమాజంలోని అన్ని రంగాలు సమానంగా దోహదపడాలని ఆ దేశ వార్ క్యాబినెట్ సభ్యుడు గాలంట్ పట్టుబట్టారు.

నెతన్యాహు కు సపోర్ట్ చేస్తున్న అల్ట్రా-ఆర్థోడాక్స్ భాగస్వాములు ప్రభుత్వం నుంచి వైదొలిగినట్లయితే, నెతన్యాహూ ప్రభుత్వం తిరిగి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు కావాల్సి ఉంటుంది.
కాల్పుల విరమణ పై..
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీసుకురావాలని అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. అయితే నెలల తరబడి చేస్తున్న కాల్పులు విరమణ చర్చలు విఫలమవుతున్నాయి. బుధవారం యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ మాట్లాడుతూ .. ఇరుపక్షాల వాదనల్లో కొన్ని పని చేయదగినవి, కొన్ని అమలు కాలేవి అన్నారు. యూఎస్ కొన్నింటికి హమీ ఇస్తున్నప్పటికీ వాటిని ఇజ్రాయెల్ అంగీకరిస్తుందో లేదో అన్న సంశయాన్ని ఉగ్రవాద సంస్థ హమాస్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా గాజాలో యుద్దం చేస్తున్న ఐడీఎఫ్ దళాలను వెనక్కి తీసుకోవడానికి టెల్ అవీవ్ అంగీకరించదని దాని సంశయం.
ఇంతలో, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం చెలరేగినప్పటి నుంచి వెస్ట్ బ్యాంక్‌లో హింస చెలరేగింది. శనివారం, ఉత్తర నగరమైన నాబ్లస్ సమీపంలో 16 ఏళ్ల పాలస్తీనియన్‌ను ఇజ్రాయెల్ దళాలు కాల్చి చంపినట్లు రమల్లా ఆధారిత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో తీవ్రవాద నిరోధక ఆపరేషన్ సందర్భంగా సైనికులపై రాళ్లు రువ్వుతున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ భద్రతా అధికారి ధృవీకరించారు. హమాస్, లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లా దాడుల వల్ల 600 మంది యూదు సైనికులు మృతి చెందారు.


Read More
Next Story